Rohit Sharma: అతని వల్ల కాకపోతే దిగిపోవడమే జట్టుకు మంచిది.. రోహిత్ కెప్టెన్సీపై సంచలన వ్యాఖ్యలు చేసిన క్రికెట్ దిగ్గజం
సునీల్ గవాస్కర్, రోహిత్ శర్మ కెప్టెన్సీ భవిష్యత్తుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే మ్యాచ్‌లలో ఫామ్ మెరుగుపడకపోతే, రోహిత్ స్వయంగా కెప్టెన్సీని వదులుకోవచ్చని అభిప్రాయపడ్డారు. జట్టు ప్రదర్శన, రోహిత్ బ్యాటింగ్ ఫామ్ పైన ఈ వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీసాయి. రోహిత్ రాబోయే రెండు మ్యాచ్‌ల్లో ఆడే అవకాశం పొందినా, అతను పరుగులు చేయకపోతే, జట్టుపై భారంగా ఉండకూడదని భావించి, అతనే తప్పుకుంటాడని అని గవాస్కర్ వ్యాఖ్యానించారు.
భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఇటీవల రోహిత్ శర్మ కెప్టెన్సీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రోహిత్ తన చెత్త ఫామ్‌ను ఇలాగే కొనసాగిస్తే, స్వయంగా కెప్టెన్సీ నుంచి తప్పుకునే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం క్రికెట్ అభిమానుల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.
గత కొన్ని మ్యాచ్‌లలో రోహిత్ శర్మ నుంచి అనుకున్న స్థాయి ప్రదర్శన రాకపోవడం అభిమానులతో పాటు నిపుణుల నుండి విమర్శలకు దారితీసింది. ఆస్ట్రేలియాతో జరిగిన చివరి రెండు టెస్టుల్లో పెద్ద స్కోర్లు సాధించడంలో విఫలమైన రోహిత్, తన బ్యాటింగ్ ఆర్డర్‌ను 6వ స్థానానికి మార్చడం ద్వారా ప్రయోగం చేసినా అది ఫలించలేదు.
ABC స్పోర్ట్‌తో మాట్లాడిన గవాస్కర్, రోహిత్ తన కెప్టెన్సీపై నిర్ణయం తీసుకునే ముందు మరికొంత సమయం ఇచ్చే అవకాశం ఉందని, కానీ రాబోయే రెండు టెస్టుల్లో రోహిత్ ఫామ్ మెరుగుపడకపోతే, అతను స్వయంగా కెప్టెన్సీని వదులుకుంటాడని చెప్పారు.
రోహిత్ రాబోయే రెండు మ్యాచ్‌ల్లో ఆడే అవకాశం పొందినా, అతను పరుగులు చేయకపోతే, జట్టుపై భారంగా ఉండకూడదని భావించి, అతనే తప్పుకుంటాడని అని గవాస్కర్ వ్యాఖ్యానించారు.
రోహిత్ శర్మ జట్టుపై తన బాధ్యతను బాగా అర్థం చేసుకున్న నిశ్శబ్దమైన నాయకుడని ఆయన అన్నారు. “రోహిత్ చాలా చిత్తశుద్ధి గల ఆటగాడు. జట్టుపై తాను భారంగా మారవద్దని కోరుకుంటాడు. భారత క్రికెట్‌ను గురించి అతను ఎంతో శ్రద్ధతో చూసే ఆటగాడు,” అని గవాస్కర్ పేర్కొన్నారు.
ఇదే సమయంలో, గబ్బా టెస్టులో భారత జట్టు ఫాలో-ఆన్‌ను తప్పించడంపై ఆసక్తికరమైన ఘటనలు చోటుచేసుకున్నాయి. జస్ప్రీత్ బుమ్రా, ఆకాష్ దీప్ చివరి వికెట్ భాగస్వామ్యం భారత ఫాలో-ఆన్‌ను నివారించడంలో కీలకమైంది. ఈ ఘట్టం తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ గౌతమ్ గంభీర్, విరాట్ కోహ్లి సంతోషంతో హై-ఫైవ్‌లు ఇచ్చారు.