Shreyas Iyer : ఛాంపియన్స్ ట్రోఫీలో హీరో, ఆసియా కప్‌లో జీరో.. శ్రేయస్ అయ్యర్ పరిస్థితి ఏంటి ఇలా అయింది
ఐపీఎల్ 2025లో 175 స్ట్రైక్ రేట్‌తో పరుగులు చేసిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్కు ఆసియా కప్ 2025 కోసం టీమిండియాలో చోటు దక్కలేదు. ఐపీఎల్ 2025లో భారత ఆటగాళ్లలో అత్యధిక సిక్స్‌లు కొట్టినప్పటికీ, అతన్ని టీ20 మ్యాచ్‌లకు సరిపోడని భావించారు.

Shreyas Iyer : ఐపీఎల్ 2025లో 175 స్ట్రైక్ రేట్‌తో పరుగులు సాధించిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు ఆసియా కప్ 2025 జట్టులో చోటు దక్కలేదు. ఈ ఐపీఎల్‌లో భారత ఆటగాళ్లలో అత్యధిక సిక్సర్లు కొట్టినప్పటికీ అతన్ని టీ20 మ్యాచ్‌లకు సరిపోడని భావించారు. అందుకే 15 మంది సభ్యుల జట్టులో గానీ, స్టాండ్‌బై జాబితాలో గానీ అతని పేరు లేదు. కానీ, ఈ ఏడాది మొదట్లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో రోహిత్ శర్మ పట్టుబట్టి శ్రేయస్ అయ్యర్‌ను చేర్చాడు. మరి ఇప్పుడు టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అలా ఎందుకు చేయలేకపోయాడు? ఇది ఆలోచించాల్సిన విషయం.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 జట్టును ప్రకటించేటప్పుడు సెలెక్టర్లు మొదట శ్రేయస్ అయ్యర్‌ను చేర్చాలని భావించలేదు. కానీ, కెప్టెన్ రోహిత్ శర్మ పట్టుబట్టి అయ్యర్‌ను జట్టులోకి తీసుకున్నాడు. దీని ఫలితం అందరికీ తెలిసిందే. ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన వారిలో శ్రేయస్ అయ్యర్ రెండో స్థానంలో నిలిచాడు. ఐదు మ్యాచ్‌లలో 48.60 సగటుతో 243 పరుగులు చేశాడు. ఇందులో రెండు అర్ధ సెంచరీలు ఉన్నాయి. అతని అద్భుతమైన ప్రదర్శనతో భారత్ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. కానీ ఇప్పుడు ఆసియా కప్‌లో అతన్ని పూర్తిగా పక్కన పెట్టేశారు.
ఆగస్టు 19న ముంబైలో కురుస్తున్న భారీ వర్షాల మధ్య ఆసియా కప్ జట్టును ప్రకటించారు. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ జట్టును ప్రకటిస్తూ శ్రేయస్ అయ్యర్‌ను పూర్తిగా విస్మరించారు. దాదాపు 1 గంట 15 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమైన ఈ సమావేశంలో శుభ్‌మన్ గిల్‌కు జట్టు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. గిల్ గురించి అజిత్ అగార్కర్ మాట్లాడుతూ.. గిల్‌లో నాయకత్వ లక్షణాలు కనిపిస్తున్నాయి. ఇంగ్లాండ్‌లో అది మేము చూశాం. ఇది మాకు మంచి సంకేతమని అన్నారు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా.. గిల్ శ్రీలంకలో జరిగిన టీ20 సిరీస్‌లో వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. అతను మంచి ఆటగాడు అని చెప్పాడు. ఈ సమావేశంలో శ్రేయస్ అయ్యర్ పేరు గురించి అసలు చర్చ కూడా జరగలేదట.
శ్రేయస్ అయ్యర్‌కు అక్టోబర్‌లో వెస్టిండీస్‌తో జరిగే టెస్ట్ సిరీస్‌లో అవకాశం లభించవచ్చు. కానీ టీ20 జట్టులో అతని స్థానం దొరకడం కష్టం. దీనిపై బీసీసీఐ అధికారి ఒకరు మాట్లాడుతూ.. శ్రేయస్ అయ్యర్‌ను జట్టులోకి తీసుకోకపోవడం నిజంగా ఆలోచించాల్సిన విషయం అని అన్నారు. టీమిండియా మాజీ కోచ్ అభిషేక్ నాయర్ మాట్లాడుతూ.. 20 మంది సభ్యుల జట్టులో కూడా శ్రేయస్ అయ్యర్‌ను చేర్చకపోవడానికి కారణం నాకు అర్థం కావడం లేదు. ఇది శ్రేయస్ అయ్యర్ టీ20 ప్రణాళికల్లో లేడని స్పష్టమైన సందేశం ఇస్తుందని అన్నారు. టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా అయ్యర్ జట్టు నుంచి తొలగించబడటం బాధాకరమని పేర్కొన్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




