T20 World Cup: సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్‌కు బంపర్ ఆఫర్.. భారత నెట్ బౌలర్‌గా ఉమ్రాన్ మాలిక్ ఎంపిక..!
సన్‌రైజర్స్ హైదరాబాద్ పేస్ సెన్సేషన్ ఉమ్రాన్ మాలిక్ టీ 20 వరల్డ్ కప్‌లో భారత జట్టు కోసం నెట్ బౌలర్‌గా ఎంపికైనట్లు వార్తలు వస్తున్నాయి. మాలిక్‌ను వెంటనే టీమ్ఇండియా బయోబబుల్‌లో జాయిన్ కావాలంటూ బీసీసీఐ పేర్కొన్నట్లు సమాచారం...
సన్‌రైజర్స్ హైదరాబాద్ పేస్ సెన్సేషన్ ఉమ్రాన్ మాలిక్ టీ 20 వరల్డ్ కప్‌లో భారత జట్టు కోసం నెట్ బౌలర్‌గా ఎంపికైనట్లు వార్తలు వస్తున్నాయి. మాలిక్‌ను వెంటనే టీమ్ఇండియా బయోబబుల్‌లో జాయిన్ కావాలంటూ బీసీసీఐ పేర్కొన్నట్లు సమాచారం. కానీ దీనిపై ఎలాండి అధికారిక ప్రకటన రాలేదు. జమ్మూ కాశ్మీర్ పేసర్ ఉమ్రాన్ మాలిక్ సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు. రెండు నెలల వ్యవధిలో అతని జీవితం మారిపోయింది. ఐపీఎల్ ఆరంభానికి ముందు అతను కేవలం రెండు సీనియర్ స్థాయి దేశీయ మ్యాచ్‌లు ఆడాడు. ఈ 21 ఏళ్ల పేసర్ కెప్టెన్ విరాట్ కోహ్లీని ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఈ సీజన్‌లో ఉమ్రాన్ తన బౌలింగ్ వేగంతో చాలా మందిని ఆకట్టుకున్నాడు. అతను స్థిరంగా గంటకు 150 కి.మీ వేగంతో బౌలింగ్ చేశాడు. అతను ఐపీఎల్‌లో అత్యధికంగా 153 కి.మీ. వేగంతో బంతి విసిరాడు.
తన తొలి ఐపీఎల్ సీజన్‌లో ఉమ్రాన్ మూడు మ్యాచ్‌ల్లో రెండు వికెట్లు తీశాడు. అయితే ఈ సిజన్లో హైదరాబాద్ చివరి స్థానంలో నిలిచింది. భారత కెప్టెన్ కోహ్లీ నుంచి ఉమ్రాన్ మాలిక్ ప్రశంసలు అందుకున్నాడు. “ఈ టోర్నమెంట్‌తో ప్రతి సంవత్సరం కొత్త ప్రతిభను బయటకు వస్తుంది. 150 కి.మీ. వేగంతో ఒక వ్యక్తి బౌలింగ్ చేయడం మంచిది. ఇక్కడ నుంటి అతడి పురోగతిని గమనించడం చాలా ముఖ్యం” అని కోహ్లీ అన్నాడు. టీ 20 వరల్డ్ కప్‌లో భారత్ అక్టోబర్ 24 న పాకిస్థాన్‌తో తలపడనుంది.
ఉమ్రాన్ మాలిక్ కూరగాయలు, పండ్ల విక్రయించే అబ్దుల్ మాలిక్ కుమారుడు. ఐపీఎల్ కోసం తన కుమారుడు పడిన కష్టాన్ని అబ్దుల్ మాలిక్ చాలా భావోద్వేగంతో చెప్పారు. తన కుమారుడు ఐపీఎల్‌కు ఎంపిక కావడం చూసి తను, తన భార్య కన్నీళ్లు పెట్టుకున్నామని వివరించారు. తన కొడుకు ఏదో ఒకరోజు భారత్ తరఫున కూడా ఆడాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. “నా కొడుకు మూడు సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు క్రికెట్ వైపు మళ్లాడు. అతను ఎప్పుడూ ప్రొఫెషనల్ క్రికెటర్ కావాలని కలలు కనేవాడు. ఆదివారం సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది జట్టుకు అతను ఎంపికైనప్పుడు మేము చాలా సంతోషించాం. నేను, నా భార్య టీవీకి అతుక్కుపోయాం. అప్పడు మాకు ఆనందంతో కన్నీళ్లు వచ్చాయి. నా కొడుకు చాలా కష్టపడ్డాడు. మేము ఎప్పుడూ అతనికి మద్దతు ఇచ్చాం. ఏదో ఒక రోజు అతను టీమ్ ఇండియా తరఫున ఆడతాడని మేము ఆశిస్తున్నాం” అని అబ్దుల్ మాలిక్ అన్నారు.