AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌ను సర్పంచ్ సాబ్ అని ఎందుకు అంటారు..? అసలు సీక్రెట్ ఇదే..

టీమిండియా స్టార్ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ పేరు వినగానే బ్యాటింగ్‌తో పాటు అతడి డ్రెస్సింగ్ రూమ్ ఫన్ కూడా గుర్తొస్తుంది. అయితే గత కొంతకాలంగా మైదానంలో అయ్యర్ కనిపిస్తే చాలు సర్పంచ్ సాబ్ అనే నినాదాలు హోరెత్తుతున్నాయి. అసలు ఈ నిక్‌నేమ్‌ను మొదట ఎవరు పెట్టారు? ఈ పేరు విన్నప్పుడు అయ్యర్ రియాక్షన్ ఏంటి? అనే ఆసక్తికర విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌ను సర్పంచ్ సాబ్ అని ఎందుకు అంటారు..? అసలు సీక్రెట్ ఇదే..
Why Is Shreyas Iyer Called Sarpanch Saab
Krishna S
|

Updated on: Nov 01, 2026 | 5:47 PM

Share

టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌కు క్రికెట్ వర్గాల్లో, అభిమానుల్లో రకరకాల ముద్దుపేర్లు ఉన్నాయి. కానీ పంజాబ్ కింగ్స్ జట్టు పగ్గాలు చేపట్టినప్పటి నుంచి అతడిని అందరూ ముద్దుగా సర్పంచ్ సాబ్ అని పిలవడం మొదలుపెట్టారు. మొదట్లో నార్త్ ఇండియా ఫ్యాన్స్, సహచరుల మధ్య మొదలైన ఈ పిలుపు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. అసలు ముంబైకి చెందిన అయ్యర్‌కు ఈ పంజాబీ స్టైల్ టైటిల్ ఎలా వచ్చింది? అనే విషయం చాలా మందికి తెలియదు. ఐపీఎల్‌లో కేకేఆర్‌ను ఛాంపియన్‌గా నిలిపిన అనంతరం శ్రేయస్ అయ్యర్ పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీకి కెప్టెన్‌గా మారాడు. పంజాబ్ సంస్కృతిలో గ్రామ పెద్ద లేదా అందరినీ నడిపించే నాయకుడిని గౌరవంగా సర్పంచ్ అని పిలుస్తారు. మైదానంలో జట్టును ముందుండి నడిపించే కెప్టెన్‌గా అయ్యర్ బాధ్యత తీసుకోవడంతో పంజాబ్ అభిమానులు అతడిని తమ సర్పంచ్ సాబ్ అంటూ ప్రేమగా పిలవడం మొదలుపెట్టారు.

మొదట్లో నాకేం అర్థం కాలేదు – అయ్యర్

ఈ నిక్‌నేమ్ గురించి శ్రేయస్ అయ్యర్ ఓ ఇంటర్వ్యూలో స్వయంగా స్పందిస్తూ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. ‘‘పంజాబ్ కింగ్స్‌లోకి వచ్చిన కొత్తలో చండీగఢ్, మొహాలీ రోడ్లపై వెళ్తున్నప్పుడు అభిమానులు నన్ను సర్పంచ్ సాబ్ అని నినదించడం చూసి మొదట్లో నాకేం అర్థం కాలేదు. ఆ తర్వాత జట్టులోని అర్ష్‌దీప్ సింగ్ సహా సహచరులను అడిగి దీని అర్థం తెలుసుకున్నాను. కుటుంబానికి లేదా సమాజానికి దిశానిర్దేశం చేసే నాయకుడిని అలా పిలుస్తారని వాళ్లు చెప్పారు. ఆ తర్వాత ఈ పేరు నాకు ఎంతో నచ్చింది, నాలో మరింత ఉత్సాహాన్ని నింపింది’’ అని అయ్యర్ సరదాగా చెప్పుకొచ్చాడు.

మైదానంలో ఆ స్వాగ్.. ఆ బాడీ లాంగ్వేజ్

కేవలం జట్టు నాయకత్వానికే కాకుండా అయ్యర్ నడక, అతని బాడీ లాంగ్వేజ్‌కు కూడా ఈ పేరు సరిగ్గా సరిపోయింది. గ్రౌండ్‌లోకి అడుగుపెట్టేటప్పుడు కాస్త భుజాలు ఎగరేస్తూ, చేతులు తిప్పుతూ, ఊళ్లో పెద్దమనిషి రౌండ్స్‌కు వచ్చినట్లుగా సరదాగా నడవడం అయ్యర్ ట్రేడ్‌మార్క్ స్టైల్. అంతా నేనే చూసుకుంటా అన్నట్లు ఉండే అతని హావభావాలు అచ్చం ఊరి సర్పంచ్‌ను తలపిస్తుండటంతో ఈ బిరుదు అతడికి అతికినట్లు సరిపోయింది.

సోషల్ మీడియాలో మీమ్స్, ప్రశంసలు

పంజాబ్ కింగ్స్ డిజిటల్ టీమ్ కూడా ఈ ట్యాగ్‌ను విరివిగా ప్రమోట్ చేయడంతో సోషల్ మీడియాలో సర్పంచ్ సాబ్ విపరీతంగా వైరల్ అయింది. మైదానంలో అయ్యర్ సిక్సర్లు బాదినా, వ్యూహాత్మక కెప్టెన్సీతో మ్యాచ్‌లు గెలిపించినా.. సర్పంచ్ సాబ్ మాస్, సర్పంచ్ దెబ్బకు ప్రత్యర్థులు విలవిల అంటూ అభిమానులు మీమ్స్‌తో హోరెత్తిస్తుంటారు. నాయకుడిగా జట్టును ముందుకు నడిపించే తెగువ, డ్రెస్సింగ్ రూమ్‌లో కూల్‌గా ఉండే స్వభావం కలగలిసిన శ్రేయస్ అయ్యర్ స్వాగ్‌కు ఈ సర్పంచ్ సాబ్ బిరుదు ఇప్పుడు ఒక ప్రత్యేకమైన బ్రాండ్‌గా స్థిరపడిపోయింది.

Follow Us