MS Dhoni: ఐపీఎల్ 2027లో ధోనీ ఆడతాడా? సన్నిహితుడి వద్ద మనసులో మాట బటయపెట్టిన మహీ
MS Dhoni: ఐపీఎల్ 2027లో మహేంద్ర సింగ్ ధోనీ ఆడతారా అనే ఆసక్తి కొనసాగుతోంది. మాజీ సహచరుడు ఎస్. బద్రీనాథ్ ప్రకారం, ఇంపాక్ట్ ప్లేయర్‌గా కేవలం బ్యాటింగ్ చేయడం ధోనీకి ఇష్టం లేదు. పూర్తి స్థాయి వికెట్ కీపర్‌గా మాత్రమే ఆడాలని ఆయన భావిస్తున్నట్లు బద్రీనాథ్ వెల్లడించారు. దీంతో మహీ భవిష్యత్తుపై ఉత్కంఠ నెలకొంది.

MS Dhoni: చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్ 2027లో ఆడతారా లేదా అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఒకవేళ ఆయన బరిలోకి దిగితే ఏ పాత్రలో కనిపిస్తారనే అంశంపై మాజీ సహచరుడు ఎస్.బద్రీనాథ్ అత్యంత ఆసక్తికరమైన నిజాలను బయటపెట్టారు. 45 ఏళ్ల వయసులో మోకాలు గాయం కారణంగా ఐపీఎల్ 2026 సీజన్‌కు దూరమైన ధోనీ ఐపీఎల్ రిటైర్మెంట్‌పై గత కొన్నేళ్లుగా తీవ్ర చర్చ నడుస్తోంది. వచ్చే సీజన్ నాటికి ఆయన మళ్లీ మైదానంలోకి వస్తారా అనే సందేహాలు అందరిలోనూ ఉన్నాయి. ఇలాంటి సమయంలో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ఆటగాడు ఎస్.బద్రీనాథ్ తన యూట్యూబ్ ఛానెల్‌లో ధోనీ భవిష్యత్తుపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ధోనీతో తనకు జరిగిన వ్యక్తిగత సంభాషణను ఆయన అభిమానులతో పంచుకున్నారు.
కేవలం బ్యాటింగ్ మాత్రమే చేయడానికి ఇంపాక్ట్ ప్లేయర్‌గా మైదానంలోకి రావడం ధోనీకి ఎంతమాత్రం ఇష్టం లేదని బద్రీనాథ్ స్పష్టం చేశారు. “ధోనీ నాతో పర్సనల్ గా మాట్లాడారు. తాను ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడనని తేల్చిచెప్పారు. జట్టులో ఉంటే పూర్తి స్థాయి వికెట్ కీపర్ ఆటగాడిగానే ఉంటానని అన్నారు. అంటే మైదానంలో పూర్తి 20 ఓవర్లు ఉండి వికెట్ కీపింగ్ బాధ్యతలు నిర్వర్తించడానికి మాత్రమే ఆయన మొగ్గు చూపుతున్నారు” అని బద్రీనాథ్ వెల్లడించారు.
ధోనీ పూర్తి స్థాయి ఆటగాడిగా బరిలోకి దిగడంపై బద్రీనాథ్ తన విశ్లేషణను కూడా జోడించారు. వయసు రీత్యా ధోనీ శరీరం 20 ఓవర్ల పాటు సుదీర్ఘంగా సహకరించడం కష్టమని హెడ్ కోచ్ స్టెఫాన్ ఫ్లెమింగ్ కూడా గతంలో పేర్కొన్నారు. 16వ ఓవర్ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చి, వికెట్ కీపింగ్ మాత్రమే చేసే పరిస్థితుల్లో ఆయన ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడటమే సీఎస్కేకు వ్యూహాత్మకంగా ప్రయోజనకరంగా ఉంటుందని బద్రీనాథ్ అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ ధోనీ మాత్రం అరకొర బాధ్యతలతో ఆడటానికి సిద్ధంగా లేరని తేలిపోయింది.
ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన నాయకుడిగా నిలిచిన ధోనీ ఇప్పటివరకు 278 మ్యాచ్‌లు ఆడారు. అందులో 242 ఇన్నింగ్స్‌లలో బ్యాటింగ్ చేస్తూ 38.30 సగటు, 137.45 స్ట్రైక్ రేట్‌తో 5,439 పరుగులు సాధించారు. ఇందులో 24 అర్ధశతకాలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 84 పరుగులుగా నమోదైంది. చెన్నై జట్టును ఐదుసార్లు విజేతగా నిలిపిన రికార్డు ఆయన సొంతం.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
