AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2026 : వాంఖడేలో సీఎస్కే సరికొత్త చరిత్ర.. ముంబైకి ఐపీఎల్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ షాక్

IPL 2026 : వాంఖడే స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ చారిత్రాత్మక విజయాన్ని అందుకోగా, ముంబై ఇండియన్స్ తన 18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలోనే ఎన్నడూ చూడని అత్యంత ఘోరమైన పరాజయాన్ని మూటగట్టుకుంది. సంజూ శాంసన్ సెంచరీతో చెలరేగితే, అకీల్ హొస్సేన్ తన స్పిన్ పంజా విసిరి ముంబైని కుప్పకూల్చాడు.

IPL 2026 : వాంఖడేలో సీఎస్కే సరికొత్త చరిత్ర.. ముంబైకి ఐపీఎల్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ షాక్
Ipl 2026
Rakesh
|

Updated on: Apr 24, 2026 | 9:14 AM

Share

IPL 2026 : ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ కేవలం ఒక ఆటగానే కాకుండా, రికార్డుల సునామీలా నిలిచిపోయింది. వాంఖడే స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) చారిత్రాత్మక విజయాన్ని అందుకోగా, ముంబై ఇండియన్స్ తన 18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలోనే ఎన్నడూ చూడని అత్యంత ఘోరమైన పరాజయాన్ని మూటగట్టుకుంది. సంజూ శాంసన్ సెంచరీతో చెలరేగితే, అకీల్ హొస్సేన్ తన స్పిన్ పంజా విసిరి ముంబైని కుప్పకూల్చాడు.

ఐపీఎల్ చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటివరకు 100 పరుగుల తేడాతో ఏ జట్టుపై కూడా గెలవలేదు. కానీ, తాజాగా ముంబైపై సాధించిన 103 పరుగుల విజయం సీఎస్కే చరిత్రలోనే అతిపెద్ద విజయంగా రికార్డు క్రియేట్ చేసింది. ఇంతకుముందు 2015లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై 97 పరుగుల తేడాతో గెలవడమే సీఎస్కే బెస్ట్ రికార్డుగా ఉండేది. వాంఖడేలో సంజూ శాంసన్ (101 నాటౌట్) ఒంటరి పోరాటం చేయగా, మిగతా బ్యాటర్లెవరూ 25 పరుగులు దాటకపోయినా చెన్నై 207 పరుగుల భారీ స్కోరు సాధించడం విశేషం.

ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్‌కు ఇది అత్యంత అవమానకరమైన మ్యాచ్. ఐపీఎల్ ప్రారంభమైన 2008 నుంచి ఇప్పటివరకు ముంబై ఎప్పుడూ 100 పరుగుల తేడాతో ఓడిపోలేదు. గతంలో 2013లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో 87 పరుగుల తేడాతో ఓడిపోవడమే ముంబైకి ఉన్న అతిపెద్ద ఓటమి. కానీ ఇప్పుడు వాంఖడే గడ్డపైనే 103 పరుగుల తేడాతో ఓడిపోయి సొంత అభిమానుల ముందే తలదించుకుంది. అంతేకాకుండా 104 పరుగులకే ఆలౌట్ కావడం అనేది సీఎస్కేపై ముంబై నమోదు చేసిన అత్యల్ప స్కోరు.

ఈ విజయంతో ముంబై ఇండియన్స్‌పై అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా చెన్నై సూపర్ కింగ్స్ రికార్డులకు ఎక్కింది. ఇప్పటివరకు ఈ రికార్డు పంజాబ్ కింగ్స్ (18 విజయాలు) పేరు మీద ఉండేది. ఇప్పుడు 40 మ్యాచ్‌లలో 19 విజయాలతో సీఎస్కే అగ్రస్థానానికి చేరుకుంది. 2023 సీజన్ నుంచి గమనిస్తే, ముంబైతో ఆడిన చివరి ఆరు మ్యాచ్‌లలో ఐదింటిని చెన్నై గెలుచుకోవడం వారి స్పష్టమైన ఆధిపత్యాన్ని చాటుతోంది.

ముంబై బ్యాటింగ్ నడ్డి విరిచింది వెస్టిండీస్ స్పిన్నర్ అకీల్ హొస్సేన్. తన 4 ఓవర్ల కోటాలో కేవలం 17 పరుగులే ఇచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఒక మెయిడెన్ ఓవర్ కూడా ఉండటం గమనార్హం. 208 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబైని అకీల్ తన స్పిన్ మాయాజాలంతో ఉక్కిరిబిక్కిరి చేశాడు. ఫలితంగా ముంబై టాప్ ఆర్డర్ మొత్తం సింగిల్ డిజిట్ స్కోర్లకే పెవిలియన్ చేరింది. ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఈ ఓటమిపై స్పందిస్తూ, పవర్ ప్లేలో వికెట్లు కోల్పోవడమే తమ కొంపముంచిందని ఒప్పుకున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us