Sana Mir : ఆజాదీ కాశ్మీర్ వ్యాఖ్యతో రచ్చ.. పాకిస్తాన్ కామెంటేటర్ పై లైఫ్ టైం బ్యాన్ ?
మహిళల క్రికెట్ ప్రపంచ కప్లో మరో కొత్త వివాదం చోటు చేసుకుంది. రాబోయే ఆదివారం భారత్, పాకిస్తాన్ మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. అంతకు ముందు గురువారం కొలంబోలో జరిగిన బంగ్లాదేశ్, పాకిస్తాన్ మ్యాచ్‌లో పాక్ మాజీ కెప్టెన్ సనా మీర్ కామెంటరీ సందర్భంగా ఆజాద్ కాశ్మీర్ అనే పదాన్ని ఉపయోగించి పెద్ద దుమారాన్ని రేపింది.

Sana Mir : మహిళల క్రికెట్ ప్రపంచ కప్లో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. వచ్చే ఆదివారం భారత్, పాకిస్తాన్ మధ్య కీలకమైన మ్యాచ్ జరగనుంది. అంతకుముందు గురువారం కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో జరిగిన బంగ్లాదేశ్ – పాకిస్తాన్ మ్యాచ్‌లో ఒక ఊహించని సంఘటన చోటు చేసుకుంది. పాకిస్తాన్ మహిళల జట్టు మాజీ కెప్టెన్ సనా మీర్ కామెంటరీ సందర్భంగా ఆజాద్ కాశ్మీర్ అనే వివాదాస్పద పదాన్ని ఉపయోగించి పెద్ద దుమారాన్ని రేపింది. ఐసీసీ నిబంధనల ప్రకారం, క్రీడల్లో రాజకీయాలను కలపడం కఠినంగా నిషేధించబడింది. ఈ నేపథ్యంలో సనా మీర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని, ఆమెను కామెంటరీ ప్యానల్ నుంచి నిషేధించాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.
పాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్‌లో కామెంటరీ చేస్తుండగా, సనా మీర్ పాకిస్తాన్ క్రికెటర్ నటాలియా పర్వేజ్ గురించి మాట్లాడుతూ, ఆమె ఆజాద్ కాశ్మీర్ నుండి వచ్చిందని పేర్కొన్నారు. పాకిస్తాన్, కాశ్మీర్ లోని ఒక భాగాన్ని పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) అని అంతర్జాతీయంగా పిలుస్తున్నప్పటికీ, దానిని రాజకీయ కారణాల కోసం ఆజాద్ కాశ్మీర్ అని పిలుస్తుంది. కానీ వాస్తవానికి, PoK లోని ప్రజల జీవితాలు నరకంలా మారాయని, వారు నిరంతరం పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్నారని తెలిసిన విషయమే.
సనా మీర్ చేసిన ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. చాలా మంది నెటిజన్లు, కామెంటరీ వంటి క్రీడా వేదికపై ఆజాద్ కాశ్మీర్ వంటి రాజకీయ పదాలను ఉపయోగించడం ఐసీసీ నిబంధనలకు విరుద్ధమని అంటున్నారు. ఆమె క్రీడల్లో రాజకీయ అంశాలను తీసుకొచ్చిందని, అందుకే ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కొందరు అయితే ఆమెను జీవితకాలం కామెంటరీ నుండి నిషేధించాలని కూడా కోరుతున్నారు.
సనా మీర్ వ్యాఖ్యలపై ఐసీసీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి. ఆమె తన వ్యాఖ్యలపై వివరణ ఇస్తుందా లేదా తన అభిప్రాయానికే కట్టుబడి ఉంటుందా అనేది కూడా ఆసక్తికరంగా మారింది. పురుషుల ఆసియా కప్ వివాదం ఇంకా సద్దుమణగకముందే, ఇప్పుడు మహిళల క్రికెట్‌లోనూ భారత్-పాక్ మ్యాచ్ ముందు ఈ కొత్త వివాదం తెరపైకి వచ్చింది. పురుషుల ఏషియా కప్ సమయంలో భారత ఆటగాళ్లు పాకిస్తాన్ ఆటగాళ్లతో హ్యాండ్ షేక్ చేయలేదు. అంతేకాదు, పీసీబీ చీఫ్ మోహసిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోవడానికి నిరాకరించారు. దీనికి బదులుగా, నఖ్వీ భారత జట్టు గెలిచిన ట్రోఫీని తనతో తీసుకెళ్లారనే ఆరోపణలు కూడా వచ్చాయి.
What the hell is “Azaad Kashmir” @ICC @BCCI ?
You must take a stern action against this Pakistani commentator and send her back packing from India @JayShah @MithunManhas !! pic.twitter.com/CmeiqQmzGj
— Yo Yo Funny Singh (@moronhumor) October 2, 2025
ఇప్పుడు మహిళల ప్రపంచ కప్‌లో అక్టోబర్ 5న జరగనున్న భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌లో భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ పాకిస్తాన్ కెప్టెన్‌తో టాస్ సమయంలో షేక్ హ్యాండ్ చేస్తుందా లేదా అనేది అందరి దృష్టిని ఆకర్షించనుంది. ఈ రాజకీయ వ్యాఖ్యల నేపథ్యంలో మ్యాచ్ మరింత ఉత్కంఠగా మారే అవకాశం ఉంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




