KKR vs MI IPL 2022: కేకేఆర్ బౌలర్లను చూసి సుస్సుపోసుకుంటున్న రూ.15 కోట్ల ముంబై ఆటగాడు.. రికార్డులు చూస్తే పరేషాన్..
Kolkata Knight Riders vs Mumbai Indians: నేడు కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ పుణెలో జరగనుంది. ఈ మ్యాచ్‌లో హ్యాట్రిక్ ఓటమిని తప్పించుకోవాలని ముంబై భావిస్తోంది. ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోవడంతో..
ఐపీఎల్ 2022లో, ఏప్రిల్ 6న పూణెలో ముంబై ఇండియన్స్ వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్(Mumbai Indians vs Kolkata Knight Riders) పోటీపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో అందరి దృష్టి ముంబై యువ ఓపెనర్ ఇషాన్ కిషన్(Ishan Kishan)పైనే ఉండనుంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో హాఫ్ సెంచరీలు నమోదు చేసిన ఇషాన్.. ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్నాడు. అయితే కోల్‌కతా ముందు అతను చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే కేకేఆర్ బౌలర్ల ముందు ఇషాన్ కిషన్ రికార్డు చాలా దారుణంగా ఉంది. ఉమేష్ యాదవ్, టిమ్ సౌథీ, పాట్ కమిన్స్, సునీల్ నరైన్ వంటి బౌలర్ల ముందు ఇషాన్ పరుగులు సాధించలేదు. ఐపీఎల్ 2022(IPL 2022) లో తొలి విజయం కోసం చూస్తున్న ముంబై ఇండియన్స్, KKR ముందు ఇషాన్ కిషన్ పాత రికార్డును పునరావృతం చేయడం ఇష్టపడడం లేదు. ఈ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ పెద్ద ఇన్నింగ్స్ ఆడాలని టీం కోరుకుంటున్నారు.
కేకేఆర్ బౌలర్ల ముందు విఫలమైన ఇషాన్..
ఐపీఎల్ 2022లో కేకేఆర్ తరపున బాగా రాణిస్తున్న ఉమేష్ యాదవ్‌తో ఇషాన్ తలపడే ఛాన్స్ ఉంది. అయితే, అంతకుముందు ఉమేష్ యాదవ్ బౌలింగ్‌లో ఒక బంతిని ఆడిన ఇషాన్.. ఆ బంతికే ఔట్ అయ్యాడు. అతను మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్ బౌలింగ్‌లో నాలుగు బంతులు ఆడాడు. ఆ వెంటనే ఔట్ అయ్యాడు. టిమ్ సౌథీ ముందు కూడా ఇషాన్ రికార్డు బాగోలేదు. ఈ కివీస్ బౌలర్ కిషన్ వెంటనే పెవిలియన్ చేర్చాడు. ముంబై ఇండియన్స్‌తో జరిగే మ్యాచ్‌లో పాట్ కమిన్స్ కూడా KKR ఎంపిక కోసం అందుబాటులో ఉంటాడు. ఆస్ట్రేలియా కెప్టెన్ బౌలింగ్‌లో ఐదు బంతులు ఆడిన ఇషాన్.. రెండుసార్లు ఔట్ అయ్యాడు.
ఐపీఎల్ 2022లో 2 మ్యాచ్‌ల్లో 2 అర్ధశతకాలు..
ఇలాంటి పరిస్థితుల్లో కేకేఆర్‌తో మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ లెక్కలు అతనికి మద్దతు ఇవ్వడం లేదని స్పష్టమవుతోంది. అయితే ఐపీఎల్ 2022లో ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో అతను ప్రదర్శించిన తీరు.. అతని ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ఈ సీజన్‌లో ముంబైలో జరిగిన తొలి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై అజేయంగా 81 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో కిషన్ 48 బంతులు ఎదుర్కొని 11 ఫోర్లు, రెండు సిక్సర్లు బాదాడు. ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 43 బంతుల్లో 54 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో కిషన్ ఐదు ఫోర్లు, ఒక సిక్సర్ బాదాడు. ముంబై ఇండియన్స్‌లో అత్యంత ఖరీదైన ఆటగాళ్లలో ఇషాన్ కిషన్ ఒకడు. ఐపీఎల్ 2022 వేలంలో అతని కోసం ముంబై టీం రూ.15.25 కోట్లు వెచ్చించింది.