నార్సింగిలో భారీ అగ్ని ప్రమాదం..12 నుంచి 18వ అంతస్తు వరకు ఎగిసి పడుతున్న మంటలు!
హైదరాబాద్‌లోని నార్సింగి పరిధిలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పసిఫికా హిల్‌క్రెస్ట్ (Pacifica Hillcrest) హైరైజ్ అపార్ట్‌మెంట్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో నివాసితులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అపార్ట్‌మెంట్‌లోని 12వ అంతస్తు నుంచి 18వ అంతస్తు వరకు మంటలు వేగంగా వ్యాపించడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది.

రంగారెడ్డి జిల్లా నార్సింగి పరిధిలోని పసిఫికా హిల్‌క్రెస్ట్ అపార్ట్‌మెంట్‌లో ఈ అగ్నిప్రమాదం సంభవించింది. అపార్ట్‌మెంట్‌లోని ఒక బ్లాక్‌లో ఒక్కసారిగా మంటలు ఎగసిపడటంతో ఏం జరుగుతుందో తెలియక నివాసితులు భయంతో పరుగులు తీశారు. మంటల తీవ్రతకు పలు అంతస్తుల్లోని ఫాల్‌సీలింగ్ పూర్తిగా కాలిపోయినట్లు సమాచారం. ముఖ్యంగా 12వ అంతస్తు నుంచి 18వ అంతస్తు వరకు అగ్నికీలలు వ్యాపించడంతో అపార్ట్‌మెంట్ వాసులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. దట్టమైన మంటలు, పొగతో భవనంలో పరిస్థితి భీతావహంగా మారింది.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలు ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా ఉండేందుకు ఫైర్ సిబ్బంది ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టారు. మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగించారు.
అయితే ఈ అగ్నిప్రమాదానికి అసలు కారణం ఏమిటన్నది ఇంకా స్పష్టత రాలేదు. షార్ట్ సర్క్యూట్ కారణమా? మరేదైనా కారణమా? అనే కోణంలో వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనలో ఎంతమేర ఆస్తి నష్టం జరిగింది? ఎవరైనా గాయపడ్డారా? ప్రాణనష్టం ఏమైనా జరిగిందా? అనే విషయాలపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి