Tilak Varma: ఆ రోజే ఆకాశ్ అంబానీ లేకుంటే.. నేను చనిపోయేవాడిని: తిలక్ వర్మ
తిలక్ వర్మ తన జీవితం గురించి ఒక ముఖ్యమైన విషయాన్ని వెల్లడించారు. బ్రేక్ ఫాస్ట్ విత్ ఛాంపియన్స్ షోలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఆకాష్ అంబానీ మరియు జై షా తన ప్రాణాలను ఎలా కాపాడుకున్నారో తిలక్ వర్మ తన రివీలేషన్ లో వివరించారు.

భారత యువ క్రికెట్ సంచలనం, ముంబై ఇండియన్స్ బ్యాటర్ తిలక్ వర్మ.. తన జీవితంలో ఎదుర్కొన్న అత్యంత భయంకరమైన ఆరోగ్య సమస్య గురించి ఇటీవల వెల్లడించారు. 2022లో తనకు ప్రాణాపాయ స్థితిని కల్పించిన ‘రాబ్డోమయోలిసిస్’ (Rhabdomyolysis) అనే అరుదైన కండరాల వ్యాధి గురించి వివరిస్తూ, ఆ క్లిష్ట సమయంలో ఆకాశ్ అంబానీ, బీసీసీఐ కార్యదర్శి జై షా తమ జీవితాన్ని ఎలా కాపాడారో తెలిపారు.
కండరాలు కరిగిపోయే అరుదైన వ్యాధి..
తిలక్ వర్మ చెప్పిన వివరాల ప్రకారం, తన మొదటి ఐపీఎల్ సీజన్ (2022) తర్వాత ఈ ఆరోగ్య సమస్య మొదలైంది. అంతర్జాతీయ క్రికెట్‌లో రాణించాలనే పట్టుదలతో, తిలక్ తన శరీరాన్ని అతిగా శ్రమకు గురిచేసేవాడు. సరైన విశ్రాంతి తీసుకోకుండా, విశ్రాంతి రోజుల్లో కూడా జిమ్‌లో గడిపేవారు. దీని పర్యవసానంగా, తిలక్ వర్మకు ‘రాబ్డోమయోలిసిస్’ అనే అరుదైన వ్యాధి సోకింది. ఈ పరిస్థితిలో, కండరాలు వేగంగా విచ్ఛిన్నమై (Muscle Breakdown) రక్తంలోకి హానికరమైన పదార్థాలను విడుదల చేస్తాయి. సరైన సమయంలో చికిత్స అందకపోతే, ఇది కిడ్నీ ఫెయిల్యూర్ లేదా మరణానికి కూడా దారితీయవచ్చు.
మైదానంలో భయంకర అనుభవం..
2022 నవంబర్‌లో బంగ్లాదేశ్ ‘ఏ’ సిరీస్ ఆడుతున్న సమయంలో తిలక్ పరిస్థితి విషమించింది. ఆ సమయంలో ఒక్కసారిగా ఆయన కండరాలు గట్టిపడ్డాయి.
“నా వేళ్లు అస్సలు కదలడం లేదు. అంతా రాయిలా మారిపోయినట్లు అనిపించింది.” “నా గ్లౌజులు కోయాల్సి వచ్చింది. వేళ్లు కదలకపోవడంతో రిటైర్డ్ హర్ట్‌గా మైదానం వీడాల్సి వచ్చింది” అంటూ చెప్పుకొచ్చాడు.
ప్రాణాలు నిలిపిన ఆకాశ్ అంబానీ, జై షా..
తిలక్ వర్మ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో, తన తల్లి మాత్రమే తనతో ఉన్నారని, ఈ కష్ట సమయంలో ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ మద్దతును ఆయన గుర్తు చేసుకున్నారు.
“నా పరిస్థితి గురించి తెలిసిన వెంటనే, ముంబై ఇండియన్స్ ఓనర్ ఆకాశ్ అంబానీ నాకు కాల్ చేశారు. ఆయన వెంటనే బీసీసీఐ కార్యదర్శి జై షా గారితో మాట్లాడారు. వాళ్ళ సహాయంతో, నేను వెంటనే ఆసుపత్రిలో చేరుకోగలిగాను” అని ఈ యంగ్ డైనమేట్ తెలిపాడు.
డాక్టర్లు తన పరిస్థితిని చూసి, “మరికొన్ని గంటలు ఆలస్యమై ఉంటే పరిణామాలు చాలా భయంకరంగా ఉండేవి” అని చెప్పారని తిలక్ తెలిపారు. IV (ఇంట్రావీనస్) లైన్ కోసం సూది వేయడానికి ప్రయత్నించినా, అది విరిగిపోయేంత తీవ్రంగా తన కండరాలు గట్టిపడ్డాయని తిలక్ ఆనాటి భయంకరమైన పరిస్థితిని వివరించారు.
ఆకాశ్ అంబానీ, జై షా తీసుకున్న తక్షణ చర్యల వల్లే తాను ప్రాణాపాయం నుంచి బయటపడ్డానని, వారికి ఎప్పటికీ కృతజ్ఞుడనై ఉంటానని తిలక్ వర్మ అన్నారు. పూర్తి చికిత్స తర్వాత, 2023 ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరపున అద్భుతంగా రాణించి, తక్కువ కాలంలోనే భారత జట్టులోకి అడుగుపెట్టాడు.
ఈ అరుదైన వ్యాధి నుంచి కోలుకుని, భారత క్రికెట్‌కు ఆసియా కప్ వంటి కీలక విజయాలను అందించడంలో తిలక్ వర్మ చేసిన కృషి నిజంగా అభినందనీయం.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








