Vaibhav Suryavanshi : యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి శిఖర్ ధావన్ స్ట్రాంగ్ వార్నింగ్
బీహార్‌కు చెందిన 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ, ఐపీఎల్ 2025లో తన అద్భుత ప్రదర్శనతో సంచలనం సృష్టించాడు. దీంతో అంతర్జాతీయంగా గుర్తింపు సంపాదించుకున్నాడు. ఈ క్రమంలోనే శిఖర్ ధావన్ అతన్ని పొగుడుతూనే, ఫేమ్, డబ్బులను ఎలా హ్యాండిల్ చేయాలనే దానిపై ముఖ్యమైన హెచ్చరిక చేశాడు.

Vaibhav Suryavanshi : ఇటీవలి కాలంలో క్రికెట్ ప్రపంచంలో 14ఏళ్ల కుర్రాడు సెన్సేషన్ గా మారిన సంగతి తెలిసిందే.ఆడిన ప్రతి మ్యాచులోనూ తనదైన శైలిలో విజృంభిస్తూ టీం ఇండియాకు ఆశాకిరణంగా మారిపోయాడు.. ఇప్పటికే అర్థం అయ్యే ఉంటుంది అతడే వైభవ్ సూర్యవంశీ. బీహార్‌కు చెందిన వైభవ్ అద్భుతమైన ప్రదర్శనలతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న ఇండియా అండర్-19 జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న వైభవ్, సిరీస్ చివరి మ్యాచ్‌లో కేవలం 31 బంతుల్లో 86 పరుగులు చేసి వార్తల్లో నిలిచాడు.
ఐపీఎల్ 2025లో అతని అద్భుతమైన ప్రదర్శన ఇప్పటికే తనకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చింది. ఇప్పుడు ఐపీఎల్ 2026కు ముందు ఈ యువ సంచలనంపై భారత మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ దృష్టి పడింది. ధావన్ అతన్ని ప్రశంసించడమే కాకుండా, ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. తాజాగా ప్రముఖ మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో శిఖర్ ధావన్, వైభవ్ సూర్యవంశీని పొగుడుతూనే తనకు ఓ హెచ్చరిక కూడా చేశాడు.
“అతడు 14 ఏళ్ల వయసులో ఐపీఎల్ ఆడడం నిజంగా అద్భుతం. అంత చిన్న వయసులో టాప్ బౌలర్లను ఎదుర్కోవడం, ప్రపంచ క్రికెట్‌లోని పెద్ద పేర్ల ముందు ధైర్యంగా నిలబడడం ఆశ్చర్యంగా ఉంది. ఆ భారీ షాట్లు కొట్టేటప్పుడు తన కాన్ఫిడెన్స్ అద్భుతం. ఐపీఎల్ పుణ్యమా అని ఇప్పుడు మన పిల్లలు ఐదేళ్ల చిన్న వయసు నుంచే ఒక అగ్రశ్రేణి జట్టులోకి చేరాలని కలలు కంటున్నారు. వైభవ్ ఆ కలను నిజం చేసుకున్నాడు సాధించాడు కూడా. ఇది అతనికి, అతని కుటుంబానికి ఒక పెద్ద విజయం. 14 ఏళ్ల కుర్రాడు ఇంత పెద్ద లీగ్‌లో ఆధిపత్యం చెలాయించడం మామూలు విషయం కాదు” అని ధావన్ అన్నారు.
అలాగే ఐపీఎల్ 2025లో రాహుల్ ద్రావిడ్ , విక్రమ్ రాథోర్ వంటి గురువులు ఉండడం వైభవ్ అదృష్టమన్నారు. వారు ఆ వైభవ్ ను లైమ్‌లైట్ మధ్యలో కూడా నిలకడగా ఉంచడంలో సాయపడ్డారని తెలిపారు. కాకపోతే తన ముందున్న రియల్ ఛాలెంజ్ ఏంటంటే.. తను వచ్చిన పేరు ప్రఖ్యాతలను, డబ్బును ఎలా మెయింటైన్ చేస్తాడు అనేది. అతనికి లభించిన అదృష్టాలలో ఒకటి – రాహుల్, విక్రమ్ పాజీ (రాజస్థాన్ రాయల్స్ కోచ్‌లు) వంటి గొప్ప వ్యక్తుల చేతుల్లో ఉండడం. వారు అద్భుతమైన క్రికెటర్లు మాత్రమే కాదు, మంచి మనిషిని తీర్చిదిద్దడంపై కూడా దృష్టి పెడతారు. మంచి క్రికెటర్ మాత్రమే కాకుండా మంచి మనిషిగా ఉండటం ఈ రోజుల్లో చాలా ముఖ్యమని శిఖర్ ధావన్ అన్నాడు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..