AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ranji Trophy: 12 ఇన్నింగ్స్‌లు.. 5 సెంచరీలు.. ప్రతిదీ 150 ప్లస్సే.. రంజీలో తగ్గేదేలే అంటోన్న ముంబై ప్లేయర్..

Ranji Trophy 2022: ముంబైకి చెందిన సర్ఫరాజ్ ఖాన్ రంజీ ట్రోఫీ 2022 లో మరోసారి సెంచరీ చేశాడు. ఒడిశాతో జరిగిన మ్యాచ్‌లో 165 పరుగులు చేశాడు. ఈ సీజన్‌లో ముంబై తరఫున సర్ఫరాజ్ ఖాన్‌కి ఇది రెండో సెంచరీ.

Ranji Trophy: 12 ఇన్నింగ్స్‌లు.. 5 సెంచరీలు.. ప్రతిదీ 150 ప్లస్సే.. రంజీలో తగ్గేదేలే అంటోన్న ముంబై ప్లేయర్..
Ranji Trophy Sarfaraz Khan
Venkata Chari
|

Updated on: Mar 05, 2022 | 3:14 PM

Share

ముంబైకి చెందిన సర్ఫరాజ్ ఖాన్(Sarfaraz Khan) రంజీ ట్రోఫీ 2022(Ranji Trophy 2022) లో మరోసారి సెంచరీ చేశాడు. ఒడిశాతో జరిగిన మ్యాచ్‌లో 165 పరుగులు చేశాడు. ఈ సీజన్‌లో ముంబై(Mumbai Cricket Team) తరఫున సర్ఫరాజ్ ఖాన్‌కి ఇది రెండో సెంచరీ. అతను 181 బంతుల్లో 15 ఫోర్లు, రెండు సిక్సర్ల సహాయంతో తన ఆరో ఫస్ట్ క్లాస్ సెంచరీని చేశాడు. అంతకుముందు ఇదే సీజన్‌లో సౌరాష్ట్రతో జరిగిన తొలి మ్యాచ్‌లో సర్ఫరాజ్ ఖాన్ 275 పరుగులు చేశాడు. అతను ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. వరుసగా రెండో రంజీ సీజన్‌లో అతని పరుగుల వర్షం కురుస్తోంది. 2019-20 రంజీ సీజన్‌లో కూడా ఈ బ్యాట్స్‌మెన్ భారీగా పరుగులు చేశాడు.

రంజీ ట్రోఫీ 2022లో సర్ఫరాజ్ ఖాన్ ఇప్పటివరకు మూడు మ్యాచ్‌ల నాలుగు ఇన్నింగ్స్‌లలో 164.33 సగటుతో 493 పరుగులు చేశాడు. అతని పేరు మీద రెండు సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీ ఉంది. గోవాతో జరిగిన రెండో మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్‌లో 48 పరుగులు అతని అత్యల్ప స్కోరుగా నిలిచింది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు అతను 275, 165, 63, 48 పరుగుల ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఈ సీజన్‌లో పరుగులు చేయడంలో రెండో స్థానంలో నిలిచాడు. 578 పరుగులు చేసిన అతని కంటే బీహార్‌కు చెందిన సకీబుల్ ఘనీ మాత్రమే ముందున్నాడు.

ఫస్ట్ క్లాస్‌లో సర్ఫరాజ్ ఖాన్‌కు అద్భుతమైన రికార్డు ఉంది. అతను ఇప్పటివరకు 32 ఫస్ట్ క్లాస్ ఇన్నింగ్స్‌లు ఆడాడు. వీటిలో 12 ఇన్నింగ్స్‌ల్లో అతను 50 ప్లస్ స్కోర్లు చేశాడు. ఆరు సెంచరీలు కూడా ఉన్నాయి. అతని ప్రతి సెంచరీ 150 ప్లస్ పైనే ఉండడం విశేషం. అతని పేరు మీద ఒక ట్రిపుల్, రెండు డబుల్ సెంచరీలు కూడా ఉన్నాయి. అతను 2019 సంవత్సరం నుంచి రంజీ ట్రోఫీలో నమ్మశక్యం కాని రికార్డును కలిగి ఉన్నాడు. ఈ సమయంలో, సర్ఫరాజ్ ఖాన్ 12 ఇన్నింగ్స్‌లలో 176.62 సగటుతో 1413 పరుగులు చేశాడు. ఆ ప్లేయర్ స్కోర్లు ఇలా ఉన్నాయి- 71 నాటౌట్, 36, 301 నాటౌట్, 226 నాటౌట్, 25, 78, 177, 6, 275, 63, 48, 165.

24 ఏళ్ల సర్ఫరాజ్ ఖాన్ 2019-20 రంజీ సీజన్ నుంచి మళ్లీ ముంబై తరఫున ఆడడం ప్రారంభించాడు. మధ్యలో అవకాశాల కోసం యూపీ తరఫున ఆడడం మొదలుపెట్టాడు. కానీ, పెద్దగా విజయం సాధించలేదు. ముంబైలో తిరిగి చేరిన తర్వాత వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. ఇప్పుడు రెండేళ్ల విరామం తర్వాత మళ్లీ రంజీ ట్రోఫీ జరిగినా, అతని పరుగులు ఆగడం లేదు. అతను పరుగులు చేస్తున్న తీరు భారత టెస్టు జట్టులో చోటు కోసం బలమైన వాదనను వినిపిస్తోంది.

Also Read: IND vs SL: రోహిత్ శర్మకు షాకిచ్చిన రిషబ్ పంత్.. ఆ స్పెషల్ రికార్డులో చేరిన టీమిండియా కీపర్

Women’s World Cup 2022: 9 టోర్నీలు.. 2 ఫైనల్స్.. మహిళల ప్రపంచకప్‌లో టీమిండియా ప్రదర్శన ఎలా ఉందంటే?