IRE vs SA : ఐర్లాండ్ చేతిలో ఓడిపోయిన దక్షిణాఫ్రికా.. 43 పరుగుల తేడాతో ఘన విజయం..
IRE vs SA : క్రికెట్‌లో 12వ ర్యాంకులో ఉన్న పసికూన ఐర్లాండ్ చరిత్ర సృష్టించింది. డబ్లిన్‌లో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడు వన్డేల
IRE vs SA : క్రికెట్‌లో 12వ ర్యాంకులో ఉన్న పసికూన ఐర్లాండ్ చరిత్ర సృష్టించింది. డబ్లిన్‌లో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా రెండో వన్డేలో ఘన విజయం సాధించింది. 43 పరుగుల తేడాతో తొలిసారిగా దక్షిణాఫ్రికాను ఓడించి రికార్డు సృష్టించింది. ఈ దెబ్బతో 2023 ప్రపంచ కప్‌కు ముందు సూపర్ లీగ్‌లో కావలసిన 10 ముఖ్యమైన పాయింట్లను సాధించింది.
మొదటగా బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ ఐదు వికెట్లకు 290 పరుగులు చేసింది. కెప్టెన్ ఆండీ బాల్‌బిర్నీ సెంచరీతో జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. 117 బంతుల్లో 10 ఫోర్లు, రెండు సిక్సర్లతో 102 పరుగులు చేశాడు. మరో బ్యాట్స్‌మెన్ హ్యారీ టెక్టర్ (79) హాఫ్ సెంచరీతో రాణించాడు. చివరి ఓవర్లో బ్యాటింగ్ చేసిన టెక్టర్ ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్లు కొట్టాడు. ఆయనతో పాటు జార్జ్ డోక్రెల్ 23 బంతుల్లో ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లతో 45 పరుగులు చేశాడు. దక్షిణాఫ్రికా తరఫున ఆండిల్ ఫెహ్లుక్వాయో రెండు వికెట్లు పడగొట్టాడు.
అనంతరం 290 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 50 ఓవర్లు కూడా పూర్తిగా ఆడలేకపోయింది. 247 పరుగులకే ఆలౌట్ అయింది. ఆరంభం నుంచే క్రమం తప్పకుండా వికెట్లు చేజార్చుకుంది. ఓపెనర్ జానెమాన్ మలన్ 84, రెసీ వాన్ డెర్ డుసెన్ 49 పరుగులు చేశారు. ఈ ఇద్దరు తప్ప మరే బ్యాట్స్‌మెన్ 24 పరుగులకు మించి చేయలేకపోయాడు. క్వింటన్ డి కాక్‌కు విశ్రాంతి ఇవ్వడంతో దక్షిణాఫ్రికాకు కొంచెం కష్టమైందని చెప్పవచ్చు.
ఐర్లాండ్ తరఫున ఆరుగురు బౌలర్లు బౌలింగ్ చేయగా, అందరికీ వికెట్లు వచ్చాయి. ఇందులో మార్క్ అడైర్, జోష్ లిటిల్, ఆండీ మెక్‌బ్రియన్లకు రెండు వికెట్లు, క్రెయిగ్ యంగ్, సిమి సింగ్, జార్జ్ డోక్రెల్ ఒక్కో వికెట్ చొప్పున పొందారు. ఐసిసి వన్డే ర్యాంకింగ్స్‌లో ఐర్లాండ్ 12 వ స్థానంలో ఉండగా, దక్షిణాఫ్రికా 5 వ స్థానంలో నిలిచింది. వర్షం కారణంగా సిరీస్ మొదటి మ్యాచ్ జరగలేదు. ఎనిమిది జట్లు మాత్రమే 2023 ప్రపంచ కప్‌కు నేరుగా అర్హత సాధిస్తాయి. మిగిలిన వారు క్వాలిఫికేషన్ రౌండ్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది.