IPL Records : ఒకే ఇన్నింగ్స్‌లో 11 సిక్సర్లు.. చెన్నై గడ్డపై తను సృష్టించిన సునామీ 14 ఏళ్లయినా చెక్కు చెదరలేదు
IPL Records : ఐపీఎల్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో 11 సిక్సర్లు బాదిన మురళీ విజయ్ రికార్డును 14 ఏళ్ల తర్వాత వైభవ్ సూర్యవంశీ సమం చేశాడు. ఈ రికార్డును బద్దలు కొట్టడం భారత ఆటగాళ్లకు ఇంకా సవాల్‌గానే ఉంది.ఆ ఒక్క సిక్సర్ అదనంగా బాది 12 మార్కును చేరుకోవడం భారత బ్యాటర్లకు ఇప్పటికీ ఓ కలే.

IPL Records : ఐపీఎల్ అనగానే మనకు టక్కున గుర్తొచ్చేది సిక్సర్ల సునామీ. అయితే ఈ సిక్సర్ల రికార్డుల్లో ఒక భారతీయుడి రికార్డు మాత్రం గత 14 ఏళ్లుగా చెక్కుచెదరకుండా ఉంది. అది మరెవరో కాదు, చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ఓపెనర్ మురళీ విజయ్. ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన భారతీయుడిగా ఆయన సృష్టించిన రికార్డు నేటికీ ఒక సవాల్‌గానే నిలిచింది.
అది ఏప్రిల్ 3, 2010.. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మురళీ విజయ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. కేవలం 56 బంతుల్లో 127 పరుగులు చేసిన ఆయన, ఆ ఇన్నింగ్స్‌లో ఏకంగా 11 సిక్సర్లు బాదారు. ఆ సమయంలో అది ఒక సంచలనం. విజయ్ విధ్వంసంతో చెన్నై సూపర్ కింగ్స్ 246 పరుగుల భారీ స్కోరు సాధించింది. అప్పటి నుండి ఇప్పటివరకు ఎందరో హేమాహేమీలు వచ్చినా, ఈ 11 సిక్సర్ల రికార్డును ఏ భారతీయుడూ అధిగమించలేకపోయారు.
దాదాపు 14 ఏళ్ల పాటు ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్న ఈ రికార్డును ఐపీఎల్ 2025లో ఒక 14 ఏళ్ల కుర్రాడు టచ్ చేశాడు. రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ, గుజరాత్ టైటాన్స్‌పై జరిగిన మ్యాచ్‌లో కేవలం 38 బంతుల్లో 101 పరుగులు చేశాడు. ఈ మెరుపు ఇన్నింగ్స్‌లో వైభవ్ కూడా 11 సిక్సర్లు బాది మురళీ విజయ్ రికార్డును సమం చేశాడు. అతి చిన్న వయసులోనే ఈ ఘనత సాధించి క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. అయితే రికార్డు సమమైంది కానీ, ఇంకా బద్దలు కాలేదు.
ఐపీఎల్‌లో క్రిస్ గేల్ (17 సిక్సర్లు), బ్రెండన్ మెకల్లమ్ (13 సిక్సర్లు) వంటి విదేశీ ఆటగాళ్లు ఒకే ఇన్నింగ్స్‌లో ఎక్కువ సిక్సర్లు బాదినప్పటికీ, భారతీయులలో మాత్రం 11 అనేది ఒక లక్కీ నంబర్‌గా మారిపోయింది. సంజు శామ్సన్ (2018లో 10 సిక్సర్లు), శుభ్‌మన్ గిల్ (2023లో 10 సిక్సర్లు), అభిషేక్ శర్మ (2025లో 10 సిక్సర్లు) ఈ రికార్డుకు అత్యంత సమీపంలోకి వచ్చి ఆగిపోయారు. ఆ ఒక్క సిక్సర్ అదనంగా బాది 12 మార్కును చేరుకోవడం భారత బ్యాటర్లకు ఒక కలగానే మిగిలిపోయింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
