
Dipendra Singh Airee: నేపాల్ బ్యాట్స్‌మెన్ దీపేంద్ర సింగ్ ఐరీ టీ20 క్రికెట్‌లో మరోసారి విధ్వంసం సృష్టించాడు. ఖతార్‌తో జరిగిన ఏసీసీ పురుషుల ప్రీమియర్ కప్‌లో ఒకే ఓవర్‌లో వరుసగా ఆరు సిక్సర్లు కొట్టిన ఘనత సాధించాడు. కమ్రాన్ ఖాన్ ఓవర్‌లో దీపేంద్ర ఈ అద్భుతం చేశాడు. అంతర్జాతీయ టీ20లో ఒక ఓవర్‌లో వరుసగా ఆరు సిక్సర్లు బాదిన మూడో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. అతని కంటే ముందు భారత ఆటగాడు యువరాజ్ సింగ్ (2007), కీరన్ పొలార్డ్ (2021) ఈ పని చేశారు. దీపేంద్ర 21 బంతుల్లో ఏడు సిక్సర్లు, మూడు ఫోర్లతో 64 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. దీంతో నేపాల్ ఏడు వికెట్లకు 210 పరుగులు చేసింది.
16వ ఓవర్లో దీపేంద్ర బ్యాటింగ్‌కు వచ్చాడు. ఒకానొక సమయంలో అతను 11 బంతుల్లో 16 పరుగులు చేసి ఆడుతున్నాడు. కానీ, తన చివరి 10 బంతుల్లో 48 పరుగులు చేసి అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 19వ ఓవర్ తొలి బంతికి సిక్సర్ తో పరుగుల వరద పారించాడు. ఆ తర్వాత ఫోర్ కొట్టాడు. తర్వాత రెండు బంతుల్లో లెగ్ బై నుంచి రెండు పరుగులు, ఒక పరుగు వచ్చాయి. దీపేంద్ర 20వ ఓవర్‌లో స్ట్రైక్ కొట్టి కమ్రాన్ ఖాన్ వేసిన ఆరు బంతుల్లో సిక్సర్లు కొట్టి చరిత్ర సృష్టించాడు.
దీపేంద్ర గతేడాది ఆసియా గేమ్స్ 2023లో కూడా తన బ్యాటింగ్ నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. ఆ తర్వాత మంగోలియాపై కేవలం తొమ్మిది బంతుల్లోనే యాభై పరుగులు చేశాడు. అంతర్జాతీయ టీ20ల్లో ఇదే వేగవంతమైన అర్ధశతకంగా మారింది. దీని ద్వారా యువరాజ్ రికార్డును దీపేంద్ర బ్రేక్ చేశాడు. 2007 ప్రపంచకప్ సమయంలో, యువీ 12 బంతుల్లో వరుసగా ఆరు సిక్సర్లు కొట్టి హాఫ్ సెంచరీ సాధించాడు.
𝗨𝗡𝗥𝗘𝗔𝗟 😵💫#NEPvQAT #ACCMensPremierCup #ACC pic.twitter.com/72Itd5INE1
— AsianCricketCouncil (@ACCMedia1) April 13, 2024
కాగా, టీ20 ఇంటర్నేషనల్‌లో దీపేంద్ర రెండోసారి వరుసగా ఆరు సిక్సర్లు బాదాడు. అతను మంగోలియాతో జరిగిన మ్యాచ్‌లో ఇలా వరుస సిక్సులు బాదేశాడు. అయితే రెండు ఓవర్లలో ఆరు సిక్సర్లు వచ్చాయి. ఆ సమయంలో ఒక ఓవర్‌లో ఐదు సిక్సర్లు, తర్వాతి ఓవర్‌లో ఆరో సిక్సర్ బాదాడు. ఆ మ్యాచ్‌లో అతను 10 బంతుల్లో అజేయంగా 52 పరుగులు చేశాడు. అప్పుడు నేపాల్ స్కోరు 314 పరుగులుగా నిలిచింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..