AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RCB Record: ఐపీఎల్‌లో ఆర్‌సీబీ అరుదైన రికార్ట్.. చెన్నై5 ఏళ్ల రికార్డుకు ఇచ్చిపడేసేలా..!

Royal Challengers Bengaluru Rarest Record: లీగ్ దశలో 14 మ్యాచ్‌లలో 9 విజయాలు నమోదు చేసి, పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన బెంగళూరు క్వాలిఫైయర్-1 లోనూ అద్భుత విజయం సాధించింది. ఇప్పుడు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఫైనల్ పోరులో గుజరాత్ టైటాన్స్‌తో తలపడుతోంది.

RCB Record: ఐపీఎల్‌లో ఆర్‌సీబీ అరుదైన రికార్ట్.. చెన్నై5 ఏళ్ల రికార్డుకు ఇచ్చిపడేసేలా..!
Rcb Vs Gt
Venkata Chari
|

Updated on: May 31, 2026 | 8:09 PM

Share

ఐపీఎల్ 2026 ఫైనల్ పోరు మొదలైంది. టాస్ గెలిచిన ఆర్సీబీ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. గుజారత్ టీం 4 ఓవర్లలోపే 2 వికెట్లు కోల్పోయి పోరాడుతోంది. ఒకవైపు వరుసగా రెండోసారి ట్రోఫీని ముద్దాడి చరిత్ర సృష్టించాలని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తహతహలాడుతుంటే, మరోవైపు టైటిల్ పోరుకు ముందే ఆర్‌సీబీ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. అతి తక్కువ మంది ఆటగాళ్లతోనే సీజన్ మొత్తాన్ని నడిపించి చెన్నై సూపర్ కింగ్స్ రికార్డుకు బెంగళూరు సవాల్ విసిరింది.

స్థిరత్వానికి మారుపేరుగా బెంగళూరు కోర్ టీమ్..

మెగా వేలంలో భారీ వ్యయంతో సర్వసంగ్రామానికి సిద్ధమైన బెంగళూరు జట్టు, ఈ సీజన్‌లో అద్భుతమైన స్థిరత్వాన్ని ప్రదర్శించింది. రజత్ పాటిదార్ సారథ్యంలోని ఈ జట్టులో విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, టిమ్ డేవిడ్, వెంకటేష్ అయ్యర్ వంటి హేమాహేమీలు ఉన్నప్పటికీ, తుది జట్టులో పెద్దగా మార్పులు చేయాల్సిన అవసరం రాలేదు. సాధారణంగా గాయాలు, ఆటగాళ్ల ఫామ్ లేమి కారణంగా జట్లు ప్రయోగాలు చేస్తుంటాయి. కానీ ఆర్‌సీబీ మాత్రం తమ ప్రధాన ఆటగాళ్లపైనే నమ్మకముంచి విజయవంతంగా ఫైనల్ చేరింది. రూ.124.75 కోట్లతో 25 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసినప్పటికీ, కేవలం కొద్దిమందితోనే లీగ్ మొత్తాన్ని శాసించడం విశేషం.

విరాట్ కోహ్లీ అంకితభావం.. జట్టుకు కొండంత అండ

ఈ సీజన్ ఆర్‌సీబీ ప్రస్థానంలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా రూ.21 కోట్లకు రిటైన్ అయిన విరాట్ కోహ్లీ పాత్ర అమోఘం. లీగ్ దశ నుంచి ప్లేఆఫ్స్ వరకు ప్రతి మ్యాచ్ ఆడిన కోహ్లీ, జట్టు విజయాల్లో కీలక భూమిక పోషించాడు. ప్రారంభ మ్యాచ్‌లకు జోష్ హాజిల్‌వుడ్ దూరమైనప్పటికీ, అతడు తిరిగొచ్చిన తర్వాత బౌలింగ్ విభాగం మరింత పటిష్టంగా మారింది. జట్టు కోర్ బలంగా ఉండటంతో యాజమాన్యానికి తరచూ ఆటగాళ్లను మార్చాల్సిన తలనొప్పులు తప్పాయి.

ఐపీఎల్ చరిత్రలోనే అరుదైన జాబితాలో ఆర్‌సీబీ..

గణాంకాల ప్రకారం, ఈ సీజన్‌లో బెంగళూరు కేవలం 16 మంది ఆటగాళ్లను మాత్రమే మైదానంలోకి దించింది. ఐపీఎల్ చరిత్రలో ఒకే సీజన్‌లో అతి తక్కువ మంది ఆటగాళ్లను ఉపయోగించిన జట్ల జాబితాలో ఆర్‌సీబీ సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచింది.

2015లో చెన్నై సూపర్ కింగ్స్ కేవలం 14 మంది ఆటగాళ్లతోనే సీజన్ ముగించి అగ్రస్థానంలో ఉంది.

ముంబై ఇండియన్స్ 2018, 2020 సీజన్లలో 15 మంది ఆటగాళ్లను ఉపయోగించింది.

ఇప్పుడు 16 మంది ఆటగాళ్లతో 2018 కోల్‌కతా, 2021 చెన్నై సరసన బెంగళూరు చేరింది.

తుది జట్టులో అవకాశం దక్కని ఆటగాళ్లు వీరే!

ఒకవైపు కొందరు ఆటగాళ్లు స్థిరమైన ప్రదర్శనతో దూసుకుపోతుంటే, మరికొందరు మాత్రం వివిధ కారణాల వల్ల దూరం కావాల్సి వచ్చింది. శ్రీలంక క్రికెట్ బోర్డు నుంచి అనుమతి లభించకపోవడంతో నువాన్ తుషార, వ్యక్తిగత వివాదాలు చట్టపరమైన సమస్యల వల్ల యశ్ దయాల్ టోర్నీకి దూరమయ్యారు. వీరితో పాటు స్వప్నిల్ సింగ్, విక్కీ ఓస్త్వాల్, రిచర్డ్ గ్లీసన్, జోర్డాన్ కాక్స్ వంటి దాదాపు తొమ్మిది మంది ఆటగాళ్లకు ఈ సీజన్‌లో ఒక్క మ్యాచ్ ఆడే అవకాశం కూడా రాలేదు. అయినప్పటికీ బెంగళూరు ప్రదర్శన ఎక్కడా తగ్గలేదు.

లీగ్ దశలో 14 మ్యాచ్‌లలో 9 విజయాలు నమోదు చేసి, పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన బెంగళూరు క్వాలిఫైయర్-1 లోనూ అద్భుత విజయం సాధించింది. ఇప్పుడు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఫైనల్ పోరులో గుజరాత్ టైటాన్స్‌తో తలపడుతోంది. అటు అరుదైన రికార్డు, ఇటు వరుసగా రెండోసారి ఐపీఎల్ ట్రోఫీని గెలిచే సువర్ణావకాశం.. ఈ రెండింటితో బెంగళూరు అభిమానుల గుండెల్లో సరికొత్త ఆశలు రేకెత్తుతున్నాయి.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us