Team India Announcement: రేపే ఇంగ్లాండ్ సిరీస్, ఛాంపియన్స్ ట్రోఫీకి తుది జట్టు ప్రకటన!
BCCI జనవరి 18న ఇంగ్లాండ్ వన్డే, టీ20 సిరీస్‌లతో పాటు 2025 ఛాంపియన్స్ ట్రోఫీ కోసం జట్టును ప్రకటించనుంది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు పాకిస్తాన్, UAEలో జరుగుతుంది, భారత మ్యాచ్‌లు హైబ్రిడ్ మోడల్‌లో దుబాయ్‌లో జరుగుతాయి. రోహిత్ శర్మ కెప్టెన్సీ కొనసాగించనుండగా, జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా అందుబాటులో ఉండకపోవచ్చు. BCCI క్రమశిక్షణా నిబంధనలు తీసుకురావడంతో జట్టు ఎంపికపై మరింత ఆసక్తి నెలకొంది.

భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఇంగ్లాండ్ తో జరగబోయే మూడు వన్డే మ్యాచ్‌లు, ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్ కోసం, వీటితో పాటు 2025 ICC ఛాంపియన్స్ ట్రోఫీ కోసం కూడా జనవరి 18న జట్టును ప్రకటించనుంది. ఈ సందర్భంగా భారత కెప్టెన్ రోహిత్ శర్మ, సెలెక్టర్ల చైర్మన్ అజిత్ అగార్కర్ ముంబై వాంఖడే స్టేడియంలో జరగనున్న విలేకరుల సమావేశంలో మాట్లాడనున్నారు. అయితే ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ కు టీం ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ హాజరు అవ్వడంలేదని BCCI పేర్కొంది.
జనవరి 22న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. టీ20 సిరీస్ కోల్‌కతా, చెన్నై, రాజ్‌కోట్, పూణే, ముంబై వేదికలలో జరుగుతుంది. ఫిబ్రవరి 6 నుంచి మూడు వన్డేల సిరీస్ మొదలవుతుంది, ఇది ఛాంపియన్స్ ట్రోఫీకి ముందుగా ఒక ప్రాక్టీస్ అనుభూతిని అందిస్తుంది.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 వివరాలు
ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు జరుగనున్న ఈ టోర్నమెంట్‌కి పాకిస్తాన్, UAE ఆతిథ్యం ఇస్తున్నాయి. భారత్, హైబ్రిడ్ మోడల్‌లో, దుబాయ్ వేదికగా తమ మ్యాచ్‌లను ఆడనుంది. ఈ టోర్నమెంట్‌లో ఎనిమిది జట్లు పాల్గొంటాయి, రెండు గ్రూప్‌లుగా విభజించి, లీగ్ దశ తర్వాత సెమీస్, ఫైనల్ జరుగుతాయి.
గ్రూప్-A: పాకిస్తాన్, భారతదేశం, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ గ్రూప్-B: ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ భారత తొలి మ్యాచ్ ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో జరగనుంది. యావత్ క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న అతిపెద్ద మ్యాచ్ పాకిస్తాన్‌తో ఫిబ్రవరి 23న జరగనుంది.
ఇంగ్లండ్ వన్డే సిరీస్, ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టుకు రోహిత్ శర్మ నాయకత్వం వహించే అవకాశం ఉంది. అయితే, ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా వెన్ను గాయం కారణంగా అందుబాటులో ఉండకపోవచ్చు. ఇప్పుడిప్పుడే గాయం నుండి కోలుకుంటున్న మహమ్మద్ షమీ కూడా అందుబాటులో ఉంటాడా లేదా అని అటు టీం ఇండియా, ఇటు అభిమానులు వేచి చూస్తున్నారు.
BCCI కొత్త నియమాలు
క్రమశిక్షణను పెంచడం, క్రికెట్‌కు ప్రాధాన్యత ఇవ్వడం కోసం BCCI 10-పాయింట్ల నిబంధనలను ప్రకటించింది. ఇందులో దేశవాళీ క్రికెట్‌ను తప్పనిసరి చేయడం, సిరీస్ సమయంలో వ్యక్తిగత వాణిజ్య కార్యక్రమాల నిషేధం వంటి అంశాలు ఉన్నాయి. భారత ఆటగాళ్ల భార్యలను కూడా సిరీస్ సమయంలో కలవడానికి అనుమతి నిరాకరించింది. వేతనాల చెల్లింపుల్లో కూడా కొన్ని మార్పులు తేవాలని యోచిస్తోంది. ఇక క్రమశిక్షణ పరంగా కఠినమైన రూల్స్ తిరిగి తీసుకురావాలని గంభీర్ నేతృత్వం అనుకుంటుంది.
భారత జట్టు ప్రకటనా తేదీ దగ్గరపడుతుండడంతో, అభిమానులు సరికొత్త జట్టు సభ్యులపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.



