సంపెంగ పువ్వు వెనుక ఇంత సైన్సా? శివపూజలో ఎందుకు నిషేధించారో తెలుసా?
మత్తెక్కించే సువాసనతో అలరించే సంపెంగ పువ్వు చిన్న బీటిల్ పురుగుల పరాగసంపర్కంతో కొత్త జీవితాన్ని కొనసాగిస్తుంది. శివపురాణంలోని నారదుడి శాపం కారణంగా కొన్ని సంప్రదాయాల్లో దీనిని శివుడికి సమర్పించరు. ఇది ప్రకృతి, పురాణాల సమ్మేళనం. దీని గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం పదండి ..

ఒక్క సంపెంగ పువ్వు చాలు.. చుట్టుపక్కల వాతావరణం మొత్తం పరిమళంతో నిండిపోతుంది. పసుపు, బంగారు రంగు రేకులతో చూపులను ఆకట్టుకోవడమే కాదు.. తన ఘాటైన సువాసనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఈ పువ్వు. చంపకము, చంపా పేర్లతోనూ పిలిచే సంపెంగకు ప్రకృతిలోనే కాదు, భారతీయ సంస్కృతిలోనూ ప్రత్యేక స్థానం ఉంది. అయితే ఈ పువ్వు వెనుక ఆసక్తికరమైన శాస్త్రీయ విశేషాలు, పురాణ కథలు కూడా ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.
సంపెంగ చెట్టు ఎలా పెరుగుతుంది?
సంపెంగ చెట్టు జీవితం ఓ చిన్న విత్తనంతో మొదలవుతుంది. తగినంత తేమ, వెచ్చదనం ఉన్న నేలలో విత్తనం మొలకెత్తుతుంది. మొదట వేరు మట్టిలోకి విస్తరిస్తే.. మరోవైపు చిన్న చిగురు నేలపైకి వస్తుంది. కాలక్రమంలో కాండం బలపడుతుంది. పచ్చని ఆకులు విస్తరిస్తాయి. ఇలా ఎదిగిన సంపెంగ చెట్టు అనుకూల పరిస్థితుల్లో పెద్ద వృక్షంగా మారుతుంది.
సంపెంగ చెట్టు సాధారణంగా సతతహరిత వృక్షం. అంటే ఏడాది పొడవునా ఆకులు కలిగి ఉంటుంది. అడవుల్లో సహజంగా పెరగడమే కాకుండా, తోటలు, ఇళ్ల పరిసరాల్లోనూ దీనిని పెంచుతారు. ప్రాంతాన్ని బట్టి పుష్పించే కాలం మారుతుంది. సాధారణంగా వేసవి నుంచి వర్షాకాలం వరకు పూలు ఎక్కువగా కనిపిస్తాయి.
ఇంత మంచి వాసన ఎలా వస్తుంది?
సంపెంగ పువ్వును ప్రత్యేకంగా నిలబెట్టేది దాని పరిమళమే. మరి ఈ వాసన వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి? పువ్వు నుంచి గాలిలోకి విడుదలయ్యే వోలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ (VOCs) అనే సువాసన రసాయనాల మిశ్రమమే దీనికి కారణం.
2017లో ప్రచురితమైన ఓ పరిశోధనలో సంపెంగ పువ్వుల నుంచి 43 రకాల VOCలను గుర్తించారు. వాటిలో టెర్పెనాయిడ్స్, వోలటైల్ ఎస్టర్స్ ప్రధానంగా ఉన్నాయి. ముఖ్యంగా లినాలూల్ వంటి సమ్మేళనాలు సంపెంగ పరిమళానికి దోహదపడతాయి.
ఈ సువాసన మనకు ఆహ్లాదాన్ని ఇస్తుంది. కానీ ప్రకృతిలో దీని పని అంతటితో ఆగిపోదు. పువ్వుల దగ్గరకు పరాగసంపర్కం చేసే జీవులను ఆకర్షించడంలోనూ పూల పరిమళం పాత్ర పోషిస్తుంది. అందుకే సంపెంగ పూలను సుగంధ ద్రవ్యాలు, పరిమళ ఉత్పత్తుల తయారీలోనూ ఉపయోగిస్తారు.
సంపెంగకు బీటిల్స్తో ప్రత్యేక బంధం!
పువ్వు నుంచి మరో పువ్వుకు పరాగరేణువులు చేరితేనే ఫలదీకరణ ప్రక్రియకు అవకాశం ఏర్పడుతుంది. సంపెంగ పూల పరాగసంపర్కంలో బీటిల్స్ కీలక పాత్ర పోషిస్తాయి. పువ్వులపైకి వచ్చే ఈ గండు పురుగుల శరీరాలకు పరాగరేణువులు అంటుకుంటాయి. అవి మరో పువ్వును సందర్శించినప్పుడు ఆ రేణువులు అక్కడికి చేరుతాయి. ఇలా సంపెంగ చెట్టు తన తర్వాతి తరాన్ని తయారు చేసుకునే ప్రక్రియలో ఈ చిన్న జీవులు సహాయపడతాయి.
పువ్వు వాడిపోయాక ఏం జరుగుతుంది?
సంపెంగ పువ్వు వాడిపోయిందంటే దాని కథ ముగిసినట్టు కాదు. పరాగసంపర్కం, ఫలదీకరణం విజయవంతమైతే పువ్వు స్థానంలో ఫలాల గుత్తి అభివృద్ధి చెందుతుంది. అవి పక్వానికి వచ్చినప్పుడు చీలి, లోపల ఉన్న విత్తనాలు బయటపడతాయి. ఈ విత్తనాలపై ఎరుపు లేదా గులాబీ రంగులో కండలాంటి పొర ఉంటుంది.
పక్షులు, ఇతర జంతువులు ఈ విత్తనాల వ్యాప్తికి సహాయపడతాయి. అవి విత్తనాలను మరో ప్రాంతానికి తీసుకెళ్లడం ద్వారా కొత్త మొక్కలు పెరిగేందుకు అవకాశం కల్పిస్తాయి. అనుకూలమైన నేల, తేమ లభిస్తే అక్కడ మరో సంపెంగ మొక్క మొలకెత్తుతుంది. అంటే ఒక పువ్వు వాడిపోయినా.. కొత్త చెట్టు పుట్టుకకు దారి తీసే ప్రకృతి ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది.
శివుడికి సంపెంగ పువ్వు ఎందుకు సమర్పించరు?
సంపెంగ పువ్వు అందంగా ఉంటుంది.. పరిమళభరితంగా ఉంటుంది. అయినా కొన్ని శైవ సంప్రదాయాల్లో శివుడి పూజకు దీనిని ఉపయోగించరు. దీని వెనుక ఓ ఆసక్తికరమైన పురాణ గాథ ప్రచారంలో ఉంది.
కథనం ప్రకారం.. గోకర్ణ ప్రాంతంలో ఓ బ్రాహ్మణుడు సంపెంగ పూలను కోసి శివుడిని పూజించేవాడు. ఒకసారి అక్కడికి వచ్చిన నారద మహర్షి పూల గురించి సంపెంగ చెట్టును అడిగారట. అయితే చెట్టు నిజం చెప్పకుండా, ఎవరూ పూలు కోయలేదని అబద్ధం చెప్పిందట. ఆ తర్వాత నిజం తెలుసుకున్న నారదుడు ఆ చెట్టును శపించాడని పురాణ గాథ చెబుతుంది. అప్పటి నుంచి శివపూజలో సంపెంగ పూలను ఉపయోగించకూడదనే విశ్వాసం కొన్ని ప్రాంతాల్లో కొనసాగుతోంది.
అయితే ఇది పురాణ విశ్వాసానికి సంబంధించిన విషయం మాత్రమే. అన్ని ప్రాంతాల్లోనూ, అన్ని పూజా సంప్రదాయాల్లోనూ ఇదే ఆచారం ఉందని చెప్పలేం. సంపెంగను ఇతర పూజల్లో పవిత్రమైన పువ్వుగా ఉపయోగించే సంప్రదాయాలూ ఉన్నాయి.
ఒక పువ్వులో ఇన్ని విశేషాలా?
సంపెంగను చూస్తే అందమైన పువ్వు, దాని పరిమళం మాత్రమే గుర్తుకొస్తాయి. కానీ దాని వెనుక విత్తనం నుంచి చెట్టుగా ఎదిగే జీవచక్రం, సువాసనను సృష్టించే రసాయనాలు, పరాగసంపర్కానికి తోడ్పడే కీటకాలు, విత్తనాలను వ్యాప్తి చేసే పక్షులు, జంతువుల పాత్ర దాగి ఉన్నాయి. మరోవైపు పురాణ గాథలు, పూజా సంప్రదాయాలు దానికి సాంస్కృతిక ప్రాధాన్యతను తీసుకొచ్చాయి. ప్రకృతిలోని ఓ చిన్న పువ్వు వెనుక శాస్త్రం, సంస్కృతి రెండూ ఎంత అందంగా కలిసిపోయాయో సంపెంగను చూస్తే అర్థమవుతుంది!
