బాస్ కాదు అంతకు మించి.. ఉద్యోగుల ప్రమోషన్లపై AI దే నిర్ణయం! కొత్త ప్రయోగం
ఉద్యోగులకు ప్రమోషన్ ఇవ్వాలంటే సాధారణంగా మేనేజర్లు, బాస్‌లు వారి పనితీరును రివ్యూ చేసి నిర్ణయం తీసుకుంటారు. కానీ ఓ బిలియనీర్ కంపెనీలో మాత్రం ప్రమోషన్ నిర్ణయాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ను ఉపయోగిస్తున్నారు. ఉద్యోగుల పనితీరు, సహోద్యోగుల ఫీడ్‌బ్యాక్, నాయకత్వ లక్షణాలు తదితర అంశాలను విశ్లేషించి ప్రమోషన్‌కు AI సిఫార్సు చేస్తోంది. ఈ విధానం వ్యక్తిగత పక్షపాతాలను తగ్గించి మరింత ఆబ్జెక్టివ్‌గా నిర్ణయాలు తీసుకునేందుకు ఉపయోగపడుతుందని కంపెనీ భావిస్తోంది.

ఉద్యోగుల పనితీరును అంచనా వేసి ఇంక్రిమెంట్స్, ప్రమోషన్ ఇవ్వడం సాధారణంగా మేనేజర్ల నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. అయితే ఓ బిలియనీర్ వ్యాపారవేత్తకు చెందిన కంపెనీలో మాత్రం ఈ ప్రక్రియలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఈ విషయంలో నిర్ణయం తీసుకుంటోంది. తమ కంపెనీ ఉద్యోగుల్లో ఎవరికి ప్రమోషన్ ఇవ్వాలో నిర్ణయించేందుకు AI వ్యవస్థను ఉపయోగిస్తున్నట్లు ఫుడ్-టెక్ కంపెనీ Wonder వ్యవస్థాపకుడు, బిలియనీర్ వ్యాపారవేత్త మార్క్ లోర్ వెల్లడించారు. మార్క్ లోర్‌కు చెందిన Wonderలో ఉద్యోగుల పనితీరును అంచనా వేసేందుకు ప్రత్యేకమైన AI ఆధారిత వ్యవస్థను ఉపయోగిస్తున్నారు. సహోద్యోగుల అభిప్రాయాలు, పనితీరు అంచనాలు, నాయకత్వ లక్షణాలు, ప్రవర్తన వంటి అంశాలను ఈ వ్యవస్థ పరిశీలిస్తుంది. ప్రతి ఆరు నెలలకు ఒక ఉద్యోగి పనితీరును కనీసం 12 మంది సహోద్యోగులు వివిధ అంశాలపై అంచనా వేస్తారు. వారి రేటింగ్‌లతో పాటు రాతపూర్వక ఫీడ్‌బ్యాక్‌ను కూడా AI వ్యవస్థకు అందిస్తారు. అనంతరం ఉద్యోగి పనితీరుపై ఒక సమగ్ర నివేదికను AI రూపొందిస్తుంది.
ఉద్యోగి పనితీరుని అంచనా వేయడంతో పాటు కంపెనీ Value Above Replacement (VAR) అనే ప్రత్యేకమైన ప్రమాణాన్ని కూడా ఉపయోగిస్తుంది. ఒక ఉద్యోగి స్థానంలో అదే స్థాయిలో మరో వ్యక్తిని నియమించడం ఎంత కష్టమో అంచనా వేయడమే ఈ మెట్రిక్ ఉద్దేశం. ఉద్యోగి పనితీరు స్కోర్, VAR స్కోర్ వంటి అంశాలను కలిపి AI ప్రమోషన్‌కు సిఫార్సు చేస్తుంది. దీంతో ప్రమోషన్ నిర్ణయాలు మేనజర్ వంటి వ్యక్తిగత అభిప్రాయాల కంటే డేటా ఆధారంగా, మరింత ఆబ్జెక్టివ్‌గా ఉండే అవకాశం ఉందని మార్క్ లోర్ అభిప్రాయపడ్డారు.
AI నిర్ణయమే ఫైనల్ కాదు
అయితే ఏ ఉద్యోగికి ప్రమోషన్ ఇవ్వాలన్న విషయంలో AI ఇచ్చిన సిఫార్సే తుది నిర్ణయం కాదు. AI మోడల్ ఏదైనా ముఖ్యమైన సందర్భాన్ని లేదా సమాచారాన్ని పరిగణనలోకి తీసుకోలేదని మేనేజర్లు భావిస్తే.. దాని సిఫార్సును మార్చే అవకాశం వారికి ఉంటుంది. అయితే కంపెనీ వ్యవస్థ మెరుగుపడుతున్న కొద్దీ AI సిఫార్సులతో విభేదించే సందర్భాలు తగ్గుతున్నాయని లోర్ తెలిపారు. ఉద్యోగులకు ప్రమోషన్ ఇచ్చే విషయంలో మేనేజర్ల వ్యక్తిగత అభిప్రాయాలు, పక్షపాతాలు ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మహిళలు, మైనారిటీ వర్గాలకు చెందిన ఉద్యోగుల విషయంలో సబ్జెక్టివ్ అంచనాలు ప్రతికూల ప్రభావం చూపవచ్చని లోర్ అభిప్రాయపడ్డారు. అందుకే ఒకే విధమైన ప్రమాణాలతో ఉద్యోగుల పనితీరును అంచనా వేయడం ద్వారా ప్రమోషన్ ప్రక్రియలో పారదర్శకత, సమానత్వం పెంచవచ్చని కంపెనీ భావిస్తోంది.
జీతాల్లోనూ పారదర్శకత
Wonder కంపెనీలో డేటా ఆధారిత నిర్ణయాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఈ విధానం ద్వారా తెలుస్తోంది. సంస్థలో ఉద్యోగుల స్థాయిలను తైక్వాండో బెల్ట్ ర్యాంకింగ్స్ తరహాలో వివిధ రంగులతో గుర్తించే విధానాన్ని కూడా ఉపయోగిస్తున్నారు.అంతేకాదు.. ఉద్యోగులు తమ సహోద్యోగులు ఎంత జీతం పొందుతున్నారో తెలుసుకునేలా పారదర్శకమైన పరిహార విధానాన్ని కంపెనీ అమలు చేస్తోంది.
AIతో ఉద్యోగుల భవిష్యత్తు నిర్ణయమా?
ఉద్యోగుల పనితీరు, ప్రమోషన్లు వంటి కీలక నిర్ణయాల్లో AI టెక్నాలజీని వినియోగించడం కార్పొరేట్ ప్రపంచంలో కొత్త చర్చకు దారితీస్తోంది. మానవ నిర్ణయాల్లో ఉండే పక్షపాతాన్ని తగ్గించడంలో AI ఉపయోగపడొచ్చనే వాదన ఒకవైపు ఉంటే.. ఉద్యోగి పనితీరును కేవలం డేటా ఆధారంగా అంచనా వేయడం ఎంతవరకు సరైనదనే ప్రశ్న కూడా మరోవైపు ఉంది. ఎవరికి ప్రమోషన్లు ఇవ్వాలని AI సిఫార్సు చేయడం వరకు ఓకే కానీ.. తుది నిర్ణయం తీసుకునే అధికారం మేనేజర్లకే ఉండాలన్నది కొందరి అభిప్రాయంగా ఉంది. మరికొందరు మాత్రం మేనేజర్ల పక్షపాతం లేకుండా.. పూర్తి పారదర్శకంగా పనితీరు బేరిజు వేయాలంటే ఏఐ బెస్ట్ అని అభిప్రాయపడుతున్నారు.
