19 బంతుల్లో 90 పరుగులు.. మూడు ఫార్మాట్లలోనూ సెంచరీలు.. కట్ చేస్తే.. కోహ్లీ రికార్డు బద్దలు..
Shubman Gill: టీమిండియా ఓపెనర్ శుభ్‌మాన్ గిల్ మరో సెంచరీతో అదరగొట్టాడు. 23 ఏళ్ల ఈ యువ ఆటగాడు వరుస శతకాలతో అంతర్జాతీయ క్రికెట్‌లో తనదైన ముద్ర వేస్తున్నాడు.
టీమిండియా ఓపెనర్ శుభ్‌మాన్ గిల్ మరో సెంచరీతో అదరగొట్టాడు. 23 ఏళ్ల ఈ యువ ఆటగాడు వరుస శతకాలతో అంతర్జాతీయ క్రికెట్‌లో తనదైన ముద్ర వేస్తున్నాడు. టెస్ట్‌ల్లో సెంచరీ.. ఆ తర్వాత వన్డేల్లో డబుల్ సెంచరీ.. ఇక ఇప్పుడు టీ20ల్లో మెరుపు శతకం.. టీమిండియాలో తన శకం మొదలైందంటూ గిల్ రికార్డులు సృష్టిస్తున్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి, రెండో టీ20 మ్యాచ్‌ల్లో విఫలమైన శుభ్‌మన్ గిల్ సిరీస్‌లోని మూడో, ఆఖరి మ్యాచ్‌లో బౌలర్లను దంచికొట్టాడు. టీ20ల్లో తొలి శతకాన్ని నమోదు చేసి.. కేవలం 5 నెలల్లోనే విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టాడు.
ఫిబ్రవరి 1న కివీస్‌తో జరిగిన ఆఖరి టీ20 మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లకు 4 వికెట్లు నష్టపోయి 234 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. గిల్ అద్భుత సెంచరీతో ప్రత్యర్ధి బౌలర్లను ఓ ఆట ఆడేసుకున్నాడు. ఈ కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్ కేవలం 63 బంతుల్లో 126 పరుగులతో చివరి వరకు అజేయంగా నిలిచాడు. తన ఇన్నింగ్స్‌లో మొదటి 53 పరుగులు 35 బంతుల్లో గిల్ చేయగా.. ఆ తర్వాత గేర్ మార్చి 25 బంతుల్లో 73 పరుగులు బాదేశాడు. అలాగే బౌండరీల రూపంలో 12 ఫోర్లు, 7 సిక్సర్లు.. అంటే 19 బంతుల్లో 90 రన్స్ రాబట్టాడు. ఇక ఈ ఇన్నింగ్స్‌తో గిల్ కొన్ని ప్రత్యేక మైలురాళ్లను అందుకోవడమే కాదు.. కొన్ని రికార్డులను సైతం బద్దలు కొట్టాడు. మరి ఆ రికార్డులేంటో తెలుసుకుందామా.?
- మూడు ఫార్మాట్లలోనూ సెంచరీలు నమోదు చేసిన ఐదో భారత బ్యాట్స్‌మెన్‌గా శుభ్‌మన్ గిల్ చరిత్ర సృష్టించాడు. అంతకు ముందు ఈ ఘనతను సురేశ్ రైనా, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ సాధించారు.
- కివీస్‌తో జరిగిన టీ20లో గిల్ కేవలం 63 బంతుల్లో 126 పరుగులు చేశాడు. ఇది ఈ ఫార్మాట్‌లో భారత బ్యాట్స్‌మెన్‌కు అత్యధిక వ్యక్తిగత స్కోర్. 5 నెలల క్రితం 2022, సెప్టెంబర్ 8న ఆఫ్ఘనిస్తాన్‌పై విరాట్ కోహ్లీ(122 నాటౌట్) నెలకొల్పిన రికార్డును గిల్ బద్దలు కొట్టాడు.
- అంతర్జాతీయ టీ20లో సెంచరీ చేసిన భారత యువ బ్యాట్స్‌మెన్‌గా శుభ్‌మన్ గిల్ రికార్డుల్లోకి ఎక్కాడు. గిల్ 23 ఏళ్ల 146 రోజుల వయసులో ఈ రికార్డు సృష్టించడం ద్వారా సురేశ్ రైనా (23 ఏళ్ల 156 రోజులు)ను అధిగమించాడు.
- న్యూజిలాండ్‌పై ఈ ఫార్మాట్‌లో అత్యధిక స్కోరు చేసిన ఆటగాడిగా గిల్ నిలిచాడు. గతంలో దక్షిణాఫ్రికాకు చెందిన రిచర్డ్ లెవీ (117 నాటౌట్) పేరిట ఉన్న రికార్డును అతడు బద్దలు కొట్టాడు. అలాగే కివీస్‌పై గత నెలలో జరిగిన వన్డేలో గిల్ డబుల్ సెంచరీతో వన్డేల్లో తన అత్యధిక వ్యక్తిగత స్కోర్ నమోదు చేసుకున్నాడు.
- అంతర్జాతీయ టీ20ల్లో గిల్‌కి ఇదే తొలి సెంచరీ. ఈ ఫార్మాట్‌లో భారత్ తరఫున శతక్కొట్టిన ఏడో బ్యాట్స్‌మెన్‌గా గిల్ నిలిచాడు. అతడి కంటే ముందు సురేశ్ రైనా, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, విరాట్ కోహ్లీ ఈ ఘనత సాధించారు.
- టీ20ల్లో కివీస్‌పై భారత్‌కు ఇదే అత్యధిక స్కోర్(234), అంతకుముందు హామిల్టన్‌లో 2019లో టీమిండియా 208 పరుగులు చేసింది.
- గతేడాది డిసెంబర్ 14 నుంచి గిల్ రికార్డులు పరిశీలిస్తే.. మూడు ఫార్మాట్‌లలోనూ కలిపి అతడు మొత్తం 5 సెంచరీలు బాదాడు. ఇంత తక్కువ మ్యాచ్‌ల్లో ఇన్ని సెంచరీలు సాధించిన ఏకైక బ్యాటర్ శుభ్‌మాన్ గిల్ ఒక్కడే.
మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం..