IPL 2026: ‘లైఫ్ లైన్’ ఇచ్చిన మ్యాజిక్.. కేకేఆర్ ప్లేఆఫ్ చేరాలంటే ఇలా జరగాల్సిందేనయ్యో..!
Kolkata Knight Riders Playoff Scenarios: ఐపీఎల్ 2026 సీజన్‌లో వరుస ఓటములతో సతమతమవుతున్న కోల్‌కతా నైట్ రైడర్స్ ఎట్టకేలకు గెలుపు బాట పట్టింది. రాజస్థాన్ రాయల్స్‌పై సాధించిన ఈ అద్భుత విజయం కెప్టెన్ అజింక్యా రహానేకు కొత్త ఆశలను చిగురింపజేసింది. టోర్నీలో నిలవాలంటే చావో రేవో తేల్చుకోవాల్సిన స్థితిలో ఉన్న కోల్‌కతాకు ఈ రెండు పాయింట్లు సంజీవనిలా పనిచేశాయి.

Kolkata Knight Riders Playoff Scenarios: ఈ సీజన్ ఆరంభం నుంచి కోల్‌కతా నైట్ రైడర్స్ ప్రయాణం ఎంతో నిరాశాజనకంగా సాగింది. ఆడిన మొదటి ఏడు మ్యాచ్‌లలో ఐదింటిలో ఓటమి పాలవ్వగా, ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. దీంతో పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచిన ఆ జట్టు, ఆదివారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో రహానే సారథ్యంలోని జట్టులో కొత్త ఉత్సాహం నెలకొంది. అంతకుముందు ముంబై, హైదరాబాద్, లక్నో, చెన్నై, గుజరాత్ జట్ల చేతిలో కోల్‌కతా పరాజయం పాలైన సంగతి తెలిసిందే.
ప్లేఆఫ్ ఆశలు సజీవం: అజింక్యా రహానేకు లభించిన ఊపిరి..
ప్రస్తుతం పాయింట్ల పట్టికలో కోల్‌కతా 7 మ్యాచ్‌లలో ఒక విజయం, ఐదు ఓటములు, ఒక రద్దయిన మ్యాచ్‌తో మొత్తం 3 పాయింట్లు కలిగి ఉంది. నెట్ రన్ రేట్ -0.879గా ఉన్నప్పటికీ, సాంకేతికంగా ఆ జట్టుకు ఇంకా ప్లేఆఫ్ అవకాశాలు మెండుగానే ఉన్నాయి. గత కొన్ని సీజన్ల గణాంకాలను పరిశీలిస్తే, 16 పాయింట్లు సాధించిన జట్టు సులభంగా ప్లేఆఫ్ చేరుకుంటుంది. రాజస్థాన్‌పై గెలుపుతో కోల్‌కతా తన పోరాటాన్ని మళ్ళీ మొదలుపెట్టింది.
ప్లేఆఫ్ సమీకరణాలు: గెలవాల్సిందే.. నిలవాల్సిందే..!
కోల్‌కతా నైట్ రైడర్స్ ప్లేఆఫ్ చేరాలంటే ముందున్న మార్గం చాలా కఠినంగా ఉంది. ఇప్పుడు ఆ జట్టుకు మిగిలి ఉన్నవి కేవలం 7 మ్యాచ్‌లు మాత్రమే.
నేరుగా అర్హత సాధించాలంటే: మిగిలి ఉన్న 7 మ్యాచ్‌లలోనూ కోల్‌కతా విజయం సాధించాలి. అప్పుడు ఆ జట్టు ఖాతాలో 17 పాయింట్లు చేరుతాయి, ఇది ప్లేఆఫ్ స్థానాన్ని ఖాయం చేస్తుంది.
మరో మార్గం: ఒకవేళ 7 మ్యాచ్‌లలో 6 గెలిస్తే, జట్టుకు 15 పాయింట్లు లభిస్తాయి. అప్పుడు ఇతర జట్ల గెలుపోటములు మరియు రన్ రేట్‌పై ఆధారపడాల్సి ఉంటుంది.
వరుస ఓటములతో కుంగిపోయిన కేకేఆర్ అభిమానులకు ఈ విజయం ఊరటనిచ్చింది. అయితే ప్లేఆఫ్ ప్రయాణం సాఫీగా సాగాలంటే ఇకపై ప్రతి మ్యాచ్‌ను ఫైనల్‌గా భావించి ఆడాల్సి ఉంటుంది. సీనియర్ ఆటగాడు అజింక్యా రహానే తన వ్యూహాలతో జట్టును ముందుకు నడిపించగలడో లేదో వేచి చూడాలి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
