Virat Kohli: టీ20 ప్రపంచ కప్ తర్వాత కోహ్లి రిటైర్మెంట్? పాక్ మాజీ ప్లేయర్ కీలక వ్యాఖ్యలు..
విరాట్ కోహ్లీ ఆసియా కప్ 2022లో అద్భుతమైన సెంచరీతో ఫామ్‌లోకి తిరిగి వచ్చాడు. అయితే, ఈ క్రమంలో పాక్ మాజీ ప్లేయర్ ఓ కీలక సలహా ఇచ్చాడు.
2022 ఆసియా కప్‌లో టీమ్ ఇండియా మెరుగైన ప్రదర్శన చేయనప్పటికీ, విరాట్ కోహ్లీ తిరిగి ఫామ్‌లోకి రావడం, టీమిండియాకు శుభపరిణామంగా మారింది. ఆసియా కప్‌లో ఆఫ్ఘనిస్థాన్‌పై విరాట్ కోహ్లీ అద్భుత సెంచరీ చేశాడు. 1021 రోజుల తర్వాత విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో సెంచరీ సాధించాడు. విరాట్ కోహ్లీ ఆసియా కప్‌లో 90కి పైగా సగటుతో పరుగులు సాధించాడు. ఈ మధ్యే రిటైర్మెంట్ విషయంలో పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది ఓ సలహా ఇచ్చాడు. దీంతోనే విరాట్ కోహ్లి బ్యాట్ పరుగుల వర్షం కురిపిస్తోందని అంటున్నారు.
విరాట్ కోహ్లీకి షాహిద్ అఫ్రిది సలహా..
జట్టును వీడకుండా మంచి ప్రదర్శన చేస్తూనే క్రికెట్‌కు వీడ్కోలు పలకాలని విరాట్ కోహ్లీకి షాహిద్ అఫ్రిది సలహా ఇచ్చాడు. సామా టీవీతో అఫ్రిది మాట్లాడుతూ, ‘విరాట్ కోహ్లీ ఆటను చూపించిన విధానం, పేరు సంపాదించడానికి ముందు అతను ఎంతో కష్టాలను ఎదుర్కోవలసి వచ్చింది. అతను ఛాంపియన్ ప్లేయర్. కానీ, రిటైర్మెంట్ వైపు వెళ్లే సమయం వస్తుంది. కానీ, ఇలాంటి సందర్భంలో గర్వంగా వీడ్కోలు పలకడమే మీ లక్ష్యం’ అంటూ వెల్లడించాడు.
షాహిద్ అఫ్రిది మాట్లాడుతూ, ‘నిన్ను జట్టు నుంచి తప్పించాలనే విషయం అక్కడికి చేరుకోకూడదు. మీరు మీ వంతు కృషి చేసి పదవీ విరమణ చేయాలి. చాలా తక్కువ మంది మాత్రమే ఇలాంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ముఖ్యంగా ఆసియా ఆటగాళ్లకు ఇది చాలా కష్టం. విరాట్ కోహ్లీ సగర్వంగా రిటైర్ అవుతాడని భావిస్తున్నా’ అంటూ పేర్కొన్నాడు.
ఒక్క ఫార్మాట్ నుంచి కోహ్లీ తప్పుకుంటాడా?
టీ 20 ప్రపంచకప్ తర్వాత, టీమిండియాకు చెందిన ఈ వెటరన్ ప్లేయర్ భారీ నిర్ణయం తీసుకుంటాడని వార్తలు వెలువడుతున్నాయి. మీడియా కథనాల ప్రకారం, టీ20 ఫార్మాట్ నుంచి వైదొలగడం గురించి విరాట్ కోహ్లీతో చర్చలు కూడా ఇప్పటికే ప్రారంభమయ్యాయి. విరాట్ కోహ్లీ స్వయంగా ఒక ఫార్మాట్‌కు వీడ్కోలు పలికే ఆలోచనలో ఉన్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే ప్రస్తుతం టీమిండియా ఎంతో క్రికెట్ ఆడుతోంది. విరాట్ కోహ్లీ శరీరం మునుపటిలాగా మూడు ఫార్మాట్‌ల భారాన్ని మోయలేకపోతోంది. మరి విరాట్ కోహ్లీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.