AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MI vs DC IPL 2022 Prediction: ముంబయితో పోరుకు సిద్ధమైన ఢిల్లీ.. ఇరుజట్ల బలాలు, బలహీనతలు ఎలా ఉన్నాయంటే?

Mumbai Indians vs Delhi Capitals: ముంబై తన కోర్ టీమ్‌ను దాదాపుగా ఉంచుకుంది. చాలా మంది కొత్త ఆటగాళ్లు ఢిల్లీ జట్టులోకి వచ్చారు. దీంతో ఈ రెండు జట్ల మధ్య పోటీ ఎలా ఉండనుందోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

MI vs DC IPL 2022 Prediction: ముంబయితో పోరుకు సిద్ధమైన ఢిల్లీ.. ఇరుజట్ల బలాలు, బలహీనతలు ఎలా ఉన్నాయంటే?
Ipl 2022 Mumbai Indians Vs Delhi Capitals
Venkata Chari
|

Updated on: Mar 26, 2022 | 9:27 PM

Share

ఐపీఎల్ 2022 (IPL 2022) రెండవ మ్యాచ్‌లో యువ కెప్టెన్‌తో ఢీకొట్టేందుకు అనుభవజ్ఞుడైన కెప్టెన్ సిద్ధమయ్యాడు. ప్రస్తుత సీజన్‌లో రెండవ రోజు అంటే ఆదివారం, డబుల్ హెడర్‌లో రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. తొలి మ్యాచ్‌లో ఐదుసార్లు విజేత ముంబై ఇండియన్స్ టీం ఢిల్లీ క్యాపిటల్స్‌తో(Mumbai Indians vs Delhi Capitals) తలపడనుంది. ముంబై కెప్టెన్ రోహిత్ కెప్టెన్సీలో జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు. అయితే, కెప్టెన్‌గా పంత్‌కి ఇది రెండో సీజన్. గతేడాది అతనికి జట్టుకు కెప్టెన్సీని అప్పగించి, తన కెప్టెన్సీలోనే జట్టును ప్లేఆఫ్‌కు తీసుకెళ్లాడు. 2013 నుంచి రోహిత్(Rohit Sharma) ముంబైకి కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు.

ముంబై జట్టు ఇప్పటికీ ఢిల్లీని తేలికగా తీసుకోలేకపోతోంది. ఢిల్లీ సారథి యువకుడు.. ఎక్కువ అనుభవం లేనివాడే కావొచ్చు.. కానీ, ఈ జట్టు ఆటగాళ్లకు ఏ జట్టునైనా ఓడించగల శక్తి ఉంది. ఈ సీజన్‌లో ముంబై తన కోర్ టీమ్‌ను దాదాపుగా ఉంచుకోగా, ఢిల్లీ జట్టులో చాలా మంది కొత్త ఆటగాళ్లు చేరారు.

ఈ సమస్యలను అధిగమించాలి..

ఢిల్లీ జట్టును చూస్తుంటే.. బ్యాటింగ్‌లో పృథ్వీ షా, కెప్టెన్ పంత్ లాంటి పేర్లు ఉన్నా.. ఓపెనింగ్ జోడీదే జట్టుకు ఇబ్బందిగా మారింది. డేవిడ్ వార్నర్ పాకిస్థాన్‌లో తన జాతీయ జట్టుతో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడుతున్నందున, మొదటి కొన్ని మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడు. ఇటువంటి పరిస్థితిలో, వార్నర్ స్థానంలో షాతో కలిసి టిమ్ సీఫెర్ట్ ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశం పొందవచ్చు. అదే సమయంలో మిడిలార్డర్‌లో జట్టుకు ఇబ్బందులు తప్పకపోవచ్చు. మిచెల్ మార్ష్ కూడా మొదటి కొన్ని మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడు. ఇలాంటి పరిస్థితుల్లో జట్టు మిడిలార్డర్‌కు ఏ బ్యాట్స్‌మెన్‌ బాధ్యత వహిస్తారో చూడాలి.

బహుశా యువ బ్యాట్స్‌మెన్, రంజీ ట్రోఫీలో మంచి ఫామ్ ఉన్న సర్ఫరాజ్ ఖాన్, రోవ్‌మన్ పావెల్‌లకు ప్లేయింగ్ 11లో అవకాశం లభించవచ్చు. వారిద్దరూ జట్టు మిడిల్ ఆర్డర్‌కు బాధ్యత వహిస్తారు. జట్టు బ్యాటింగ్‌లో అక్షర్ పటేల్ కూడా కీలకం కానున్నాడు.

బౌలింగ్ ఎలా ఉందంటే..

మరోవైపు ఢిల్లీ బౌలింగ్ చూస్తుంటే ముస్తాఫిజుర్ రెహమాన్, లుంగీ ఎన్గిడి జాతీయ జట్టుతో ఉన్నారు. ఈ కారణంగా తొలి మ్యాచ్‌ల్లో ఆడడం లేదు. ఎన్రిక్ నోర్కియా కూడా ఆడడంలేదు. అయితే ఈసారి ఢిల్లీ తమతో పాటు శార్దూల్ ఠాకూర్‌ను చేర్చుకుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఠాకూర్‌కి బౌలింగ్ బాధ్యత ఉంటుంది. చేతన్ సకారియా, కమలేష్ నాగర్‌కోటి అతనికి మద్దతు ఇవ్వడం చూడొచ్చు.

ముంబై బ్యాటింగ్‌కు ఎదురుదెబ్బ..

తొలి మ్యాచ్‌లో ముంబై తన దిగ్గజ బ్యాట్స్‌మెన్లలో ఒకరి సేవలను కోల్పోయింది. ఆ బ్యాట్స్‌మెన్‌ ఎవరంటే సూర్యకుమార్‌ యాదవ్‌. గాయపడిన సూర్యకుమార్‌ తొలి మ్యాచ్‌‌లో ఆడడం లేదు. ఈ కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ జట్టు బ్యాటింగ్‌కు ఎంతో కీలకం. కాబట్టి ఇది జట్టుకు భారీ ఎదురుదెబ్బ అనే చెప్పాలి. ఓపెనింగ్‌ బ్యాటింగ్‌ బాధ్యతలు ఇషాన్‌ కిషన్‌, రోహిత్‌ శర్మపైనే ఉన్నాయి. మిడిల్ ఆర్డర్‌లో అనుభవజ్ఞుడైన కీరన్ పొలార్డ్‌ కూడా కీలకం కానున్నాడు. జట్టులో ఈసారి హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా లేకపోవడంతో పొలార్డ్‌పై బాధ్యత మరింత పెరగనుంది.

అలాగే కొంతమంది యువ ఆటగాళ్లకు కూడా అవకాశం ఇవ్వవచ్చని తెలుస్తోంది. ఇందులో బలమైన పోటీదారులు తిలక్ వర్మ, టిమ్ డేవిడ్ ఉన్నారు. ఈ ఇద్దరు ఆటగాళ్లు పాండ్యా సోదరుల స్థానాన్ని భర్తీ చేయగలరు.

వేధిస్తోన్న స్పిన్నర్ల కొరత..

ముంబయి బౌలింగ్‌ చూస్తే.. ఎలాంటి బ్యాటింగ్‌ ఆర్డర్‌నైనా ధ్వంసం చేసే సత్తా జస్ప్రీత్ బుమ్రా లాంటి బౌలర్‌కు ఉంది. ఈసారి జట్టులో ట్రెంట్ బౌల్ట్ లేడు. అతని స్థానంలో టైమల్ మిల్స్‌కు అవకాశం లభించవచ్చు. అదే సమయంలో, జట్టు ప్లేయింగ్ 11లో జయదేవ్ ఉనద్కత్‌కు కూడా చోటు దక్కే ఛాన్స్ ఉంది. అయితే జట్టుకు మంచి స్పిన్నర్ లేకపోవడం పెద్ద ఆందోళనగా మారింది. రాహుల్ చాహర్ ఈ సీజన్‌లో జట్టులో లేడు. మరి దీనికి టీమ్‌ ఎలా పరిహారం చెల్లిస్తుందో చూడాలి. మురుగన్ అశ్విన్, మయాంక్ మార్కండే లాంటి రెండు ఎంపికలు మాత్రమే ఉన్నాయి.

జట్లు ఇలా ఉన్నాయి-:

ముంబై ఇండియన్స్ – రోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా, కీరన్ పొలార్డ్, ఇషాన్ కిషన్, డెవాల్డ్ బ్రెవిస్, బాసిల్ థంపి, ఎం అశ్విన్, జయదేవ్ ఉనద్కత్, మయాంక్ మార్కండే, ఎన్ తిలక్ వర్మ, సంజయ్ యాదవ్, జోఫ్రా ఆర్చర్, డేనియల్ సామ్స్, టైమల్ మిల్స్, టిమ్ డేవిడ్, రిలే మెరెడిత్, మహ్మద్ అర్షద్ ఖాన్, అన్మోల్‌ప్రీత్ సింగ్, రమణదీప్ సింగ్, రాహుల్ బుద్ధి, హృతిక్ షోకీన్, అర్జున్ టెండూల్కర్, ఫాబియన్ అలెన్, ఆర్యన్ జుయల్.

ఢిల్లీ క్యాపిటల్స్ స్క్వాడ్: రిషబ్ పంత్ (కెప్టెన్), అక్షర్ పటేల్, పృథ్వీ షా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, అశ్విన్ హెబ్బార్, సర్ఫరాజ్ ఖాన్, కేఎస్ భరత్, కమలేష్ నాగర్‌కోటి, మన్‌దీప్ సింగ్, ఖలీల్ అహ్మద్, చేతన్ సకారియా, లలిత్ యాదవ్, యశ్‌పల్ పటేల్ ధుల్, రోవ్‌మన్ పావెల్, ప్రవీణ్ దూబే, టిమ్ సీఫెర్ట్, విక్కీ ఓస్ట్వాల్.

Also Read: CSK vs KKR: కోల్‌కతా టార్గెట్ 132.. హాఫ్ సెంచరీతో కీలక ఇన్నింగ్స్ ఆడిన ధోనీ..

CSK vs KKR: షాడో పేసర్ దెబ్బకు చెన్నై సూపర్ కింగ్స్ విలవిల.. రెండు వికెట్లతో సత్తా చాటిన కోల్‌కతా బౌలర్..