Vishnu Vinod : 14 సిక్సులు, 13 ఫోర్లు.. 84 బంతుల్లో 162.. బౌలర్లకు పగలే చుక్కలు చూపించిన కేరళ స్టార్!
Vishnu Vinod : అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం సాక్షిగా కేరళ బ్యాటర్ విష్ణు వినోద్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. విజయ్ హజారే ట్రోఫీలో పుదుచ్చేరి బౌలర్లను ఊచకోత కోస్తూ సిక్సర్ల సునామీ సృష్టించాడు. కేవలం 84 బంతుల్లోనే 162 పరుగులతో అజేయంగా నిలిచి, కేరళకు కళ్లు చెదిరే విజయాన్ని అందించాడు.

Vishnu Vinod : అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం సాక్షిగా కేరళ బ్యాటర్ విష్ణు వినోద్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. విజయ్ హజారే ట్రోఫీలో పుదుచ్చేరి బౌలర్లను ఊచకోత కోస్తూ సిక్సర్ల సునామీ సృష్టించాడు. కేవలం 84 బంతుల్లోనే 162 పరుగులతో అజేయంగా నిలిచి, కేరళకు కళ్లు చెదిరే విజయాన్ని అందించాడు. సంజు శాంసన్ వంటి స్టార్ ప్లేయర్లు విఫలమైన చోట విష్ణు వినోద్ చూపించిన విధ్వంసం ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది.
పుదుచ్చేరి నిర్దేశించిన 248 పరుగుల లక్ష్యాన్ని కేరళ జట్టు కేవలం 29 ఓవర్లలోనే ఊదేశందంటే అది విష్ణు వినోద్ పుణ్యమే. ఓపెనర్లు రోహన్ కున్నుమ్మల్ (8), సంజు శాంసన్ (11) త్వరగానే అవుట్ అయినప్పటికీ, విష్ణు వినోద్ మాత్రం తగ్గలేదు. తన ఇన్నింగ్స్‌లో మొత్తం 14 భారీ సిక్సర్లు, 13 ఫోర్లు బాదాడు. అంటే అతను చేసిన 162 పరుగుల్లో 136 పరుగులు కేవలం బౌండరీల (ఫోర్లు, సిక్సర్లు) ద్వారానే వచ్చాయి. 29 డాట్ బాల్స్ ఆడినప్పటికీ, మిగిలిన బంతుల్లో బౌలర్లపై దండయాత్ర చేసి 192 పైగా స్ట్రైక్ రేట్‌తో పరుగులు రాబట్టాడు. 63 బంతుల్లోనే సెంచరీ మార్కును అందుకున్న విష్ణుకు ఇది లిస్ట్-ఏ కెరీర్‌లో అత్యధిక స్కోరు.
విజయ్ హజారే ట్రోఫీ చరిత్రలో విష్ణు వినోద్ ఇప్పుడు ‘సిక్సర్ల వీరుడు’గా మారుతున్నాడు. ఇప్పటివరకు ఈ టోర్నీలో అతను మొత్తం 106 సిక్సర్లు బాదాడు. అత్యధికంగా 109 సిక్సర్లు కొట్టిన మనీష్ పాండే రికార్డును అధిగమించేందుకు విష్ణు కేవలం 4 సిక్సర్ల దూరంలోనే ఉన్నాడు. ప్రతి 19.9 బంతులకు ఒక సిక్సర్ బాదుతూ, ఈ టోర్నీలో అత్యుత్తమ బాల్/సిక్సర్ నిష్పత్తి కలిగిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఈ గణాంకాలే విష్ణు వినోద్ పవర్ హిట్టింగ్ సామర్థ్యాన్ని చాటిచెబుతున్నాయి.
విష్ణు వినోద్ టాలెంట్ కొత్తదేమీ కాదు, కానీ ఐపీఎల్‌లో అతనికి సరైన అవకాశాలు రాలేదు. 2017లో ఆర్‌సీబీ తరపున అరంగేట్రం చేసినా కేవలం 3 మ్యాచ్‌లే ఆడాడు. ఆ తర్వాత 2023లో ముంబై ఇండియన్స్ తరపున కూడా కొన్ని మ్యాచ్‌లే ఆడే అవకాశం దక్కింది. ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ జట్టులో ఉన్న విష్ణు వినోద్, ఈ ఏడాది విజయ్ హజారేలో చూపిస్తున్న ఫామ్ చూస్తుంటే.. ఐపీఎల్ 2026లో అతనికి ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. పంజాబ్ కింగ్స్ యజమాని ప్రీతి జింటా ఈ ఇన్నింగ్స్ చూస్తే ఖచ్చితంగా ఫిదా అయిపోవాల్సిందే.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
