Virat Kohli: కోహ్లీ కెరీర్ ముగిసినట్టేనా? వారి కంటే దారుణంగా పడిపోయిన సగటు.. 3 ఏళ్ల లెక్కలు ఎలా ఉన్నాయంటే?
భారత జట్టులో చోటు దక్కించుకోవడానికి దేశవ్యాప్తంగా ఉన్న బ్యాట్స్‌మెన్‌ల మధ్య పోటీ నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో విరాట్ ఎంతకాలం కంటిన్యూగా ఫ్లాప్ అవుతూ తన స్థానాన్ని కాపాడుకోగలడు? పుజారా, రహానేలు తప్పుకున్నప్పుడు..
IND vs ENG: విరాట్ కోహ్లీ(Virat Kohli) పేలవ ఫామ్ కొనసాగుతోంది. బర్మింగ్‌హామ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో టీమిండియా(Team India) మాజీ కెప్టెన్ 19 బంతుల్లో 11 పరుగులు చేసి ఔటయ్యాడు. మాథ్యూ పాట్స్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. విశేషమేమిటంటే, పాట్స్ తన కెరీర్‌లో రెండవ సిరీస్ మాత్రమే ఆడటం గమనార్హం. దాదాపు మూడేళ్లుగా విరాట్ ఈ వైఫల్యంతో ఇబ్బందులు పడుతున్నాడు. విరాట్ కోహ్లీ చివరిసారిగా 23 నవంబర్ 2019న బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టులో సెంచరీ సాధించాడు. అప్పటి నుంచి క్రికెట్‌లో ఏ ఫార్మాట్‌లోనూ ఒక్క సెంచరీ కూడా నమోదు చేయలేకపోయాడు. అంటే మొత్తం 954 రోజులు అన్నమాట. ఇలాంటి పరిస్థితుల్లో విరాట్ కోహ్లీ క్రికెటర్ కెరీర్ ముగిసిందా అనే ప్రశ్న కూడా మొదలైంది. అతని కెరీర్ ముగిసిపోతుందా? దీని గురించి గణాంకాలు ఏమి చెబుతున్నాయో ఓసారి చూద్దాం..
18 టెస్టుల్లో 852 పరుగులు..
విరాట్ తన గత సెంచరీ తర్వాత 18 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 31 సార్లు బ్యాటింగ్ చేసి 6 సార్లు మాత్రమే 50 మార్కును దాటగలిగాడు. ఈ సమయంలో, కోహ్లీ సగటు 27.48 మాత్రమే. సీనియర్ బ్యాట్స్‌మెన్‌లలో అజింక్యా రహానే (24.08), ఛెతేశ్వర్ పుజారా (25.94) మాత్రమే అతని కంటే అధ్వాన్నమైన సగటును కలిగి ఉన్నారు. దీంతో పుజారా, రహానె ఇద్దరూ జట్టు నుంచి తప్పుకున్నారు. కౌంటీ సీజన్‌లో రహానే విఫలం కావడంతో, పుజారా పునరాగమనం చేశాడు.
మరోవైపు ఈ కాలంలో విరాట్ కంటే మెరుగైన ఆటతీరు కనబర్చిన ఆటగాళ్లు చాలా మంది ఉన్నారు. జట్టులో రిషబ్ పంత్ స్థానం తరచుగా ప్రశ్నార్థకం అవుతుంది. అయితే విరాట్ గత సెంచరీ నుంచి పంత్ భారతదేశం తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో ముందంజలో ఉన్నాడు. ఈ కాలంలో అతను 20 టెస్టుల్లో 42.32 సగటుతో 1,312 పరుగులు చేశాడు. వీటిలో మూడు సెంచరీలు, 7 అర్ధ సెంచరీలు ఉన్నాయి. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్ కూడా విరాట్ కంటే మెరుగ్గా ఉన్నారు.
భారత జట్టులో చోటు దక్కించుకోవడానికి దేశవ్యాప్తంగా ఉన్న బ్యాట్స్‌మెన్‌ల మధ్య పోటీ నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో విరాట్ ఎంతకాలం కంటిన్యూగా ఫ్లాప్ అవుతూ తన స్థానాన్ని కాపాడుకోగలడు? పుజారా, రహానేలు తప్పుకున్నప్పుడు.. విరాట్ ఎందుకు తప్పుకోడు? అనే ప్రశ్నలకు కూడా వినిపిస్తున్నాయి.
ODIలలో కూడా..
23 నవంబర్ 2019 నుంచి వన్డే క్రికెట్‌లో విరాట్ కోహ్లీ బ్యాట్ తంటాలుపడుతూనే ఉంది. ఈ సమయంలో అతను 21 ODIలు ఆడాడు. 37.66 సగటుతో 791 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇందులో 10 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కానీ, ఒక్క సెంచరీ కూడా లేకపోవడం గమనార్హం.
ఆఫ్ స్టంప్ వెలుపల విసిరే బంతులతో ఇబ్బందులు పడే విరాట్.. 2018 ఇంగ్లండ్ పర్యటనతో ఈ లోటును దాదాపుగా ముగించాడు. కానీ, ప్రస్తుతం అదే బలహీనత మరోసారి తెరపైకి వచ్చింది. ఈసారి కోలుకోలేని పరిస్థితి కనిపిస్తోంది. గత మూడు సంవత్సరాలలో, అతను టెస్ట్ క్రికెట్‌లో దాదాపు 60 శాతం ఆఫ్-స్టంప్ వెలుపల విసిరిన బంతులకే అవుట్ అయ్యాడు. బర్మింగ్‌హామ్ టెస్ట్‌లో కూడా ఇదే జరిగింది. దీంతో ఈ టెస్టులోనైనా తన బ్యాడ్ ఫాంకు గుడ్‌బై చెబుతాడని ఆశించిన అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాడు.