‘అన్ని సమస్యలకు అతనొక్కడే పరిష్కారమా.. నీ స్ట్రాటజీతో టీమిండియా పరువు తీస్తున్నావ్‌గా’
Team India Head Coach: టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ప్రస్తుతం అన్ని సమస్యలకు ఒక్కటే పరిష్కారం అన్నట్లుగా ప్రవర్తిస్తున్నాడు. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ సమస్యలకు ఆ ఒక్కడినే ఎంచుకుంటున్నాడు. దీంతో కీలక మ్యాచ్‌ల్లో టీమిండియాకు ఘోర పరాజయాలు ఎదురవుతున్నాయి.

Team India: భారత్ టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశలో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఎదురైన ఘోర పరాజయం తర్వాత, భారత జట్టు ఎంపికలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా, ఆ మ్యాచ్‌లో అక్షర్ పటేల్‌ను పక్కన పెట్టి వాషింగ్టన్ సుందర్‌ను తుది జట్టులోకి తీసుకోవడంపై మాజీ భారత క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ తీవ్రంగా ఎద్దేవా చేశారు.
భారత్ 76 పరుగుల తేడాతో ఓడిపోగా, వాషింగ్టన్ సుందర్ బ్యాటింగ్‌లో కేవలం 11 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. అంతేకాదు, బౌలింగ్‌లో రెండు ఓవర్లు మాత్రమే వేయడం కూడా విమర్శలకు దారితీసింది. ఈ నేపథ్యంలో గౌతమ్ గంభీర్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని మంజ్రేకర్ వ్యంగ్యంగా విమర్శించారు.
“ఒకప్పుడు ‘కైలాష్ జీవన్’ అనే మందు ఉండేది. తలనొప్పి వచ్చినా అదే మందు, కడుపునొప్పి వచ్చినా అదే మందు. అన్నీ సమస్యలకు ఒకటే మందు అన్నట్టుగా గౌతమ్ గంభీర్ దగ్గర కూడా ఒకే పరిష్కారం ఉన్నట్టు అనిపిస్తోంది – అదే వాషింగ్టన్ సుందర్. బ్యాటింగ్ సమస్య అయితే సుందర్, బౌలింగ్ సమస్య అయితే కూడా సుందర్. ఈ మ్యాచ్‌లో అతడిని పై స్థానంలో పంపారు. రింకు సింగ్ నెంబర్ 6కి వచ్చాడు. హార్దిక్ పాండ్యా నెంబర్ 7కి దిగాడు. ఇది కొంచెం అతిగా అనిపిస్తోంది,” అని మంజ్రేకర్ స్పోర్ట్స్ నెక్ట్స్ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు.
ఈ ఓటమితో భారత్ ఇప్పుడు జింబాబ్వే (గురువారం), వెస్టిండీస్ (ఆదివారం) జట్లతో జరిగే రెండు మ్యాచ్‌లను తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితిలోకి వెళ్లింది. సెమీఫైనల్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే ఈ రెండు మ్యాచ్‌ల్లో గెలుపు అనివార్యం.
జట్టు మేనేజ్‌మెంట్ ప్రస్తుతం ఫామ్‌లో లేని బ్యాటర్లలో కనీసం ఒకరినైనా పక్కన పెట్టే ఆలోచనలో ఉందని, అలాగే టాప్ ఆర్డర్‌లో ఎక్కువగా ఎడమచేతి బ్యాటర్లను ఆడించే విధానాన్ని పునర్విచారించనున్నట్లు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సహాయకులు ర్యాన్ టెన్ డోషాటే మరియు సితాంశు కోటక్ సూచించారు.
దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ శర్మ (నాలుగు మ్యాచ్‌ల్లో 15 పరుగులు మాత్రమే), తిలక్ వర్మ (ఐదు మ్యాచ్‌ల్లో 107 పరుగులు, స్ట్రైక్ రేట్ 118) ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. అంతేకాదు, ఫినిషర్‌గా పేరున్న రింకు సింగ్ 29 బంతుల్లో కేవలం 24 పరుగులు చేసి 82.75 స్ట్రైక్ రేట్‌తో నిరాశపరిచాడు.
“హెడ్ కోచ్‌గా, మేనేజ్‌మెంట్‌గా మాకు మార్పులు అవసరమని అనిపిస్తే, తప్పకుండా మార్పులు చేస్తాం. ఇప్పుడు పరిస్థితి అలాంటిదే – ఏం మార్చాలి? ఎలా మార్చాలి అన్నదానిపై ఆలోచించాల్సిన దశకు వచ్చాం,” అని బ్యాటింగ్ కోచ్ సితాంశు కోటక్ అన్నారు.
ఇక, జట్టులో బ్యాకప్ స్పెషలిస్ట్ బ్యాటర్లు లేకపోవడం తమకు ఆందోళన కలిగించే అంశమేనని ర్యాన్ టెన్ డోషాటే అంగీకరించారు. ఫామ్ లేకపోయినా సంజూను మళ్లీ పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉందని ఆయన తెలిపారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
