AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025: ఏంటి బ్రో అంత మాట అన్నావ్! ధోనిపై టీమిండియా మాజీ క్రికెటర్ హాట్ కామెంట్స్..

ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ తమ హోం గ్రౌండ్ చెపాక్‌లో కోల్‌కతా చేతిలో చరిత్రలో అత్యంత చెత్త ఓటమిని చవిచూసింది. సునీల్ నరైన్ అద్భుత ప్రదర్శనతో KKR 10.1 ఓవర్లలోనే విజయాన్ని అందుకుంది. ఈ ఓటమి అనంతరం ధోనిపై, జట్టు వ్యూహాలపై మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ తీవ్రంగా స్పందించాడు. సీజన్‌లో ఇప్పటికే ఐదు ఓటములు మూటగట్టుకున్న CSK, వ్యూహాలు మార్చుకోకపోతే ప్లేఆఫ్స్ ఆశలు ముగిసే ప్రమాదం ఉంది.

IPL 2025: ఏంటి బ్రో అంత మాట అన్నావ్! ధోనిపై టీమిండియా మాజీ క్రికెటర్ హాట్ కామెంట్స్..
Dhoni Manoj Tiwary
Narsimha
|

Updated on: Apr 12, 2025 | 4:14 PM

Share

ఐపీఎల్ 2025 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు అనుభవజ్ఞులైన ఆటగాళ్లు ఉన్నప్పటికీ దారుణమైన ఓటమిని చవిచూసింది. శుక్రవారం చెన్నైలోని MA చిదంబరం స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) చేతిలో చెన్నై 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. మిగిలిన బంతుల పరంగా ఇది చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ చరిత్రలో చవిచూసిన అతిపెద్ద ఓటమిగా నిలిచింది. ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ధోని చెన్నై సేన 20 ఓవర్లలో కేవలం 103/9 స్కోరుకే పరిమితమైంది. అయితే డిఫెండింగ్ ఛాంపియన్స్ అయిన KKR ఈ లక్ష్యాన్ని కేవలం 10.1 ఓవర్లలోనే చేధించడం విశేషం. దీంతో CSK జట్టు ఆరు మ్యాచ్‌లలో ఐదవ ఓటమిని నమోదు చేసుకుని పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానానికి పడిపోయింది. అలాగే CSKకి ఇది తమ హోం గ్రౌండ్ అయిన చెపాక్‌లో వరుసగా మూడు మ్యాచ్‌లలో ఓటమి నమోదు కావడం కూడా ఇదే మొదటిసారి కావడం గమనార్హం.

ఈ ఘోర ఓటమి తర్వాత, భారత మాజీ క్రికెటర్, ధోనితో కలిసి ఆడిన మనోజ్ తివారీ తీవ్ర విమర్శలు చేశారు. “చెన్నై సూపర్ కింగ్స్ బండి ఇక దిగజారుతున్నట్టు కనిపిస్తోంది. గత నాలుగు మ్యాచ్‌లలోనూ ఇదే ధోరణి కనిపించింది. అనుభవజ్ఞులైన ఆటగాళ్ల షాట్ ఎంపిక చూస్తే ఏం జరుగుతోందో అర్థం కావడం లేదు,” అంటూ తివారీ వ్యాఖ్యానించారు. ముఖ్యంగా, పర్పుల్ క్యాప్ విజేత అయిన నూర్ అహ్మద్‌ను ఎనిమిదవ ఓవర్‌ దాకా బౌలింగ్‌కు తీసుకురాకపోవడంపై ప్రశ్నలు చేశారు. “సునీల్ నరైన్‌కు మొదటి బంతిలోనే వికెట్ పడింది. అప్పుడు ప్రత్యర్థి స్పిన్నర్లు ప్రభావితం చేస్తుంటే, మీ బౌలింగ్ స్టార్‌ను ముందే ఎందుకు తీసుకురాలేదు? ఇది సాధారణ క్రికెట్ సెన్స్. సాధారణంగా ధోని ఇలాంటి తప్పు చేయడు,” అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

ఇంతలో ఆయన మరో విమర్శ చేస్తూ, “ఒకవేళ మీ వద్ద ధోనిలాంటి అనుభవజ్ఞుడైన ఆటగాడు ఉంటే, అశ్విన్ బౌలింగ్‌లో ఎడమచేతివాటం బ్యాటర్లు ఉన్నా అతను స్టంప్స్ మీదుగా బౌలింగ్ చేయడం ఎలా సబబు? ఉంకా కహి నా కహి దిమాగ్ నహి చల్ రహా హై క్యా?” అంటూ ప్రశ్నించారు. ఇది కేవలం ఓ ఆటలో ఓటమి కాదు, ఇది అనుభవజ్ఞులైన ఆటగాళ్ల వ్యూహాలపై ప్రశ్నలు తలెత్తించేదిగా మారిందని ఆయన అభిప్రాయపడ్డారు.

మ్యాచ్ విషయానికి వస్తే, కోల్‌కతా నైట్ రైడర్స్ విజయానికి కారణం సునీల్ నరైన్ ఆల్‌రౌండ్ ప్రదర్శన. మొదట బౌలింగ్‌తో 3 వికెట్లు తీసి చెన్నైని 103/9 స్కోరుకే పరిమితం చేయడంలో కీలక పాత్ర పోషించాడు. మిడిల్ ఓవర్లలో కీలక వికెట్లు తీసి చెన్నై బ్యాటర్లను కట్టడి చేశాడు. అనంతరం బ్యాటింగ్‌లోనూ దూకుడుగా ఆడి 19 బంతుల్లో 44 పరుగులు చేసి, రెండు ఫోర్లు, ఐదు సిక్సర్లతో KKR లక్ష్యాన్ని చేరుకునే మార్గాన్ని సులభం చేశాడు. అతనితో పాటు డి కాక్, కెప్టెన్ అజింక్య రహానె కూడా అవసరమైన భాగస్వామ్యాలు చేసి మ్యాచ్‌ను కేవలం 10.1 ఓవర్లలో ముగించారు. చివర్లో రింకు సింగ్ (15*) అద్భుతమైన సిక్స్‌తో మ్యాచ్‌ను ముగించి, KKRకి ఈ సీజన్‌లో మూడవ విజయాన్ని అందించాడు.

ఈ విజయం ద్వారా KKR నికర రన్‌రేట్‌ను మెరుగుపరచడంతో పాటు పాయింట్ల పట్టికలో మూడవ స్థానానికి చేరుకుంది. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం తమ పాత గ్లోరీని కోల్పోతూ, అనుభవజ్ఞులున్నా ఎందుకు ఇలాంటివి జరుగుతున్నాయన్న ప్రశ్నలతో అల్లాడుతోంది. తమ వ్యూహాల్లో మార్పు చేసుకోకపోతే ఈ సీజన్ గందరగోళంగా ముగిసే అవకాశం ఉందని స్పష్టమవుతోంది.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..