AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Money Tips: పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయారా? ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కించే గోల్డెన్ రూల్స్..!

How to Repay Loans: లోన్, ఈఎంఐ, క్రెడిట్ కార్డుల వినియోగం పెరగడంతో అప్పులు తీసుకోవడం చాలా ఈజీగా మారింది. అయితే వాటిని సకాలంలో తీర్చకపోతే వడ్డీ భారం పెరిగి అప్పుల ట్రాప్‌లో చిక్కుకునే ప్రమాదం ఉంది. అప్పుల నుంచి బయటపడాలంటే ముందుగా మీ ఆర్థిక పరిస్థితిపై స్పష్టమైన అవగాహన తెచ్చుకోవాలి. అప్పుల ఊబి నుంచి బయటపడేసే గోల్డెన్ టిప్స్ మీ కోసం..

Money Tips: పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయారా? ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కించే గోల్డెన్ రూల్స్..!
Debt Trap
Janardhan Veluru
|

Updated on: Sep 03, 2026 | 6:34 PM

Share

ఈ రోజుల్లో ఆర్థిక అవసరాల కోసం లోన్, ఈఎంఐ, క్రెడిట్ కార్డు వంటి సౌకర్యాలు అందుబాటులో ఉండటంతో అప్పు తీసుకోవడం చాలా సులభంగా మారింది. అయితే ఒక అప్పు తీర్చేందుకు మరో అప్పు తీసుకోవడం మొదలైతే, వడ్డీ భారం క్రమంగా పెరిగి ఆర్థిక పరిస్థితిని ఇబ్బందుల్లో పడే ప్రమాదముంది. అప్పుల నుంచి బయటపడాలంటే ముందుగా మీ ఆర్థిక పరిస్థితిపై స్పష్టమైన అవగాహన తెచ్చుకోవాలి. కొన్ని క్రమశిక్షణతో కూడిన చర్యలు తీసుకుంటే రుణభారాన్ని క్రమంగా తగ్గించుకుని.. అప్పుల ఊబి నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. అప్పుల ఊబి నుంచి బయటపడేందుకు ఆర్థిక నిపుణులు ఇచ్చే గోల్డెన్ టిప్స్ ఇక్కడ మీ కోసం..

1. మీ అప్పులన్నింటినీ ఒక చోట రాసుకోండి

అప్పుల నుంచి బయటపడే ప్రక్రియలో మొదటి అడుగు.. మీకు ఉన్న అన్ని రుణాల జాబితాను తయారు చేసుకోవడం. బ్యాంక్ లోన్, పర్సనల్ లోన్, క్రెడిట్ కార్డు బకాయిలు లేదా ఇతర అప్పులు ఏవైనా సరే ఒకచోట నమోదు చేసుకోండి. ప్రతి అప్పుకు సంబంధించి ఎంత మొత్తం బకాయి ఉంది..వడ్డీ ఎంత, నెలవారీ ఈఎంఐ ఎంత చెల్లిస్తున్నారు అనే వివరాలను రాసుకోవాలి. మొత్తం అప్పు ఎంత ఉందో స్పష్టంగా తెలిసినప్పుడే సరైన రీపేమెంట్ ప్లాన్ రూపొందించుకునే అవకాశం ఉంటుంది.

2. అధిక వడ్డీ ఉన్న అప్పును ముందుగా తీర్చండి

అన్ని అప్పులు ఒకే విధమైన వడ్డీ రేటుతో ఉండవు. ముఖ్యంగా క్రెడిట్ కార్డు వంటి రుణాలపై అధిక వడ్డీ పడే అవకాశం ఉంటుంది. అందువల్ల వీలైనంత వరకు ఎక్కువ వడ్డీ ఉన్న అప్పును ముందుగా తగ్గించే వ్యూహాన్ని సిద్ధం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో వడ్డీ రూపంలో చెల్లించే మొత్తాన్ని తగ్గించుకునే అవకాశం ఉంటుంది.

ఇవి కూడా చదవండి

3. అప్పులు ఉన్నప్పుడు కొత్త పెట్టుబడుల విషయంలో జాగ్రత్త

అప్పులపై చెల్లిస్తున్న వడ్డీ కంటే పెట్టుబడులపై వచ్చే రాబడి ఖచ్చితంగా ఎక్కువగా ఉంటుందని భావించడం సరైనది కాదు. ముఖ్యంగా అధిక వడ్డీ రుణాలు ఉన్నప్పుడు, కొత్త పెట్టుబడులు ప్రారంభించే ముందు అప్పుల భారాన్ని తగ్గించుకోవడంపై దృష్టి పెట్టడం ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రతి వ్యక్తి ఆర్థిక పరిస్థితి భిన్నంగా ఉంటుంది. అత్యవసర నిధి, తక్కువ వడ్డీ రుణాలు, పన్ను ప్రయోజనాలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకోవడం మంచిది.

4. క్రెడిట్ కార్డు వినియోగాన్ని నియంత్రించండి

అప్పులు పెరగడానికి మరో కారణం క్రెడిట్ కార్డును తరచుగా ఉపయోగించడం. ఇప్పటికే బకాయిలు పేరుకుపోయిన సమయంలో కొత్త కొనుగోళ్లను క్రెడిట్‌పై చేయడం రుణభారాన్ని మరింత పెంచుతుంది. అందువల్ల అవసరం లేని క్రెడిట్ కార్డు ఖర్చులను వెంటనే తగ్గించాలి. వీలైతే కొంతకాలం కార్డు వినియోగాన్ని నిలిపివేయాలి. అందుబాటులో ఉన్న ఆదాయంతోనే ఖర్చులను నిర్వహించే అలవాటు చేసుకోవాలి.

5. నెలవారీ బడ్జెట్‌ను కచ్చితంగా పాటించండి

అప్పుల నుంచి బయటపడటానికి ఆదాయం, ఖర్చులపై నియంత్రణ చాలా ముఖ్యం. ప్రతి నెల వచ్చే ఆదాయాన్ని ముందుగా విభజించుకుని.. ఇంటి అవసరాలు, ఈఎంఐలు, ఇతర తప్పనిసరి ఖర్చులకు ఎంత కేటాయించాలో నిర్ణయించుకోవాలి. అవసరం లేని షాపింగ్, వినోదం, ఆన్‌లైన్ కొనుగోళ్లు వంటి ఖర్చులను తాత్కాలికంగా తగ్గిస్తే ఆ మొత్తాన్ని రుణ చెల్లింపులకు మళ్లించేందుకు అవకాశం లభిస్తుంది.

(అప్పులు ముందుగా తీర్చాలా, పెట్టుబడిని కొనసాగించాలా వంటి నిర్ణయాలు వ్యక్తిగత ఆర్థిక పరిస్థితిపై ఆధారపడి ఉంటాయి. పెద్ద మొత్తంలో అప్పులు ఉన్నవారు అవసరమైతే అర్హత కలిగిన ఆర్థిక నిపుణులను సంప్రదించి సలహాలు సూచనలు తీసుకోవడం మంచిది)

Follow Us