AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chequebook: చెక్‌బుక్ పోయిందా..? వెంటనే ఇది చేయకపోతే బ్యాంక్ ఖాతా ఖాళీ కావచ్చు!

మీ చెక్‌బుక్ పోయిందా లేదా దొంగతనానికి గురైందా? వెంటనే అప్రమత్తం కావాలి. ఆలస్యం చేస్తే చెక్కులను దుర్వినియోగం చేసి ఆర్థిక మోసానికి పాల్పడే అవకాశం ఉంటుంది. బ్యాంకుకు సమాచారం ఇవ్వడం, చెక్ పేమెంట్‌ను నిలిపివేయడం, అవసరమైతే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు ఖాతా లావాదేవీలను ఎప్పటికప్పుడు గమనించడం ద్వారా నష్టాన్ని నివారించుకోవచ్చు.

Chequebook: చెక్‌బుక్ పోయిందా..? వెంటనే ఇది చేయకపోతే బ్యాంక్ ఖాతా ఖాళీ కావచ్చు!
Cheque Book
Janardhan Veluru
|

Updated on: Aug 28, 2026 | 4:57 PM

Share

చెక్‌బుక్ కనిపించకుండా పోవడం లేదా దొంగతనానికి గురికావడం చిన్న విషయం కాదు. ముఖ్యంగా బ్లాంక్‌గా ఉన్న లేదా ముందుగానే సంతకం చేసిన చెక్కులు ఇతరుల చేతికి చిక్కితే వాటిని దుర్వినియోగం చేసే ప్రమాదం ఉంటుంది. ఫోర్జరీ సంతకాలతో డబ్బులు డ్రా చేసేందుకు కూడా మోసగాళ్లు ప్రయత్నించే ప్రమాదముంది. అందుకే చెక్‌బుక్ కనిపించకపోయిన వెంటనే కొన్ని కీలక చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం.

వెంటనే బ్యాంకుకు సమాచారం ఇవ్వండి

చెక్‌బుక్ పోయిందని గుర్తించిన వెంటనే మీ బ్యాంక్‌కు సమాచారం ఇచ్చి ‘స్టాప్ పేమెంట్’ చేయించాలి. బ్యాంక్ హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసి పోయిన చెక్‌లపై చెల్లింపులను నిలిపివేయాలని కోరాలి. చాలా బ్యాంకుల్లో మొబైల్ బ్యాంకింగ్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా చెక్‌బుక్‌లోని మొత్తం చెక్‌లకు లేదా నిర్దిష్ట చెక్ నంబర్లకు స్టాప్ పేమెంట్‌ పెట్టే సదుపాయం ఉంటుంది. ఆన్‌లైన్‌లో వీలుకాకపోతే హోమ్ బ్రాంచ్‌కు వెళ్లి లిఖితపూర్వకంగా దరఖాస్తు చేయాలి. బ్యాంకు నుంచి వచ్చిన రసీదు లేదా కన్ఫర్మేషన్ నంబర్‌ను తప్పనిసరిగా భద్రపరచుకోవాలి.

పోలీసులకు ఫిర్యాదు చేయడం మంచిది

చెక్‌బుక్ దొంగతనం పోయినట్లు భావించినా, ఎక్కడో పోయినా సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి. కొన్ని ప్రాంతాల్లో డాక్యుమెంట్లు పోయినట్లు ఆన్‌లైన్‌లో ‘లాస్ట్ అండ్ ఫౌండ్’ ఫిర్యాదు చేసే అవకాశం కూడా ఉంటుంది. ఫిర్యాదులో చెక్‌బుక్‌లో ఎన్ని చెక్‌లు ఉన్నాయో, వాటిలో ఏవైనా ముందుగానే సంతకం చేసినవి ఉన్నాయో స్పష్టంగా పేర్కొనాలి. పోలీసుల నుంచి లభించిన FIR లేదా NCR కాపీని బ్యాంకుకు కూడా అందించడం మంచిది.

ఇవి కూడా చదవండి

సంతకం చేసిన చెక్కులు ఉంటే మరింత జాగ్రత్త

పోయిన చెక్‌బుక్‌లో ఇప్పటికే సంతకం చేసిన చెక్కులు ఉంటే ఈ విషయాన్ని బ్యాంకుకు తక్షణమే తెలియజేయాలి. ఖాతాలో జరిగే లావాదేవీలను క్రమం తప్పకుండా పరిశీలించడంతో పాటు SMS అలర్ట్‌లను యాక్టివేట్ చేసుకోవాలి. మీ అకౌంట్‌లో ఏదైనా అనుమానాస్పద లావాదేవీ కనిపిస్తే వెంటనే బ్యాంకును సంప్రదించాలి. ఆర్థిక మోసం జరిగినట్లు అనుమానం ఉంటే 1930కు కాల్ చేయడంతో పాటు జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలి.

చెక్‌బుక్ ఫ్రాడ్‌ను ఎలా నివారించాలి?

భవిష్యత్తులో చెక్‌బుక్ మోసాలకు దూరంగా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి.

  • ఖాళీ చెక్‌పై ముందుగానే సంతకం చేసి ఉంచకండి.
  • చెక్‌బుక్‌ను సురక్షితమైన ప్రదేశంలో భద్రపరచండి.
  • ఎవరికైనా చెక్ ఇచ్చినప్పుడు చెక్ నంబర్, తేదీ, మొత్తం వివరాలను రికార్డులో నమోదు చేసుకోండి.
  • కొత్త చెక్‌బుక్ కోసం దరఖాస్తు చేసినప్పుడు దాని డెలివరీని ట్రాక్ చేయండి.
  • పెద్ద మొత్తాల చెక్కులకు మీ బ్యాంకులో అందుబాటులో ఉన్న అదనపు భద్రతా సదుపాయాలను ఉపయోగించుకోండి.

గుర్తుంచుకోవాల్సిన విషయం

చెక్‌బుక్ పోయిన విషయం తెలిసిన వెంటనే ఆలస్యం చేయకుండా తగిన చర్యలు తీసుకోవడం ద్వారా ఆర్థిక నష్టాన్ని తగ్గించుకునే వీలుంటుంది. ఏం కాదులే అనుకుంటే మీరు ఆర్థిక మోసగాళ్ల బారినపడే ప్రమాదం ఉంటుంది.

Follow Us