Sri Charani: కడప నుంచి క్రికెట్‌కు.. ప్రపంచకప్‌లో దుమ్మురేపిన ఆంధ్రా అమ్మాయి.. అసలు ఎవరీ శ్రీచరణి.?
Kadapa Girl Sri Charani: భారత యువ స్పిన్నర్ శ్రీ చరణి ఈ టోర్నమెంట్‌లో తన అద్భుతమైన బౌలింగ్‌తో అందరినీ ఆకట్టుకుంది. ఫైనల్ మ్యాచ్‌లోనూ అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకుంది. ఈ టోర్నమెంట్‌లో చరణి తొమ్మిది మ్యాచ్‌లు ఆడి, తొమ్మిది ఇన్నింగ్స్‌లలో 14 వికెట్లు పడగొట్టింది. టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించింది.

Kadapa Girl Sri Charani: భారత మహిళల క్రికెట్ జట్టు మొట్టమొదటిసారిగా ఐసీసీ మహిళల ప్రపంచ కప్‌ను గెలుచుకున్న ఈ చారిత్రక విజయంలో, ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా నుంచి వచ్చిన యువ స్పిన్నర్ నల్లపురెడ్డి శ్రీ చరణి ప్రదర్శన క్రికెట్ అభిమానుల దృష్టిని ఆకర్షించింది. తన తొలి ప్రపంచ కప్‌లోనే అత్యంత కీలక పాత్ర పోషించి, కడప అమ్మాయి దేశం గర్వించేలా చేసింది.
అరంగేట్రంలోనే అద్భుత ప్రదర్శన..
21 ఏళ్ల లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ స్పిన్నర్ అయిన శ్రీ చరణికి ఇది అంతర్జాతీయ క్రికెట్‌లో కేవలం తొలి అడుగు మాత్రమే. ఈ ఏడాది ఏప్రిల్‌లో శ్రీలంకపై వన్డేల్లో అరంగేట్రం చేసిన ఆమె, ప్రపంచ కప్ వంటి మెగా టోర్నీలో ఏమాత్రం బెదరకుండా, ఒత్తిడిని అధిగమించి ఆడింది.
ప్రపంచ కప్‌లో భారత బౌలర్లలో దీప్తి శర్మ (22 వికెట్లు) తర్వాత అత్యధికంగా 13 వికెట్లు తీసిన రెండో బౌలర్ శ్రీ చరణి. వికెట్లు తీయడమే కాకుండా, తన కట్టుదిట్టమైన బౌలింగ్‌తో పరుగులు ఇవ్వకుండా ప్రత్యర్థి బ్యాటర్లపై ఒత్తిడి పెట్టింది.
డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో జరిగిన ఉత్కంఠభరిత సెమీ-ఫైనల్‌లో భారత బౌలర్లు పరుగులు సమర్పించుకుంటున్న సమయంలో, శ్రీ చరణి తన 10 ఓవర్ల స్పెల్‌లో కేవలం 4.90 ఎకానమీతో 49 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు కీలక వికెట్లు తీసింది. ఆమె బౌలింగ్ ఆసీస్ దూకుడుకు కళ్లెం వేసి, భారత్‌కు విజయాన్ని సాధించిపెట్టడంలో కీలకమైంది.
కడప నుంచి టీమిండియా వరకు స్ఫూర్తిదాయక ప్రయాణం..
Congratulations to the women’s cricket team and thank you for bringing us the world cup 😉
మన కడప ఆడ బిడ్డ శ్రీ చరణి కి మా హార్దిక శుభాకాంక్షలు💐🤝
Thank you for inspiring all and showing the power of women.
showing what our potential is 🙂#kadapa#sricharani #WorldCup2026… pic.twitter.com/yV7SexWTbE
— Dasharath annareddy (@dasarath418) November 3, 2025
శ్రీ చరణి ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకం. ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా, వీరపునాయునిపల్లె మండలం, ఎర్రమల్లె గ్రామం నుంచి వచ్చిన ఆమె, సాధారణ నేపథ్యం నుంచి అత్యున్నత వేదికపైకి చేరుకుంది.
కుటుంబ నేపథ్యం..
ఆమె తండ్రి చంద్రశేఖర్ రెడ్డి రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్ట్‌లో చిన్న ఉద్యోగిగా పనిచేసేవారు. ఆట పట్ల ఆమెకున్న అంకితభావం, పట్టుదలే ఆమెను ఉన్నత స్థాయికి చేర్చింది.
WPL అరంగేట్రం..
డబ్ల్యూపీఎల్ (WPL) మినీ వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఆమెను రూ. 55 లక్షలకు కొనుగోలు చేయడంతో ఆమె పేరు వెలుగులోకి వచ్చింది. ఈ లీగ్‌లో రెండు మ్యాచ్‌ల్లోనే 4 వికెట్లు తీసి జాతీయ సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించింది.
మొదట చిన్ననాటి ఆటగా కేవలం సరదాగా మొదలుపెట్టిన క్రికెట్ ప్రయాణం, ఈరోజు భారత మహిళల జట్టుకు ప్రపంచ కప్ అందించడంలో భాగమైంది. ప్రపంచ కప్ ఫైనల్ వంటి పెద్ద వేదికపై ఏమాత్రం భయపడకుండా రాణించిన శ్రీ చరణి, రానున్న రోజుల్లో భారత క్రికెట్‌కు గొప్ప ఆస్తిగా మారుతుందని క్రీడా పండితులు ప్రశంసిస్తున్నారు.




