Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virat Kohli: కోహ్లీ భవిష్యత్తుపై భిన్నాభిఫ్రాయాలు.. టీ20 ఫార్మాట్‌లో ఇకపై ముందుకు సాగేనా.. తప్పుకునేనా?

టీమ్ మేనేజ్‌మెంట్ ఇప్పటివరకు కోహ్లిపై విశ్వాసం ఉంచినప్పటికీ, కోహ్లీ పేరును ఎంపిక చేయడాన్ని మాత్రం మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ తీవ్రంగా మండిపడ్డారు.

Virat Kohli: కోహ్లీ భవిష్యత్తుపై భిన్నాభిఫ్రాయాలు.. టీ20 ఫార్మాట్‌లో ఇకపై ముందుకు సాగేనా.. తప్పుకునేనా?
Icc T20 Wc, Virat Kohli
Follow us
Venkata Chari

|

Updated on: Jul 11, 2022 | 8:57 PM

ఫామ్‌లో లేని విరాట్ కోహ్లీ భవితవ్యంపై భారత మాజీ క్రికెటర్లు తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. మాజీ కెప్టెన్ ఇప్పటివరకు టీ20ల్లో భారత్‌ జట్టులో ఎంపికయ్యే 11 మందిలో ఒకడిగా పేరుగాంచాడు. కానీ, అన్ని ఫార్మాట్లలో తన పేలవ ఫాంతో తంటాలు పడుతోన్న విరాట్ కోహ్లీ, పొట్టి ఫార్మాట్‌లోనూ ఘోరంగా విఫలమవుతూ, అందర్ని నిరాశపరుస్తు్న్నాడు. అయితే అక్టోబర్‌లో ఆస్ట్రేలియాలో జరగనున్న T20 ప్రపంచ కప్‌ 2022 నేపథ్యంలో మూడు ఫార్మాట్‌లలో 70 సెంచరీలు చేసిన ఓ ఆటగాడిపై తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. కాగా, మూడేళ్లుగా అంతర్జాతీయ సెంచరీ లేకుండా జట్టులో తన స్థానాన్ని సమర్థించుకోవడానికి విరాట్ కోహ్లీకి కూడా ఎలాంటి కారణాలు లేవు. దీంతో ఆడితేనే జట్టులో, లేదంటే మాత్రం జట్టు నుంచి బయటకు వెళ్లాల్సిదేనంటూ ఎందరో కామెంట్లు కూడా చేస్తున్నారు. మరి ఇలాంటి నేపథ్యంలో విరాట్ భవితవ్యం ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది.

ఇంగ్లండ్‌తో జరిగిన రెండు T20Iలలో, కోహ్లి వరుసగా 1, 11 పరుగులు మాత్రమే చేసి, తీవ్రంగా నిరాశపరిచాడు. అంతకుముందు ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో 11, 20 పరుగులు చేసిన తన బ్యాడ్ ఫామ్‌తో ఇబ్బందులు పడ్డాడు. అలాగే IPL 2022లో 16 మ్యాచ్‌లలో 22.73 సగటు, 115.98స్ట్రైక్ రేట్‌తో కేవలం 341 పరుగులు చేసి, ఫ్యాన్స్‌ను తీవ్రంగా నిరాశపరిచాడు.

టీమ్ మేనేజ్‌మెంట్ ఇప్పటివరకు కోహ్లిపై విశ్వాసం ఉంచినప్పటికీ, కోహ్లీ పేరును ఎంపిక చేయడాన్ని మాత్రం మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ తీవ్రంగా మండిపడ్డారు. దీంతో వరుసగా మాజీలు కోహ్లీ తీరుపై మండిపడుతున్నారు.

ఇవి కూడా చదవండి

కాగా, భారత మాజీ వికెట్ కీపర్, మాజీ సెలెక్టర్ సబా కరీమ్ మాత్రం కోహ్లీ అనుభవం T20 ప్రపంచ కప్‌లో కీలకం అంటూ వ్యాఖ్యలు చేశాడు. అందుకే టీ20 జట్టులో ఉండాలంటూ అభిప్రాయపడుతున్నాడు.

“నేను ఇప్పటికీ సెలెక్టర్‌గా ఉంటే, నేను ఖచ్చితంగా ఎంపిక చేస్తాను. అతను మ్యాచ్ విన్నర్. ప్రపంచ కప్ కోసం విరాట్ ఇంకా 10 కంటే ఎక్కువ T20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. 15 మంది సభ్యుల జట్టులో విరాట్, దీపక్ హుడా ఇద్దరూ అర్హులని నేను భావిస్తున్నాను” అంటూ తెలిపాడు.

“అవును, విరాట్‌ ఇంగ్లండ్‌తో ఆడిన రెండు టీ20ల్లో ఆకట్టుకోలేదు. కానీ ఇంకా చాలా మ్యాచ్‌లు ఉన్నాయి. అతనిని నేను నమ్ముతున్నాను. అతను ముందు సెలెక్టర్ల మద్దతు పొందాలి. తన వంతు ప్రయత్నం చేస్తున్నాడు. విరాట్ లాంటి ఆటగాళ్లు చాలా ఏళ్లుగా దొరకరు. కొన్ని మ్యాచ్‌ల ఆధారంగా అతడిని తప్పించడం లేదా వదులుకోవడం సాధ్యం కాదు. సెంచరీ సాధించడమే ప్రమాణం కాకూడదు. చాలామంది భారత ఆటగాళ్లు తమ కెరీర్‌లో ఒక్క సెంచరీ కూడా చేయలేదు. అలా ఎన్నో సంవత్సరాలు ఆడారు. కాబట్టి జట్టుకు సహకారం అందించడం, దోహదపడే సామర్థ్యం మాత్రమే సమీకరణంలోకి తీసుకోవాలి” అని ఆయన పేర్కొన్నాడు.

భారత మాజీ క్రికెటర్, మాజీ కోచ్ అశోక్ మల్హోత్రా మాత్రం కొంచెం భిన్నంగా మాట్లాడారు. కోహ్లి చాలా పెద్ద ఆటగాడని, అందుకే తొలగించలేమని, అయితే జట్టు శ్రేయస్సు కోసం కఠినమైన నిర్ణయాలు అవసరమని అంగీకరించారు.

“ప్రస్తుత ఫామ్‌లో విరాట్‌కు జట్టులో చోటు దక్కదు. అతడిని టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టులోకి తీసుకోవడం అవివేకం. అతడిని చేర్చుకుంటే ఏ స్థానంలో ఆడతాడు? హుడా, సూర్యకుమార్ యాదవ్ బలంగా తమ ముద్ర వేస్తున్నారు. చాలా బాగా ఆడుతున్నారు. విషయం ఏమిటంటే విరాట్ పూర్తిగా ఫామ్‌లో లేడు. ఫామ్‌లో లేనప్పుడు జట్టు కోసం కాదు.. తన కోసమే ఆడాలి. కాబట్టి విరాట్ ఏం చేస్తాడు? లేదా అతను చాలా డిఫెన్సివ్‌ మోడ్‌లో పడతాడు. దీంతో ఫామ్‌లో లేనట్లు అనిపిస్తుంది. ఇది ఖచ్చితంగా భారత జట్టుకు సహాయం చేయదు. రాహుల్ ద్రవిడ్‌లో మాకు డిఫెన్సివ్ కోచ్ ఉన్నారు. అతను ఎల్లప్పుడూ విరాట్‌ను చేర్చుకోవడానికి మొగ్గు చూపుతారు. కఠినమైన నిర్ణయాలు తీసుకోరు” అంటూ అభిప్రాయపడ్డారు.

“విరాట్ గొప్ప ఆటగాడు. కానీ, గతంలో మాజీ దిగ్గజాలు కూడా జట్టు నుంచి తొలగించబడ్డారు. లేదా రిటైర్మెంట్‌కు గురయ్యారు. జట్టు అందరికంటే అత్యున్నతమైనది. ప్రస్తుతానికి విరాట్‌కు చాలా ప్రాముఖ్యత ఇస్తున్నారని నేను భావిస్తున్నాను. అతడిని ఫామ్‌లోకి తీసుకురావడానికి ఇన్ని అవకాశాలు ఇవ్వడంలో అర్థం లేదు? ఇతరులు బాగా రాణిస్తే వారు అవకాశాలకు అర్హులుగా పరిగణించాలి. ప్రస్తుత ఫామ్‌లో ఉన్న విరాట్‌కు టీ20ల్లోనే కాకుండా అంతర్జాతీయ క్రికెట్‌లోని ఏ ఫార్మాట్‌లోనూ స్థానం దక్కకపోవడం అనేది సమస్యగా మారనుంది. T20 ప్రపంచ కప్‌ను దృష్టిలో ఉంచుకుని, మేనేజ్‌మెంట్ జట్టు విషయంలో కఠినంగా ఉండాలి. ఒక ఆటగాడిపై దృష్టి కేంద్రీకరించడంలో సమయాన్ని వృథా చేయకూడదు. ఇది జట్టుకు ప్రతికూలంగా మారే ఛాన్స్ ఉంది” అని తెలిపాడు.

భారత మాజీ క్రికెటర్, మాజీ మేనేజర్ అబ్బాస్ అలీ బేగ్ మాట్లాడుతూ.. జట్టు తలనొప్పిని పరిష్కరించడానికి కోహ్లీ తిరిగి ఫామ్‌లోకి వస్తాడని ఆశిస్తున్నట్లు తెలిపాడు.

“అతనికి మరికొన్ని మ్యాచ్‌ల్లో అవకాశం ఇవ్వండి. కానీ, ఆ తర్వాత అతను ఫామ్‌లో లేనట్లయితే, సెలెక్టర్లు నిర్ణయం తీసుకోవచ్చని నేను భావిస్తున్నాను. ఈ విషయం విరాట్‌కు తెలుసు. అతను ఫాంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు. అప్పుడు విఫలమైతే మాత్రం తనకు తానుగా తప్పుకోవచ్చు. లేదా T20Iల నుంచి రిటైర్ కావచ్చు. అతను IPL, ఆ తర్వాత ఇంగ్లండ్‌లో కష్టపడ్డాడు. వీలైనంత త్వరగా ఫామ్‌లోకి రావాలని కోరుకుంటున్నాను” అని అభిప్రాయపడ్డాడు.