Telangana: అయ్యో గణపయ్యా .. లారీపై తరలిస్తుండగా ఊహించని ప్రమాదం.. ధ్వంసమైన గణేష్ విగ్రహం!
సిద్ధిపేట జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. వినాయక ఉత్సవాల నిమిత్తం ఓ భారీ గణేషుడి విగ్రహాన్ని తరలిస్తున్న లారీని మరోలారీ వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదదంలో లారీపై ఉన్న భారీ గణేష్ విగ్రహం కిందపడి ధ్వంసమైపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైలర్‌గా మారింది.

దేశవ్యాప్తంగా వినాయక చవితి శోభ మొదలైంది. గ్రామాల్లో వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసేందుకు యువకులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి విగ్రహాలను తీసుకెళ్లే వారు ఇప్పుడే గ్రామాలకు తరలిస్తున్నారు. అయితే తాజాగా హైదరాబాద్ నుంచి సిద్దిపేట జిల్లాకు తరలిస్తున్న ఓ భారీ గణేషుడి విగ్రహం ప్రమాదవశాత్తు కిందపడి పూర్తిగా విరిగిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
వివరాల్లోకి వెళ్తే.. సిద్దిపేట జిల్లాకు చెందిన కొందరు యువకులు వినాయక ఉత్సవాల కోసం హైదరాబాద్‌లో ఓ భారీ గణేషుడి విగ్రహాన్ని కొనుగోలు చేశారు. దాన్ని ఓ లారీపై ఎక్కించి స్వగ్రామానికి బయల్దేరారు. విగ్రహాన్ని తరలిస్తున్న లారీ ప్రజ్ఞాపూర్ వరకు చేరుకోగా.. అక్కడ ఉన్న ఓ ఫ్లైఓవర్ బోర్డు వినాయకుడి విగ్రహానికి తగులుతుందని గమనించి లారీని పక్కకు ఆపారు. సరిగ్గా అదే సమయంలో అటుగా వస్తున్న మరో లారీ, వినాయకుడి విగ్రహం ఉన్న లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది.
దీంతో లారీపై ఉన్న భారీ విగ్రహం కిందపడిపోయింది. ఈ ప్రమాదంలో గణేషుడి విగ్రహం పూర్తిగా ధ్వంసమైంది. అలాగే ఓ కారు కూడా స్వల్పంగా దెబ్బతిన్నట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ పెద్దగా గాయాలు కాలేదని సమాచారం. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్రేన్ సహాయంతో గణేష్ విగ్రహాన్ని, రోడ్డుకు అడ్డంగా ఉన్న లారీని పక్కకు తొలగించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఈ ఘటన నేపథ్యంలో గణేష్ మండపాలను ఏర్పాటు చేసే నిర్వాహకులకు పోలీసులు కీలక సూచనలు చేశారు. భారీ విగ్రహాలు తరలించే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, విద్యుత్ వైర్లు తగలకుండా వాటిని పైకి ఎత్తేందుకు కర్రలను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. వీలైనంత వరకు తక్కువ ఎత్తు ఉన్న మట్టి విగ్రహాలను మాత్రమే ఏర్పాటు చేయాలని కోరారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
