AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mohsin Naqvi: ఆ విమర్శలు చూసి తట్టుకోలేక భారత్ పేరు లాగిన పీసీబీ చీఫ్.. పాక్ క్రికెట్‌లో మళ్లీ రచ్చ

Pakistan Cricket: పాక్ క్రికెట్లో లార్డ్స్ టెస్టు ఓటమి తర్వాత పీసీబీ చీఫ్ మొహ్సిన్ నఖ్వీపై విమర్శలు వెల్లువెత్తాయి. తన నిర్ణయాలను సమర్థించుకునేందుకు టీమిండియా, సౌతాఫ్రికా ఓటములను ఉదాహరణగా ప్రస్తావించారు. పాకిస్తాన్ ర్యాంకింగ్స్ మెరుగయ్యాయని చెప్పిన ఆయన, వసీం అక్రమ్ వంటి దిగ్గజాల సలహాలను మాత్రమే పరిగణిస్తానంటూ చేసిన వ్యాఖ్యలు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

Mohsin Naqvi: ఆ విమర్శలు చూసి తట్టుకోలేక భారత్ పేరు లాగిన పీసీబీ చీఫ్.. పాక్ క్రికెట్‌లో మళ్లీ రచ్చ
Mohsin Naqvi
Rakesh
|

Updated on: Sep 03, 2026 | 4:01 PM

Share

Mohsin Naqvi: ఇంగ్లాండ్‌తో జరిగిన లార్డ్స్ టెస్టులో ఘోర ఓటమి పాలైన తర్వాత పాకిస్తాన్ క్రికెట్‌లో తీవ్ర అలజడి రేగింది. పీసీబీ చీఫ్ మొహ్సిన్ నఖ్వీ తీసుకున్న నిర్ణయాలపై మాజీ ఆటగాళ్లు విరుచుకుపడటంతో, తనను తాను రక్షించుకోవడానికి ఆయన ఏకంగా టీమిండియా పేరును తెరపైకి తెచ్చి కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు. ఇంగ్లాండ్‌లో జరిగిన లార్డ్స్ టెస్టు మ్యాచ్‌లో పాకిస్తాన్ ఎదుర్కొన్న దారుణ పరాభవం ఆ దేశంలో పెద్ద దుమారమే రేపింది. ఈ ఫలితం తర్వాత పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఏకంగా ఏడుగురు కీలక ఆటగాళ్లను ఇంగ్లాండ్ పర్యటన నుంచి స్వదేశానికి తిప్పి పంపించింది. వారి స్థానంలో కొత్త ముఖాలకు అవకాశం కల్పించింది. అంతేకాక టెస్టు జట్టు హెడ్ కోచ్ సర్ఫరాజ్ అహ్మద్, బౌలింగ్ కోచ్ ఉమర్ గుల్‌పై ఉన్నపలంగా వేటు వేసింది. పీసీబీ తీసుకున్న ఈ హడావుడి నిర్ణయాలు పాక్ క్రికెట్ వర్గాల్లో తీవ్ర ఆగ్రహానికి దారితీశాయి.

నఖ్వీ వైఖరిపై విమర్శల వర్షం

జట్టును నిలబెట్టాల్సింది పోయి నిర్ణయాలతో మరింత నాశనం చేస్తున్నారంటూ అభిమానులు, మాజీ క్రీడాకారులు పీసీబీ అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీపై విమర్శల బాణాలు సంధించారు. ఈ దాడి తీవ్రత పెరగడంతో నఖ్వీ ఒక టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో తీవ్రంగా స్పందించారు. తాను విమర్శలకు భయపడే వ్యక్తిని కాదని తెగేసి చెప్పారు. పాకిస్తాన్ క్రికెట్ తన హయాంలోనే నాశనమైందని భావించేవారు ముందుగా ఐసీసీ ర్యాంకింగ్స్ తీసి చూడాలని ఘాటుగా సూచించారు.

భారత్ పేరు తెస్తూ కవర్

తన నిర్ణయాలను సమర్థించుకునే క్రమంలో నఖ్వీ భారత క్రికెట్ జట్టు ఉదాహరణను తెరపైకి తెచ్చారు. సౌతాఫ్రికా జట్టు నమీబియా చేతిలో, అలాగే భారత జట్టు ఐర్లాండ్ చేతిలో ఓడిపోయిన సందర్భాలను గుర్తుచేశారు. అలా ఓడిపోయినంత మాత్రాన ఆ దేశాల్లో క్రికెట్ ఖతమైపోయిందా అని ప్రశ్నించారు. ఏ జట్టు కూడా రాత్రికి రాత్రే ఛాంపియన్‌గా మారదని స్పష్టం చేశారు. తన హయాంలో పాకిస్తాన్ టీ20 ర్యాంకింగ్స్ తొమ్మిదో స్థానం నుంచి ఆరో స్థానానికి, వన్డే ర్యాంకింగ్స్ ఎనిమిదో స్థానం నుంచి ఐదో స్థానానికి మెరుగయ్యాయని గణాంకాలు వివరించారు.

ఆయన స్థాయి ఉంటేనే మాట్లాడండి

విమర్శలు చేసేవారికి కనీస స్థాయి ఉండాలని నఖ్వీ వ్యాఖ్యానించారు. క్రికెట్ విషయాల్లో వసీం అక్రమ్ లాంటి దిగ్గజాలు సలహాలు ఇస్తే వినడానికి తాను సిద్ధంగా ఉన్నానని, అంతకంటే తక్కువ స్థాయి ఉన్నవారి విమర్శలను తాను పట్టించుకోనని కొట్టిపారేశారు. మైదానంలో ఆటగాళ్ల ప్రదర్శన ఆధారంగానే మార్పులు చేశామని, క్రికెట్ ప్రయోజనాల కోసమే నిర్ణయాలు తీసుకున్నట్లు సమర్థించుకున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us