AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakistan : వరల్డ్ కప్‌లో పాకిస్తాన్ దిగ్గజం ఆజాద్ కాశ్మీర్ వ్యాఖ్య.. ఛీ వీళ్లు మారరంటూ చీదరించుకుంటున్న ఫ్యాన్స్

మహిళల వన్డే ప్రపంచ కప్ 2025లో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. పాకిస్తాన్ మహిళల క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సనా మీర్ కామెంటరీ సందర్భంగా ఆజాద్ కాశ్మీర్ అనే పదాన్ని ఉపయోగించి పెద్ద దుమారాన్ని రేపింది. ఈ ఘటన గురువారం జరిగిన పాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్‌లో చోటు చేసుకుంది.

Pakistan : వరల్డ్ కప్‌లో పాకిస్తాన్ దిగ్గజం ఆజాద్ కాశ్మీర్ వ్యాఖ్య.. ఛీ వీళ్లు మారరంటూ చీదరించుకుంటున్న ఫ్యాన్స్
Azad Kashmir Comment
Rakesh
|

Updated on: Oct 03, 2025 | 7:39 AM

Share

Pakistan : మహిళల వన్డే ప్రపంచ కప్ 2025లో ఒక కొత్త వివాదం తెరపైకి వచ్చింది. పాకిస్తాన్ మహిళల క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సనా మీర్ కామెంటరీ సందర్భంగా ఆజాద్ కాశ్మీర్ అనే పదాన్ని ఉపయోగించి పెద్ద దుమారాన్ని రేపింది. ఈ వివాదాస్పద ఘటన గురువారం జరిగిన పాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్‌లో చోటు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ జట్టు మొదట బ్యాటింగ్ చేసి కేవలం 128 పరుగులకే ఆలౌట్ అయ్యింది. సనా మీర్ వ్యాఖ్యలపై భారతీయ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆమెను తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు.

పాకిస్తాన్-బంగ్లాదేశ్ మ్యాచ్ సందర్భంగా, నతాలియా పర్వేజ్ అనే పాకిస్తాన్ క్రీడాకారిణి నేపథ్యం గురించి కామెంటరీ ప్యానల్ చర్చిస్తున్నప్పుడు, సనా మీర్ మాట్లాడుతూ పర్వేజ్ ఆజాద్ కాశ్మీర్ నుండి వస్తుందని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై భారతీయ అభిమానులు తీవ్రంగా మండిపడ్డారు. జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం అని, అయినప్పటికీ పాకిస్తాన్ దశాబ్దాలుగా దానిపై తన దావాను కొనసాగిస్తూ వస్తోందని గుర్తు చేశారు. సనా మీర్ లాంటి ఒక ప్రముఖ క్రీడాకారిణి, కామెంటరీ వంటి అంతర్జాతీయ వేదికపై ఇలాంటి రాజకీయ సున్నితమైన వ్యాఖ్యలు చేయడం తగదని భారత అభిమానులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శిస్తున్నారు.

భారత్, పాకిస్తాన్ మధ్య ఉన్న రాజకీయ సంబంధాలను దృష్టిలో ఉంచుకుంటే, సనా మీర్ ఆజాద్ కాశ్మీర్ అని కామెంటరీలో అనడం ఒక పెద్ద వివాదానికి దారితీయవచ్చు. ఎందుకంటే ఆసియా కప్ 2025 ట్రోఫీ వివాదం ఇంకా పూర్తిగా సద్దుమణగలేదు. ఆసియా కప్ 2025లో భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన 3 మ్యాచ్‌లలో భారత జట్టు పాక్ ఆటగాళ్లతో షేక్ హ్యాండ్ చేయలేదు. అంతేకాకుండా, ఫైనల్ గెలిచిన తర్వాత టీమ్ ఇండియా, పీసీబీ ఛైర్మన్, ఏసీసీ ప్రెసిడెంట్ అయిన మోహసిన్ నక్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోవడానికి నిరాకరించింది. ఈ ట్రోఫీ వివాదం ఇప్పటికీ కొనసాగుతుండగానే, సనా మీర్ వ్యాఖ్యలు కొత్త రచ్చకు దారి తీశాయి.

పాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ ప్రపంచ కప్ మ్యాచ్‌లో ఆజాద్ కాశ్మీర్ ప్రస్తావన చేసిన సనా మీర్, తాను చెప్పిన ఆ రెండు పదాలు ఇంత పెద్ద వివాదానికి దారితీస్తాయని బహుశా ఊహించి ఉండరు. అయితే, సోషల్ మీడియాలో భారతీయ అభిమానులు ఆమెను ఏమాత్రం వదిలిపెట్టే మూడ్‌లో కనిపించడం లేదు. ఒక భారతీయ అభిమాని స్పందిస్తూ, సనా మీర్‌ను వెంటనే కామెంటరీ ప్యానల్ నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. మరికొందరు అభిమానులు ఆమె వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఈ వివాదం ప్రపంచ కప్‌లో పాకిస్తాన్ జట్టు పరాభవంతో పాటు, దేశ ప్రతిష్టను కూడా దెబ్బతీసే అవకాశం ఉంది.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి