AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RCB Stampede: సీఐడీ దర్యాప్తులో షాకింగ్ నిజాలు.. ఆర్సీబీ విజయోత్సవంలో తొక్కిసలాటకు కారణం ఇదేనట

ఆర్సీబీ విజయోత్సవంలో జరిగిన తొక్కిసలాటకు విరాట్ కోహ్లీ కోసం తొందరపడటమే ప్రధాన కారణమని సీఐడీ దర్యాప్తులో తేలింది. ఆర్సీబీ సీఈఓ, మార్కెటింగ్ హెడ్ ఒత్తిడి, ఉచిత టికెట్ల ప్రకటన, పోలీసుల భద్రతా లోపాలు ఈ ఘటనకు దారి తీశాయి. దీని కారణంగానే ప్రాణాలు గాల్లో కలిశాయి.

RCB Stampede: సీఐడీ దర్యాప్తులో షాకింగ్ నిజాలు.. ఆర్సీబీ విజయోత్సవంలో తొక్కిసలాటకు కారణం ఇదేనట
Stampede
Rakesh
|

Updated on: Jul 08, 2025 | 3:35 PM

Share

RCB Stampede:రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన సంబరాల్లో జూన్ 4న చిన్నస్వామి స్టేడియం దగ్గర జరిగిన తొక్కిసలాట కేసును సీఐడీ పోలీసులు దర్యాప్తు చేశారు. ఈ దర్యాప్తులో చాలా విషయాలు వెల్లడయ్యాయి. వాటిని సీఐడీ నివేదికలో నమోదు చేసుకున్నారు. స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ కోసమే తొందరపడి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడమే ఈ ఘటనకు ప్రధాన కారణమని సీఐడీ విచారణలో తేలిందని సమాచారం. ఆర్సీబీ గెలిచిన మరుసటి రోజే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని ఆర్సీబీ సీఈఓ రాజేష్ మీనన్, మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సోసలే కర్ణాటక రాష్ట్ర క్రికెట్ కమిటీ పై ఒత్తిడి తెచ్చారు. ఈ ఇద్దరు వ్యక్తుల వల్లే తొందరపడి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని సీఐడీ సమాచారం సేకరించింది.

కార్యక్రమం ఆలస్యం చేస్తే విరాట్ కోహ్లీ రాడని, అందుకే జూన్ 4వ తేదీనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని కోహ్లీకి సన్నిహితుడైన నిఖిల్ సోసలే కర్ణాటక రాష్ట్ర క్రికెట్ కమిటీ పై ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. ఆర్సీబీ విజయోత్సవ కార్యక్రమాన్ని వాయిదా వేయాలని కర్ణాటక పోలీస్ డిపార్ట్‌మెంట్, కర్ణాటక రాష్ట్ర క్రికెట్ కమిటీ సలహా ఇచ్చాయి. కానీ, కార్యక్రమాన్ని వాయిదా వేస్తే కోహ్లీ రాలేడు. అతను బ్రిటన్‌కు వెళ్లాలని సోసలే ఒత్తిడి చేశాడట. ఆర్సీబీ విజయోత్సవానికి వచ్చేవారికి చిన్నస్వామి స్టేడియంలోకి ఉచిత టిక్కెట్లు ప్రకటించడం, టిక్కెట్ల గందరగోళం గురించి కూడా సీఐడీ సమాచారం సేకరించింది. అందుకే, కార్యక్రమం టైమ్‌లైన్ ప్రకారం సమాచారం సేకరించి సీఐడీ బృందం నివేదికను సిద్ధం చేస్తోంది.

సీఐడీ దర్యాప్తులో బయటపడిన కీలక విషయాలు ఈ కార్యక్రమానికి ఉచిత టికెట్లను ప్రకటించడంతో అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. దీనికి సంబంధించిన సమాచార లోపం, స్పష్టత లేకపోవడం తీవ్ర గందరగోళానికి దారితీసింది. ఈ ప్రోగ్రామ్ కు కల్పించిన భద్రతా ఏర్పాట్లు సరిపోలేదు. సరైన ప్రణాళిక లేకుండానే భద్రతను ఏర్పాటు చేసినట్లు సీఐడీ గుర్తించింది. తొక్కిసలాట జరిగిన సమయంలో చిన్నస్వామి స్టేడియం గేట్ల వద్ద పోలీసులు ఎవరూ లేరు. సరైన రోల్ కాల్ కూడా నిర్వహించలేదని తేలింది. అంటే, ఏ పోలీసు ఎక్కడ ఉండాలనే స్పష్టత లేదు.

పోలీస్ డిపార్ట్‌మెంట్ దృష్టి విధానసౌధంలో జరిగిన మరో కార్యక్రమంపైనే ఎక్కువగా ఉంది. చిన్నస్వామి స్టేడియం వద్ద జరగబోయే ఈ భారీ కార్యక్రమంపై సరైన శ్రద్ధ పెట్టలేదు. కేఎస్‌ఆర్‌పీ సిబ్బందికి కూడా కార్యక్రమం గురించి సరైన సమాచారం అందించలేదు. ఐపీఎల్ మ్యాచ్‌ల సమయంలో ఇచ్చే సాధారణ సమాచారం లాగానే ఇచ్చారు. కానీ ఉచిత టికెట్ల ప్రకటన కారణంగా ప్రజలు లక్షల సంఖ్యలో తరలివస్తారని అంచనా వేయడంలో విఫలమయ్యారు. ఈ విషయాలన్నింటినీ సీఐడీ తన దర్యాప్తు నివేదికలో పొందుపరుస్తోంది. త్వరలోనే ఈ నివేదికను సమర్పించి, ఈ తొక్కిసలాటకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం ఇక్కడ చేయండి..