AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lionel Messi : ఖండాలు దాటిన తలా క్రేజ్.. మెస్సీని ధోనీతో పోలుస్తూ ఫిఫా వేసిన మైండ్ బ్లాక్ పోస్టర్

Lionel Messi : ఫిఫా మెస్సీని ధోనీతో పోలుస్తూ విడుదల చేసిన పోస్టర్ వైరల్‌గా మారింది. అయితే ఆటతీరు, వ్యక్తిత్వం, ప్రపంచకప్ ప్రయాణం, అభిమానుల ప్రభావం పరంగా చూస్తే లియోనల్ మెస్సీకి అత్యంత దగ్గరగా ఉండే భారత క్రికెటర్ సచిన్ టెండూల్కర్ అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Lionel Messi : ఖండాలు దాటిన తలా క్రేజ్.. మెస్సీని ధోనీతో పోలుస్తూ ఫిఫా వేసిన మైండ్ బ్లాక్ పోస్టర్
Lionel Messi
Rakesh
|

Updated on: Jun 18, 2026 | 5:39 PM

Share

Lionel Messi : ప్రస్తుతం జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్ 2026 గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లో అల్జీరియాపై అర్జెంటీనా 3-0 తేడాతో ఘన విజయం సాధించింది. 38 ఏళ్ల వయసులోనూ లియోనల్ మెస్సీ తన అద్భుతమైన నైపుణ్యాలతో మైదానంలో మ్యాజిక్ చేశాడు. ఈ విజయం తర్వాత ఇంటర్నేషనల్ ఫుట్‌బాల్ అసోసియేషన్(FIFA) మెస్సీకి సంబంధించిన ఒక ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది. అయితే ఆ పోస్టర్‌పై భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి మారుపేరైన తలా అనే పదాన్ని రాయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. దీంతో ఫుట్‌బాల్ లెజెండ్ మెస్సీతో పోల్చదగ్గ భారత క్రికెటర్ ఎవరు అనే ఆసక్తికరమైన విశ్లేషణ మొదలైంది.

ధోనీ, కోహ్లీల విభిన్న శైలి

భారత క్రికెట్‌లో ఎంఎస్ ధోనీ ప్రశాంతతకు, చాకచక్యానికి మారుపేరు. మెస్సీ లాగే ధోనీ కూడా చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు, మైదానంలో తన ప్లాన్ల ద్వారానే సమాధానం చెప్తాడు. ఉన్న వనరులతోనే అద్భుతాలు చేయగల సత్తా ధోనీ సొంతం. మరోవైపు విరాట్ కోహ్లీ శైలి పూర్తిగా భిన్నమైనది. కోహ్లీ మైదానంలో విపరీతమైన దూకుడు ప్రదర్శిస్తాడు. ఎలాంటి సవాల్‌నైనా ఎదురువెళ్లి ఢీకొంటాడు. కోహ్లీ ప్రపంచ స్థాయి ఆటగాడు అయినప్పటికీ, తన దూకుడు స్వభావం వల్ల తాను మెస్సీకి అంత దగ్గరగా ఉండలేనని బహుశా కోహ్లీ కూడా ఒప్పుకుంటాడు.

సరిగ్గా సరిపోయే సచిన్, మెస్సీ జర్నీ

కానీ లోతుగా పరిశీలిస్తే.. భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ మాత్రమే లియోనల్ మెస్సీకి అత్యంత దగ్గరగా ఉంటాడని క్రీడా విశ్లేషకులు చెప్తున్నారు. వీరిద్దరి ఆటతీరు, వారి క్రీడా ప్రయాణం, వ్యక్తిత్వంలో చాలా అద్భుతమైన పోలికలు ఉన్నాయి. సచిన్ కూడా కెరీర్ ప్రారంభం నుంచి ఎంతో ప్రశాంతంగా ఉంటూ, తన బ్యాట్‌తోనే ప్రత్యర్థులకు సమాధానం చెప్పేవాడు. జట్టులోని మిగతా ఆటగాళ్లంతా సచిన్ చుట్టూ ఉండటాన్ని ఎంతో సురక్షితంగా భావించేవారు, సరిగ్గా మెస్సీ చుట్టూ అర్జెంటీనా ప్లేయర్లు ఉన్నట్లే.

దేవుడు ఇచ్చిన అసాధారణ ప్రతిభ

మెస్సీని ఫుట్‌బాల్ ప్రపంచంలో ఒక గ్రహాంతరవాసిగా, అద్భుతాలు చేసే మాంత్రికుడిగా అభివర్ణిస్తారు. మైదానంలో అతడు బాల్‌తో చేసే విన్యాసాలు చూసేవారిని సీట్లలోంచి లేచేలా చేస్తాయి. సరిగ్గా సచిన్ టెండూల్కర్ కూడా చాలా చిన్న వయసులోనే టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చి, క్రికెట్ చరిత్రలోనే అత్యంత ప్రతిభావంతుడైన ఆటగాడిగా ఎదిగాడు. ప్రపంచంలోని ఎంతటి భయంకరమైన బౌలర్లనైనా సచిన్ ఎంతో సులువుగా ఎదుర్కొనేవాడు. ఒకే లెంగ్త్ లో వచ్చే బంతిని రెండు వేర్వేరు దిశల్లో షాట్లుగా మార్చగల అసాధారణ నైపుణ్యం సచిన్ సొంతం.

ప్రపంచకప్ కోసం సుదీర్ఘ నిరీక్షణ

వీరిద్దరి కెరీర్‌లో అత్యంత పెద్ద పోలిక ప్రపంచకప్ విజయం. లియోనల్ మెస్సీ 2006లో తన మొదటి ఫిఫా వరల్డ్ కప్ ఆడాడు. కానీ ఆ తర్వాత 2010, 2014, 2018 టోర్నీలలో కప్‌ను ముద్దాడలేకపోయాడు. చివరకు తన ఐదో ప్రయత్నంలో 2022 లో ఖతార్ వేదికగా వరల్డ్ కప్ ట్రోఫీని గెలుచుకుని తన కల నిజం చేసుకున్నాడు. సచిన్ టెండూల్కర్ కథ కూడా సరిగ్గా ఇలాంటిదే. సచిన్ 1992 లో తన మొదటి క్రికెట్ వరల్డ్ కప్ ఆడాడు. ఆ తర్వాత 1996, 1999, 2003, 2007 లలో విఫలమై.. చివరకు తన ఆరో ప్రయత్నంలో 2011 లో ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడాడు.

ఆటగాళ్లే కాదు.. బోర్డులు కూడా వినే మాట

వ్యక్తిత్వం పరంగా చూస్తే మెస్సీ ఎక్కువ మాట్లాడడు, కానీ అతడు డ్రెస్సింగ్ రూమ్‌లో ఏదైనా చెప్తే అర్జెంటీనా ఆటగాళ్లంతా ఎంతో శ్రద్ధగా వింటారు. అతడు మాటల కంటే చేతలతోనే జట్టును ముందుండి నడిపిస్తాడు. సచిన్ టెండూల్కర్ కూడా అంతే శాంతస్వభావి. సచిన్ ఎక్కువగా మాట్లాడకపోయినా, అతడు ఏదైనా సలహా ఇస్తే తోటి ఆటగాళ్లతో పాటు ఏకంగా బీసీసీఐ కూడా ఆ మాటను ఎంతో గౌరవంగా పరిగణనలోకి తీసుకుంటుంది. అందుకే అన్ని రకాలుగా చూసుకుంటే క్రికెట్ ప్రపంచపు లియోనల్ మెస్సీ మన సచిన్ టెండూల్కరే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us