IND vs SA: దక్షిణాఫ్రికాతో తొలి టీ20లో భారత్ తరపున ఆడే 11 మంది వీరేనా.. కొందరు ఆటగాళ్లను వేధిస్తున్న ఫిట్ నెస్ సమస్య..
ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ గెల్చుకున్న తర్వాత భారత్ స్వదేశంలో దక్షిణాఫ్రికాతో మరో మూడు టీ20 మ్యాచ్ లను ఆడనుంది. మొదటి టీ20 మ్యాచ్ సెప్టెంబర్ 28వ తేదీన కేరళలోని తిరువనంతపురం వేదికగా జరగనుంది. టీ20 ప్రపంచ కప్ కు ముందు..
ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ గెల్చుకున్న తర్వాత భారత్ స్వదేశంలో దక్షిణాఫ్రికాతో మరో మూడు టీ20 మ్యాచ్ లను ఆడనుంది. మొదటి టీ20 మ్యాచ్ సెప్టెంబర్ 28వ తేదీన కేరళలోని తిరువనంతపురం వేదికగా జరగనుంది. టీ20 ప్రపంచ కప్ కు ముందు జరుగుతున్న సిరీస్ కావడంతో ఇరు జట్లు ఈసిరీస్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. టీ20 సిరీస్ మూడు మ్యాచ్ లు ఆడనున్నప్పటికి మొదటి మ్యాచ్ లో గెలవడం ద్వారా సిరీస్ పై ఆధిపత్యం కోసం ఇరు జట్లు ఎవరి ప్రణాళికలతో వారు బరిలోకి దిగనున్నారు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న సిరీస్ కు ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా, పేసర్ భువనేశ్వర్ కుమార్ కు విశ్రాంతి ఇచ్చారు. దీంతో మొదటి మ్యాచ్ లో భారత్ తరపున ఆడనున్న ప్లేయింగ్ లెవన్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరోవైపు కొంతమంది క్రీడాకారులను ఫిట్ నెస్ సమస్య వేధిస్తుండటంతో తుది జట్టులో ఎవరెవరు ఆడతారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. భారత జట్టులో రోహిత్ శర్మ(కెప్టెన్), కె.ఎల్.రాహుల్(వైస్-కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్, దినేష్ కార్తీక్, రవిచంద్ర అశ్విన్, వై.చహల్, అక్షర్ పటేల్, అర్ష్ దీప్ సింగ్, మహ్మద్ షమీ, హర్షల్ పటేల్, దీపక్ చహర్, జస్ ప్రీత్ బూమ్రా తో పాటు శ్రేయస్ అయ్యర్, ఉమేష్ యాదవ్, షాజాబ్ అహ్మద్ లను జట్టులోకి ఎంపిక చేశారు. దీపక్ హుడాకు గాయం కావడంతో అతడి స్థానంలో శ్రేయస్ అయ్యర్ కు ఛాన్స్ దొరికింది.
ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ ను 2-1తో గెల్చుకున్న తర్వాత దక్షిణాఫ్రికాతో భారత జట్టు తలపడనుంది. ఐసీసీ ర్యాంకింగ్స్ లో మొదటి స్థానంలో ఉన్న భారత్ మూడో స్థానంలో ఉన్న దక్షిణాఫ్రికాతో ఆడబోతుంది. ఈ సిరీస్ ను గెలవడం ద్వారా టీ20 ప్రపంచ కప్ కు విజయాలతో వెళ్లాలని భారత్ కృతనిశ్చయంతో ఉంది. స్వదేశంలో సౌతాఫ్రికాతో జరిగే మొదటి టీ20 మ్యాచ్ లో భారత్ తరపున తుది జట్టులో ఆడే 11 మంది క్రీడాకారుల్లో కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ కెఎల్.రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్, రవిచంద్ర అశ్విన్, యుజ్వేంద్ర చహల్, అర్ష్ దీప్ సింగ్, దీపక్ చహర్, జస్ ప్రీత్ బూమ్రాకు అవకాశం దొరికే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
రోహిత్ శర్మ (కెప్టెన్): కెప్టెన్ రోహిత్ శర్మ మంచి ఫామ్ లో ఉన్నాడు. ఆస్ట్రేలియాపై రెండో టీ20లో 46 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. దీంతో రోహిత్ శర్మ దక్షిణాఫ్రికా తో జరిగే మ్యాచ్ లోనూ తన ఫామ్ ను కొనసాగించే ఛాన్స్ ఉంది.
కె.ఎల్.రాహుల్ (వైస్ కెప్టెన్): రైట్ హ్యాండ్ బ్యాట్స్ మెన్ అయిన కె.ఎల్.రాహుల్ ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్ లో మొదటి మ్యాచ్ లో ఆఫ్ సెంచరీతో ఆకట్టుకున్నప్పటికి తరువాత రెండు మ్యాచుల్లోనూ అదే ఫామ్ ను కొనసాగించ లేకపోయాడు. రెండో మ్యాచ్ లో 10 పరుగులు, మూడో మ్యాచ్ లో ఒక పరుగు మాత్రమే చేయగలిగాడు. అయితే ఒక్కసారి పుంజుకుంటే అదే ఫామ్ ను కె.ఎల్.రాహుల్ కొనసాగించే అవకాశం ఉన్నట్లు క్రీడారంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.
విరాట్ కోహ్లి: ఈమధ్య కాలంలో తిరిగి ఫామ్ లోకి వచ్చిన కోహ్లీ ఆసియా కప్ లో సెంచరీ చేయడంతో పాటు ఆస్ట్రేలియాతో జరిగిన మూడో మ్యాచ్ లో విజయం సాధించడంలో కోహ్లీ కీలక పాత్ర పోషించాడు. 63 పరుగులు చేసి జట్టు విజయంలో తన పాత్రను పోషించాడు. కోహ్లీ తిరిగి ఫామ్ లోకి రావడంతో అతడి నుంచి దక్షిణాఫ్రికా సిరీస్ లోనూ మంచి బ్యాటింగ్ ను చూడవచ్చనే అంచనాలు నెలకొన్నాయి.
సూర్య కుమార్ యాదవ్: ఈ విధ్వంసకర బ్యాట్స్ మెన్ గురించి ఎక్కువుగా చెప్పాల్సిన అవసరం లేదు. మిస్టర్ 360గా అవకాశం దొరికిన ప్రతి మ్యాచ్ లో తన సత్తాచాటుతూ వస్తున్నాడు. ఆస్ట్రేలియాపై తొలి టీ20 మ్యాచ్ లో 46 పరుగులు, చివరి మ్యాచ్ లో 69 పరుగులు చేశాడు. దీంతో సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ పై మరిన్ని అంచనాలు పెరిగాయి.
దినేష్ కార్తీక్(వికెట్ కీపర్): దినేష్ కార్తీక్ ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్ లో పెద్దగా ప్రభావం చూపించలేకపోయాడు. మొదటి మ్యాచ్ లో 6, రెండో మ్యాచ్ లో 10, మూడో మ్యాచ్ లో ఒక పరుగు మాత్రమే చేశాడు. అయినా సరే ఆఖరి ఓవర్లలో మంచి ఫినిషింగ్ ఇవ్వగలడనే నమ్మకం అతనిపై ఉండటంతో పాటు వికెట్ కీపర్ గా తనదైన పాత్ర పోషిస్తుండటంతో టీమ్ మేనేజ్ మెంట్ దినేష్ కార్తీక్ పై నమ్మకం ఉంచి అవకాశం కల్పిస్తూ వస్తుంది. అందులో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగే మొదటి టీ20 మ్యాచ్ లో కూడా దినేష్ కార్తీక్ కు అవకాశం దొరికే ఛాన్స్ ఉంది.
అక్షర్ పటేల్: ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్ లో టాప్ బౌలర్ గా నిలిచిన అక్షర పటేల్ దక్షిణాఫ్రికాతో జరిగే మ్యాచ్ లో తప్పకుండా ప్లేయింగ్ 11లో స్థానం సంపాదించే ఛాన్సెస్ ఉన్నాయి. మూడు మ్యాచుల్లో కలిపి అక్షర్ పటేల్ 8 వికెట్లు తీశాడు.
రవిచంద్ర అశ్విన్: ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్ లో భారత జట్టులో స్థానం దొరికనప్పటికి ఏ మ్యాచ్ లోనూ ప్లేయింగ్ 11లో చోటు దక్కలేదు. అయితే దక్షిణాఫ్రికాతో జరిగే తొలి టీ20 మ్యాచ్ లో ఆఫ్ స్పిన్నర్ తో వెళ్లాలని టీమ్ మేనేజ్ మెంట్ డిసైడ్ అయితే మాత్రం తప్పకుండా రవిచంద్ర అశ్విన్ కు చోటు దక్కే అవకాశాలున్నాయి.
యుజ్వేంద్ర చాహల్: ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్ లో మూడు మ్యాచుల్లోనూ ఈ ఆటగాడికి అవకాశం దొరికినప్పటికి మొదటి రెండు మ్యాచుల్లో పెద్దగా రాణించకపోయినా, మూడో టీ20లో మాత్రం బాగా రాణించాడు. ఆసీస్ తో మొదటి రెండు మ్యాచుల్లో ఎక్కువ పరుగులు ఇవ్వడం ఆందోళన కలిగించే అంశమైనప్పటికి, ఆటగాడిపై నమ్మకంతో చాహల్ కు తుది జట్టులో చోటు దక్కే అవకాశాలు ఉన్నాయి.
అర్ష్ దీప్ సింగ్: అర్ష్ దీప్ సింగ్ పై టీమ్ మేనేజ్ మెంట్ ఎంతో విశ్వాసంతో ఉంది. భవిష్యత్తులో భారత్ జట్టులో కీలకమైన బౌలర్ గానూ అర్ష్ దీప్ ను పరిగణిస్తోంది. మరోవైపు దక్షిణాఫ్రికాతో తొలి టీ20 మ్యాచ్ లో లెఫ్టార్మ్ పేసర్ తో వెళ్లాలనుకుంటే అర్ష్ దీప్ సింగ్ కు ఛాన్స్ దొరకనుంది.
దీపక్ చాహర్: హార్థిక్ పాండ్యా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న సిరీస్ లో ఆడటంలేదు. దీంతో అతడి స్థానాన్ని పూరించడానికి తుది జట్టులో దీపక్ చాహర్ కి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. రైట్ ఆర్మ్ పేసర్ ను జట్టులో ఆడించడం కోసం దీపక్ చాహర్ ను ప్లేయింగ్ 11లో ఎంపికచేసే అవకాశం ఉంది.
జస్ ప్రీత్ బూమ్రా: ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్ లో మూడో మ్యాచ్ లో నాలుగు ఓవర్ల కోటాలో 50 పరుగులు ఇచ్చినప్పటికి, దక్షిణాఫ్రికాతో జరిగే మ్యాచ్ లో తిరిగి తన మునుపటి ప్రదర్శనను కొనసాగించాలనే పట్టదలతో ఉన్నాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం చూడండి..