Women’s World Cup : పాకిస్తాన్‌కు దెబ్బ మీద దెబ్బ.. బంగ్లాదేశ్ చేతిలో ఘోర పరాజయం
ఆసియా కప్ 2025లో పురుషుల జట్టుకు ఎదురైన పరాభవాలు మరచిపోకముందే, ఇప్పుడు మహిళల ప్రపంచ కప్ 2025లో కూడా పాకిస్తాన్ క్రికెట్‌కు మరోసారి చేదు అనుభవం ఎదురైంది. ఐసీసీ మహిళల ప్రపంచ కప్ 2025లో భాగంగా తమ మొదటి మ్యాచ్‌లోనే పాకిస్తాన్ మహిళల జట్టు, బంగ్లాదేశ్ చేతిలో 7 వికెట్ల తేడాతో ఘోర పరాజయం పాలైంది.

Women’s World Cup : ఆసియా కప్ 2025లో పాకిస్తాన్ పురుషుల జట్టుకు ఎదురైన అవమానాలు చాలవన్నట్లు, ఇప్పుడు మహిళల ప్రపంచ కప్ 2025లో కూడా పాకిస్తాన్ మహిళల జట్టుకు పరాభవం ఎదురైంది. భారత్, శ్రీలంకలో జరుగుతున్న ఐసీసీ మహిళల ప్రపంచ కప్ 2025లో భాగంగా, తమ మొదటి మ్యాచ్‌లోనే బంగ్లాదేశ్ చేతిలో పాకిస్తాన్ జట్టు ఘోర పరాజయం పాలైంది. కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్, పాకిస్తాన్‌ను కేవలం 129 పరుగులకే కట్టడి చేసింది. ఆపై 32 ఓవర్లలోనే లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించి, 7 వికెట్ల తేడాతో విజయం సాధించి ప్రపంచ కప్‌లో శుభారంభం చేసింది.
ప్రపంచ కప్‌లో తమ అన్ని మ్యాచ్‌లను శ్రీలంకలో ఆడనున్న పాకిస్తాన్ జట్టుకు ఆరంభం అస్సలు బాగాలేదు. అక్టోబర్ 2న జరిగిన ఈ మ్యాచ్‌లో, ఫాతిమా సనా సారథ్యంలోని పాకిస్తాన్ జట్టు మొదట బ్యాటింగ్ చేసింది. అయితే, ఇన్నింగ్స్ మొదటి ఓవర్లోనే వారి పతనం మొదలైంది. బంగ్లాదేశ్ పేసర్ మారుఫా అక్తర్ మొదటి ఓవర్ చివరి రెండు బంతులకు వరుసగా రెండు పాకిస్తాన్ బ్యాట్స్‌మెన్‌లను బౌల్డ్ చేసింది. దీంతో పాకిస్తాన్ స్కోరు 2 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి తీవ్ర ఒత్తిడిలోకి వెళ్లింది.
మునీబా అలీ, రమీన్ షమీమ్ మధ్య 42 పరుగుల మంచి భాగస్వామ్యం లభించినప్పటికీ, తర్వాతి రెండు ఓవర్లలో నహీదా అక్తర్ వీరిద్దరినీ పెవిలియన్ చేర్చింది. 50 పరుగుల లోపే 4 వికెట్లు కోల్పోయిన పాకిస్తాన్, ఆ తర్వాత 67 పరుగులకే సగం జట్టును కోల్పోయింది. కెప్టెన్ ఫాతిమా సనా, ఆలియా రియాజ్, డయానా బేగ్ కొంత మేరకు పరుగులు చేసి జట్టును 100 దాటించినప్పటికీ, మొత్తం జట్టు 38.3 ఓవర్లలో కేవలం 129 పరుగులకే ఆలౌట్ అయ్యింది. బంగ్లాదేశ్ తరపున మారుఫా, నహీదా అక్తర్‌లతో పాటు షోర్నా అక్తర్ అత్యధికంగా 3 వికెట్లు పడగొట్టింది.
130 పరుగుల లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ ఆరంభం కూడా అనుకున్నంత బాగా లేదు. నాల్గవ ఓవర్లోనే ఓపెనర్ ఫర్గానా హోక్ అవుట్ అయ్యింది. ఆ తర్వాత 12వ ఓవర్‌లో షర్మీన్ అక్తర్ కూడా పెవిలియన్ చేరడంతో, 35 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి బంగ్లాదేశ్ కూడా కొంత ఒత్తిడికి లోనైంది. అయితే, ఓపెనర్ రుబియా హైదర్, కెప్టెన్ నిగర్ సుల్తానాతో కలిసి 62 పరుగుల అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పి పాకిస్తాన్ విజయ ఆశలను గల్లంతు చేసింది. రుబియా త్వరగానే తన అర్ధశతకాన్ని పూర్తి చేసుకుని, షోభనా మోస్తారితో కలిసి 32వ ఓవర్‌లోనే జట్టును విజయ తీరాలకు చేర్చింది. రుబియా 54 పరుగులతో, సోభనా 24 పరుగులతో నాటౌట్‌గా నిలిచి బంగ్లాదేశ్‌కు 7 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందించారు. మొత్తంగా, ప్రపంచ కప్ మొదటి మ్యాచ్‌లోనే పాకిస్తాన్ మహిళల జట్టుకు చేదు అనుభవం ఎదురైంది. ఈ ఓటమితో పాకిస్తాన్ క్రికెట్‌పై ఒత్తిడి మరింత పెరిగింది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




