సెలక్టర్లను ఎదిరించడమే వార్నర్ చేసిన తప్పా..? అందుకే కెప్టెన్సీతో పాటు జట్టు నుంచి తొలగించారా..! ఏది నిజం..?
IPL 2021 : ఐపీఎల్ మధ్యలో టీమ్ కెప్టెన్సీలో మార్పులు చాలా తక్కువ. గత సీజన్లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఇలా చేసింది.
IPL 2021 : ఐపీఎల్ మధ్యలో టీమ్ కెప్టెన్సీలో మార్పులు చాలా తక్కువ. గత సీజన్లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఇలా చేసింది. దినేష్ కార్తీక్ ను తొలగించి ఇయాన్ మోర్గాన్ ను కెప్టెన్‌గా చేసింది. ఇప్పుడు ఐపీఎల్ -2021 లో ఇది జరిగింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ మిడిల్ సీజన్‌లో తమ కెప్టెన్సీని మార్చింది. డేవిడ్ వార్నర్ స్థానంలో కేన్ విలియమ్సన్ కు జట్టు పగ్గాలు అప్పజెప్పింది. ప్రస్తుతం సన్ రైజర్స్ పరిస్థితి బాగా లేదు. మొదటి ఆరు మ్యాచ్‌ల్లో కేవలం ఒక మ్యాచ్‌లోనే గెలిచి మిగిలిన ఐదు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. జట్టు ప్రదర్శన కారణంగా కెప్టెన్సీలో మార్పు జరిగిందా అంటే పొరపాటే.. ఎందుకంటే కథ వేరే ఉంది.
జట్టు కోచ్ ట్రెవర్ బెల్లిస్, మెంటర్ వివిఎస్ నిర్ణయాలపై డేవిడ్ వార్నర్ అసహనం వ్యక్తం చేశాడు. ఏప్రిల్ 26 న ఢిల్లీతో మ్యాచ్ సందర్భంగా సెలక్టర్లు తీసుకున్న నిర్ణయాన్ని వార్నర్ ప్రశ్నించాడు. మనీష్ పాండేను జట్టుకు దూరంగా ఉంచాలనే నిర్ణయంపై వార్నర్ సెలెక్టర్లను తప్పుబట్టాడు. ఇది మంచి నిర్ణయం కాదని చెప్పాడు. దీంతో సెలక్టర్లు డేవిడ్ వార్నర్‌పై వేటు వేసారని అంటున్నారు.ఈ సంఘటన తర్వాత వార్నర్‌కి అన్ని కష్టాలే ఎదురయ్యాయి. మే 1న వార్నర్‌ను కెప్టెన్సీ నుంచి తొలగించి కేన్ విలియమ్సన్ జట్టుకు కెప్టెన్‌గా చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అది కూడా బాగానే ఉంది కానీ జట్టులో వార్నర్ ఉంటాడని భావించారు.
అయితే ఈ రోజు రాజస్థాన్ రాయల్స్‌తో ఆడబోయే మ్యాచ్‌కు హైదరాబాద్ డైరెక్టర్ టామ్ మూడీ మాట్లాడుతూ.. వార్నర్ ఈ మ్యాచ్‌లో ఆడటం లేదని స్పష్టం చేశాడు. దీంతో వార్నర్‌తో సహా అందరు షాక్ అయ్యారు. అయితే సెలక్టర్ల నిర్ణయం చూస్తే ఇకనుంచి వార్నర్ హైదరాబాద్‌తో కొనసాగడం కష్టమే అనిపిస్తోంది. కేన్ విలియమ్సన్‌కు కెప్టెన్సీ ఇవ్వడం ద్వారా తరువాతి సీజన్లలో అతను కెప్టెన్‌గా ఉంటాడని జట్టు చెప్పకనే చెప్పినట్లయింది. అటువంటి పరిస్థితిలో వార్నర్ భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియడం లేదు. అయితే వార్నర్ కెప్టెన్సీని ఆస్ట్రేలియా నిషేధించిన చోట మళ్లీ అదే జట్టు వార్నర్‌ను విశ్వసించిందని మాత్రం మర్చిపోకూడదు.