Vaibhav Suryavanshi: మైదానంలో విధ్వంసం.. సోషల్ మీడియాలో ఎమోషన్: వైభవ్ సూర్యవంశీని ఫిదా చేసిన ఆ వ్యక్తి ఎవరు?
Vaibhav Suryavanshi, Mangesh Gaikwad: వైభవ్ సూర్యవంశీ కేవలం తన బ్యాట్‌తోనే అభిమానుల దృష్టిని ఆకర్షించడమే కాకుండా, సోషల్ మీడియా పోస్ట్‌లతో కూడా ఆశ్చర్యపరుస్తుంటాడు. తాజాగా ఆయన చేసిన ఒక ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో ఒక ప్రత్యేక వ్యక్తి గురించి రాసిన మాటలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి.

Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ ప్రస్తుతం భారత క్రికెట్‌లో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. కేవలం భారత క్రికెట్‌లోనే కాకుండా, ప్రపంచ క్రికెట్‌లో కూడా తనదైన ముద్ర వేస్తూ గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. ఈ క్రమంలో ఆయన బ్యాటింగ్ మాత్రమే కాకుండా, సోషల్ మీడియాలో ఆయన చేసే ప్రతి పనిపై అభిమానుల కన్ను ఉంటోంది. తాజాగా వైభవ్ ఒక వ్యక్తితో దిగిన ఫోటోను షేర్ చేస్తూ, అతడిని “అత్యంత గొప్ప వ్యక్తి” అని అభివర్ణించడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.
వైభవ్ ఎవరికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు?
ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో భారత అండర్-19 జట్టుతో ఉన్న వైభవ్, జనవరి 6 మంగళవారం నాడు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక స్టోరీని షేర్ చేశారు. అందులో తనతో పాటు ఉన్న ఒక వ్యక్తి ఫోటోను పోస్ట్ చేస్తూ.. “నా లైఫ్ లోనే గొప్ప వ్యక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు” అని రాసుకొచ్చాడు. ఆ వ్యక్తి పేరు మంగేష్ గైక్వాడ్.
ఇంతకీ ఈ మంగేష్ గైక్వాడ్ ఎవరు?

వైభవ్ అంతటి గొప్ప మాటలు రాసిన ఈ మంగేష్ గైక్వాడ్ ఎవరు? మంగేష్ గైక్వాడ్ భారత క్రికెట్ జట్టుతో సంబంధం ఉన్న వ్యక్తి. నిజానికి ఆయన ఒక స్పోర్ట్స్ మసాజ్ థెరపిస్ట్. జట్టు సపోర్ట్ స్టాఫ్‌లో ఆయనా ఒకరు. మ్యాచ్ సమయంలో లేదా అంతకుముందు, తర్వాత ఆటగాళ్ల అలసటను, కండరాల నొప్పులను పోగొట్టడం ఆయన పని. మంగేష్ సీనియర్ టీమ్ ఇండియా, ఇండియా-ఏ, అండర్-19 జట్లతో పర్యటనలకు వెళ్తుంటారు. అంతేకాకుండా, ఐపీఎల్ సీజన్‌లో ప్రస్తుత ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టుతో కూడా ఆయన పనిచేస్తున్నాడు.
ఫామ్‌లో వైభవ్ సూర్యవంశీ..
View this post on Instagram
ఇక వైభవ్ సూర్యవంశీ విషయానికి వస్తే.. దక్షిణాఫ్రికా పర్యటనలో అండర్-19 వన్డే సిరీస్‌కు ఆయన భారత జట్టు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. తొలిసారి కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన వైభవ్ నేతృత్వంలో టీమిండియా, దక్షిణాఫ్రికాను మొదటి రెండు మ్యాచ్‌ల్లో ఓడించి సిరీస్‌ను కైవసం చేసుకుంది.
మొదటి మ్యాచ్‌లో పెద్దగా రాణించలేకపోయిన ఈ 14 ఏళ్ల ఓపెనర్, రెండో మ్యాచ్‌లో మాత్రం విశ్వరూపం చూపించాడు. కేవలం 24 బంతుల్లో 68 పరుగులు సాధించాడు. ఇందులో 10 సిక్సర్లు, 1 ఫోర్ ఉండటం విశేషం. ఇప్పుడు ఆయన దృష్టి చివరి మ్యాచ్‌పై ఉంది. ఆ తర్వాత జనవరి 15 నుంచి ప్రారంభం కానున్న అండర్-19 వరల్డ్ కప్‌లో కూడా ఇదే ఫామ్‌ను కొనసాగించాలని వైభవ్ పట్టుదలతో ఉన్నాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




