మీతో మాట్లాడేవారు నిజం చెబుతున్నారా, అబద్ధమా? ఈజీగా కనిపెట్టే సీక్రెట్ ట్రిక్స్ ఇవే!
మాట అనేది మనిషికి ఉండే అత్యంత శక్తివంతమైన ఆయుధం. సాధారణంగా చాలామంది ఎదుటివారి మాటలను బట్టి ఒక అంచనాకు వస్తుంటారు. అయితే మనతో మాట్లాడుతున్న వ్యక్తి నిజం చెబుతున్నారా లేదా అబద్ధం చెబుతున్నారా అని తెలుసుకోవాలని ఉంటుంది. ఆ సీక్రెట్ ట్రిక్స్ ఏంటో మీకోసం..

మాట అనేది మనిషికి ఉండే అత్యంత శక్తివంతమైన ఆయుధం. ప్రకృతిలో మరే ఇతర జీవికి కలగని వరం.. మానవుడు మాత్రమే పొందుతున్న అత్యంత అరుదైన కానుక ఇదే అని చెప్పొచ్చు. సహజంగా ఒక మంచి మాట నిరాశలో ఉన్నవారికి కూడా కొండంత ధైర్యాన్ని ఇస్తే.. కొన్ని మాత్రం ఎదుటి వారికి జీవితకాలం మానని గాయాన్ని మిగులుస్తాయి. అందుకే మాట్లాడే ముందు ఒక్క క్షణం ఆలోచించడం ఎంతో అవసరమని పెద్దలు చెబుతుంటారు. మరి ముఖ్యంగా మన మాట తీరు మన వ్యక్తిత్వానికి అద్దం పడుతుందని కూడా చెబుతుంటారు. అయితే మనతో మాట్లాడుతున్న వ్యక్తి నిజం చెబుతున్నారా లేదా అబద్ధం చెబుతున్నారా అని తెలుసుకోవాలనుకుంటున్నారా ? అయితే ఈ స్టోరీ మీకోసమే..
సాధారణంగా చాలామంది ఎదుటివారి మాటలను బట్టి ఒక అంచనాకు వస్తుంటారు. కానీ వారి మాటల కంటే కూడా వారి బాడీ లాంగ్వేజ్, ప్రవర్తనలో వచ్చే చిన్నపాటి మార్పులే అసలు నిజాన్ని బయటపెడతాయని అంటున్నారు అమెరికా నిఘా సంస్థ సీఐఏ (CIA) మాజీ అండర్ కవర్ ఆఫీసర్ మిచెల్ రిగ్బీ అసద్. మధ్యప్రాచ్య దేశాల్లో పదేళ్లపాటు సీఐఏ తరఫున రహస్య ఆపరేషన్లలో పనిచేసిన ఆమె.. అనుమానితుల నుంచి నిజాలు రాబట్టే క్రమంలో తాను నేర్చుకున్న కీలక విషయాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. అవేంటో తెలుసుకుందాం..
అవే అసలు క్లూ..
ఎదుటివారిని అంచనా వేసేటప్పుడు ముందుగా వారు సాధారణ పరిస్థితుల్లో ఎలా ప్రవర్తిస్తారో గమనించాలని మిచెల్ చెబుతున్నారు. ఈ మేరకు తన కెరీర్‌లో ఎదురైన ఒక ఆసక్తికర ఘటనను ఆమె గుర్తుచేసుకున్నారు. మరో దేశం కోసం రహస్యంగా పనిచేస్తున్నాడనే అనుమానం ఉన్న ఒక అరబ్ ఇంటెలిజెన్స్ అధికారిని ఆమె విచారించినట్టు వెల్లడించారు. అతనితో మాట్లాడే సందర్భంలో నేరుగా విషయానికి రాకుండా.. కొన్ని గంటలపాటు సాధారణ విషయాలు మాట్లాడుతూ అతని బాడీ లాంగ్వేజ్‌ను నిశితంగా పరిశీలించానని అన్నారు. ఆ తర్వాత మాటల మధ్యలో ఒక్కో దేశం పేరును ప్రస్తావిస్తూ వస్తుండగా.. ఒక దేశం పేరు చెప్పినప్పుడు మాత్రం ప్రవర్తనలో మార్పు రావడాన్ని గమనించానన్నారు. అప్పటివరకు మామూలుగా కూర్చున్న వ్యక్తి, వెంటనే నిటారుగా కూర్చొని వెనుక ఉన్న దిండును (కుషన్) తీసి గట్టిగా హత్తుకున్నట్టు వివరించారు. కొన్నేళ్ల తర్వాత అతను నిజంగానే ఆ దేశం కోసం గూఢచర్యం చేస్తున్నాడని తేలినట్టు స్పష్టం చేశారు.
వింత చేష్టలు..
అలానే మనుషులు ఒత్తిడికి గురైనప్పుడు చిత్రవిచిత్రంగా ప్రవర్తించడం తాను చూశానని మిచెల్ తెలిపారు. అయితే ప్రశ్నను దాటవేసినంత మాత్రాన వారు అబద్ధం చెబుతున్నారని నిర్ధారించలేమని, వారి సహజ ప్రవర్తనకు భిన్నంగా ఏదైనా మార్పు కనిపిస్తేనే అనుమానించాలని ఆమె స్పష్టం చేశారు.
చెప్పని మాటలను కూడా గమనించాలి..
ఇక అబద్ధాలను గుర్తించడంలో బాడీ లాంగ్వేజ్ ఎంత ముఖ్యమో, ఎదుటివారు ‘ఏం చెప్పకుండా వదిలేస్తున్నారు’ అనేది గమనించడం కూడా అంతే ముఖ్యమని మిచెల్ అంటున్నారు. డబుల్ ఏజెంట్ అనే అనుమానం ఉన్న ఒక వ్యక్తిని ఆమె ఏకంగా ఎనిమిది గంటలపాటు ప్రశ్నించారు. విచారణ ముగిశాక అతని నుంచి పెద్దగా ఉపయోగపడే సమాచారం ఏమీ దొరకలేదని ఆమె భావించారట. కానీ రెండు వారాల తర్వాత ఆ విచారణకు సంబంధించిన నోట్స్‌ను మళ్లీ పరిశీలించినప్పుడు ఆమెకు ఒక కీలక విషయం తట్టిందన్నారు. ఆ వ్యక్తి తాను ఏ ప్రభుత్వాన్ని అయితే వ్యతిరేకిస్తున్నానని చెప్పాడో.. ఆ 8 గంటల విచారణలో ఒక్కసారి కూడా ఆ ప్రభుత్వంపై విమర్శలు చేయలేదని గుర్తు చేసుకున్నారు.
