Shivang Kumar : వామ్మో.. బ్యాటర్లకు నరకం చూపించాడుగా..35 బంతుల్లో ఒక్క రన్ ఇవ్వలేదు..పైగా 5 వికెట్లు తీశాడు
Shivang Kumar : భారత క్రికెట్ గడ్డపై మరో అద్భుతమైన ప్రతిభ వెలుగులోకి వచ్చింది. విజయ్ హజారే ట్రోఫీలో పరుగుల సునామీ సృష్టిస్తున్న కర్ణాటక బ్యాటర్లకు మధ్యప్రదేశ్ బౌలర్ శివాంగ్ కుమార్ చుక్కలు చూపించాడు. 10 ఓవర్లు బౌలింగ్ చేసిన శివాంగ్, కేవలం 45 పరుగులు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు.

Shivang Kumar : భారత క్రికెట్ గడ్డపై మరో అద్భుతమైన ప్రతిభ వెలుగులోకి వచ్చింది. విజయ్ హజారే ట్రోఫీలో పరుగుల సునామీ సృష్టిస్తున్న కర్ణాటక బ్యాటర్లకు మధ్యప్రదేశ్ బౌలర్ శివాంగ్ కుమార్ చుక్కలు చూపించాడు. తన మంత్రముగ్ధమైన బౌలింగ్‌తో కర్ణాటకను కుప్పకూల్చి, టీమ్ ఇండియాకు ఒక కొత్త స్టార్ దొరికాడనే సంకేతాలిచ్చాడు. ముఖ్యంగా అతని చైనామన్ బౌలింగ్ శైలి ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది.
విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో కర్ణాటక బ్యాటర్లు ఆడిన ప్రతి మ్యాచ్‌లోనూ సెంచరీలతో విరుచుకుపడుతున్నారు. అటువంటి భయంకరమైన ఫామ్‌లో ఉన్న జట్టును శివాంగ్ కుమార్ తన స్పిన్ మాయాజాలంతో కేవలం 207 పరుగులకే కట్టడి చేశాడు. 10 ఓవర్లు బౌలింగ్ చేసిన శివాంగ్, కేవలం 45 పరుగులు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ఇందులో విశేషం ఏంటంటే.. అతను వేసిన మొత్తం ఓవర్లలో 35 బంతుల్లో ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు. అంటే అతని కంట్రోల్, ఖచ్చితత్వం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
శివాంగ్ కుమార్ ఒక చైనామన్ బౌలర్. అంటే కుల్దీప్ యాదవ్ లాగే తన మణికట్టుతో బంతిని అద్భుతంగా తిప్పగలడు. ఈ మర్మకళతోనే అతను కర్ణాటక మిడిల్ ఆర్డర్‌ను దెబ్బతీశాడు. అభినవ్ మనోహర్, రవిచంద్రన్ స్మరణ్, శ్రీష ఆచార్, కెఎల్ శ్రీజిత్, శ్రేయస్ గోపాల్ వంటి సీనియర్ ప్లేయర్లను పెవిలియన్ పంపాడు. ముఖ్యంగా శ్రేయస్ గోపాల్‌ను అతను క్లీన్ బౌల్ చేసిన విధానం చూస్తే, భారత క్రికెట్ భవిష్యత్తు సురక్షితంగా ఉందని అనిపిస్తుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
శివాంగ్ టాలెంటును ముందే గుర్తించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ, ఐపీఎల్ 2026 వేలంలో అతన్నిరూ.30 లక్షలకు కొనుగోలు చేసింది. దేశవాళీ క్రికెట్‌లో చాలా తక్కువ అనుభవం ఉన్నప్పటికీ, అతనిలోని వైవిధ్యతను చూసి ఎస్‌ఆర్‌హెచ్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు కేవలం 3 లిస్ట్-ఏ మ్యాచ్‌లు మాత్రమే ఆడిన శివాంగ్, ఏకంగా 10 వికెట్లు తీసి సత్తా చాటాడు. మూడో మ్యాచ్‌లోనే ఐదు వికెట్లు తీయడం సామాన్యమైన విషయం కాదు. అంతేకాకుండా, ఇతను బ్యాటింగ్ కూడా చేయగలడు. ఇప్పటికే ఒక హాఫ్ సెంచరీ కూడా అతని ఖాతాలో ఉంది.
యూపీలోని మొరాదాబాద్‌లో జన్మించిన శివాంగ్ తండ్రి ప్రవీణ్ కుమార్ కూడా క్రికెటరే. ఆయన బెంగాల్ తరపున రంజీ ట్రోఫీ ఆడారు, ప్రస్తుతం రైల్వేలో పని చేస్తున్నారు. తండ్రి ప్రోత్సాహంతో 2015లో మధ్యప్రదేశ్‌కు మారిన శివాంగ్.. అక్కడ అండర్-16 నుంచి అండర్-23 వరకు అన్ని విభాగాల్లో రాణించి ఇప్పుడు సీనియర్ టీమ్‌లో పాగా వేశాడు. ఐపీఎల్‌లో గనుక శివాంగ్‌కు అవకాశం వస్తే, తన మాయాజాలంతో ప్రత్యర్థి జట్లను గడగడలాడించడం ఖాయమని క్రికెట్ నిపుణులు అంటున్నారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.
