Virat Kohli : ఐపీఎల్ చరిత్రలోనే నయా రికార్డ్.. రూ.230 కోట్లతో కింగ్ కోహ్లీ నంబర్ 1
Virat Kohli : ఫెనాటిక్ స్పోర్ట్స్ అండ్ హురూన్ నివేదిక ప్రకారం విరాట్ కోహ్లీ రూ.230 కోట్లతో ఐపీఎల్‌లో అత్యధిక సంపాదనపరుడిగా నిలిచాడు. రూ.19,200 కోట్లతో కేకేఆర్ మోస్ట్ వాల్యూబుల్ ఫ్రాంచైజీ. ప్రస్తుతం అన్ని జట్ల కలిపిన మొత్తం విలువ అక్షరాలా రూ.1.63 లక్షల కోట్లు (దాదాపు 18 బిలియన్ డాలర్లు).

Virat Kohli : ఐపీఎల్ కేవలం ఆటలోనే కాదు.. డబ్బుల వర్షం కురిపించడంలోనూ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. తాజాగా విడుదలైన ఒక అధికారిక నివేదిక ప్రకారం, ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక మొత్తం ఆర్జించిన ఆటగాడిగా టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ సరికొత్త మైలురాయిని అందుకున్నాడు. ప్రముఖ రీసెర్చ్ సంస్థలు ఫెనాటిక్ స్పోర్ట్స్, హురూన్ ఇండియా సంయుక్తంగా ప్రకటించిన మోస్ట్ వాల్యూబుల్ స్పోర్ట్స్ టీమ్స్ 2026 నివేదికలో ఈ ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. లీగ్ ప్రారంభమైన తొలి సీజన్ (2008) నుంచి ఇప్పటివరకు విరాట్ కోహ్లీ ఒకే ఒక్క ఫ్రాంచైజీ.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)కే ఆడుతూ ఈ అరుదైన ఘనత సాధించడం విశేషం.
డబ్బుల వేటలో రోహిత్, ధోనీలపై కోహ్లీ పైచేయి
ఈ నివేదిక ప్రకారం, విరాట్ కోహ్లీ ఐపీఎల్ ద్వారా ఇప్పటివరకు ఏకంగా రూ.230 కోట్ల భారీ ఆదాయాన్ని గడించి చార్ట్ లో అగ్రస్థానంలో నిలిచాడు. కోహ్లీ తర్వాత స్థానాల్లో టీమిండియా మాజీ కెప్టెన్లు రోహిత్ శర్మ, ఎంఎస్ ధోనీ నిలిచారు. ముంబై ఇండియన్స్‌కు ఐదు ట్రోఫీలు అందించిన రోహిత్ శర్మ మొత్తంగా రూ.227.2 కోట్ల సంపాదనతో రెండో స్థానాన్ని దక్కించుకోగా.. చెన్నై సూపర్ కింగ్స్ తలా, లెజెండరీ ఫినిషర్ మహేంద్ర సింగ్ ధోనీ రూ.200 కోట్ల నెట్ ఐపీఎల్ శాలరీతో మూడో స్థానంలో నిలిచారు.
రూ.1.63 లక్షల కోట్లకు చేరిన ఐపీఎల్ సామ్రాజ్యం
ఆటగాళ్ల సంపాదనే కాదు, ఐపీఎల్ లోని 10 ఫ్రాంచైజీల మొత్తం బ్రాండ్ విలువ కూడా ఊహించని స్థాయికి చేరింది. ప్రస్తుతం అన్ని జట్ల కలిపిన మొత్తం విలువ అక్షరాలా రూ.1.63 లక్షల కోట్లు (దాదాపు 18 బిలియన్ డాలర్లు) గా ఈ నివేదిక లెక్కగట్టింది. ఇందులో అందరికంటే ఆశ్చర్యకరంగా బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్‌కు చెందిన కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) అత్యంత విలువైన జట్టుగా నంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకుంది. కేకేఆర్ ప్రస్తుత మార్కెట్ విలువ ఏకంగా రూ.19,200 కోట్లు పైమాటే అని తేలింది. గ్లోబల్ లీగ్స్‌లో కేకేఆర్ బ్రాండ్ విస్తరించడం, భారీ ఫ్యాన్ బేస్ ఉండటమే దీనికి ప్రధాన కారణం.
రెండో స్థానంలో ముంబై, చెన్నై
ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్లుగా పేరు తెచ్చుకున్న అంబానీ గ్రూప్‌కు చెందిన ముంబై ఇండియన్స్ (MI), ఎన్.శ్రీనివాసన్ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ (CSK) చెరో రూ.18,400 కోట్ల బ్రాండ్ విలువతో సంయుక్తంగా తర్వాతి స్థానాల్లో నిలిచాయి. హురూన్ ఇండియా వ్యవస్థాపకుడు అనాస్ రెహమాన్ జునైద్ తెలిపిన వివరాల ప్రకారం.. భారతదేశంలో క్రీడా రంగంలోకి పెట్టుబడులు భారీగా వస్తున్నాయి. ఇదే ట్రెండ్ కొనసాగితే, వచ్చే 2032 నాటికి ఒక్కో ఐపీఎల్ జట్టు సగటు విలువ ఏకంగా 15 బిలియన్ డాలర్లకు (దాదాపు రూ.1.25 లక్షల కోట్లు) చేరుకుంటుందని అంచనా వేశారు. అంటే భవిష్యత్తులో అమెరికాకు చెందిన ఎన్ఎఫ్ఎల్ (NFL) జట్లతో మన ఐపీఎల్ ఫ్రాంచైజీలు పోటీ పడనున్నాయన్నమాట.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
