AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: తెలంగాణలో లక్షలాది కుటుంబాలకు గుడ్‌న్యూస్‌.. నవంబర్ 26న భారీ శుభవార్త!

Telangana: సమాజంలో ఆర్థికంగా అండ అవసరమైన వారికి భద్రత కల్పించడం, మహిళలకు ఆత్మగౌరవం అందించడం ప్రజా ప్రభుత్వ సంక్షేమ విధానంలో కీలక భాగమని మంత్రి పేర్కొన్నారు. అందుకే రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ రెండు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం ప్రాధాన్యతను సంతరించుకుందన్నారు..

Telangana: తెలంగాణలో లక్షలాది కుటుంబాలకు గుడ్‌న్యూస్‌.. నవంబర్ 26న భారీ శుభవార్త!
Tg Govet
Prabhakar M
| Edited By: |

Updated on: Nov 19, 2026 | 1:20 PM

Share

Telangana: రాజ్యాంగం ప్రతి పౌరుడికి కల్పించిన సామాజిక న్యాయం, సమానత్వం, గౌరవప్రదమైన జీవనం అనే స్ఫూర్తికి అనుగుణంగా ప్రజా ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని పంచాయ‌తీ రాజ్ గ్రామీణాభివృద్ది, మ‌హిళా శిశు సంక్షేమ శాఖ‌ల‌ మంత్రి డా. ద‌న‌స‌రి అన‌సూయ సీతక్క అన్నారు. రాజ్యాంగ దినోత్సవమైన నవంబర్ 26న రాష్ట్రవ్యాప్తంగా 4,63,857 మందికి కొత్తగా చేయూత పెన్షన్ దారుల‌ ఖాతాల్లో పెన్షన్ మొత్తాన్ని జమ చేయనున్నట్లు తెలిపారు. అదే రోజు కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.

సమాజంలో ఆర్థికంగా అండ అవసరమైన వారికి భద్రత కల్పించడం, మహిళలకు ఆత్మగౌరవం అందించడం ప్రజా ప్రభుత్వ సంక్షేమ విధానంలో కీలక భాగమని మంత్రి పేర్కొన్నారు. అందుకే రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ రెండు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం ప్రాధాన్యతను సంతరించుకుందన్నారు.

4,63,857 కుటుంబాలకు కొత్తగా చేయూత

వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు తదితర అర్హులైన వర్గాలకు కొత్తగా మంజూరయ్యే 4,63,857 చేయూత పెన్షన్లు వారి కుటుంబాలకు నెలవారీ ఆర్థిక భరోసాను అందిస్తాయని సీతక్క తెలిపారు. పెన్షన్ మంజూరు కోసం ఎదురుచూస్తున్న అర్హులకు నవంబర్ 26నుంచే ప్రయోజనం అందేలా చర్యలు తీసుకున్నామని, పెన్షన్ మొత్తం అదే రోజు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని చెప్పారు. ఇది కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాకుండా, సమాజంలో ప్రతి వ్యక్తి గౌరవంగా జీవించాలన్న రాజ్యాంగ లక్ష్యానికి అనుగుణంగా ప్రభుత్వం కల్పిస్తున్న సామాజిక భద్రతకు నిదర్శనమన్నారు.

కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీర

ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని నవంబర్ 26న విస్తృత స్థాయిలో ముందుకు తీసుకెళ్లనున్నామని మంత్రి తెలిపారు. కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరలను అందించే కార్యక్రమానికి ఆరోజు శ్రీకారం చుట్టనున్నట్లు చెప్పారు. తెలంగాణ ఆడబిడ్డకు చీర అంటే కేవలం వస్త్రం కాదని, పుట్టింటి ఆత్మీయత, గౌరవానికి ప్రతీక అని సీతక్క అన్నారు. ఆడబిడ్డను గౌరవించే తెలంగాణ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఇందిరమ్మ చీరలను అందిస్తున్నామని తెలిపారు.

మహిళలకు చీర అందించడంతో పాటు వారిని ఆర్థికంగా స్వావలంబులుగా తీర్చిదిద్దే కార్యక్రమాలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. మహిళా ఉన్నతి–తెలంగాణ ప్రగతి లక్ష్యంతో స్వయం సహాయక సంఘాల మహిళలకు రుణాలు, ఉపాధి, వ్యాపార అవకాశాలు, మార్కెట్ సదుపాయాలను కల్పిస్తూ ఆర్థిక సాధికారత దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. రాజ్యాంగ స్ఫూర్తితో నవంబర్ 26న ఒకే వేదికగా రెండు కీలక కార్యక్రమాలు ప్రారంభం కావడం ద్వారా ప్రజా ప్రభుత్వం తన పాలనా దృక్పథాన్ని చాటుతోందని సీతక్క అన్నారు. చేయూత ద్వారా బలహీన వర్గాలకు ఆర్థిక భరోసా.. ఇందిరమ్మ చీర ద్వారా మహిళలకు ఆత్మీయత, గౌరవం అందిస్తున్నామని పేర్కొన్నారు.

రాజ్యాంగం నిర్దేశించిన సామాజిక న్యాయం, సమానత్వం ప్రతి కుటుంబానికి చేరేలా ప్రభుత్వం పనిచేస్తోందని, మహిళలు ఆర్థికంగా ఎదిగి రాష్ట్ర అభివృద్ధిలో కీలక భాగస్వాములుగా మారేలా మరిన్ని కార్యక్రమాలను కొనసాగిస్తామని మంత్రి సీతక్క స్పష్టం చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us