ఇంగ్లండ్‌తో పోరుకు బుడ్డోడు వద్దు.. పక్కనపెడితేనే మంచిది.. మాజీ చీఫ్ సెలెక్టర్ షాకింగ్ కామెంట్స్!
India Playing XI: ఐర్లాండ్ సిరీస్ ఓటమి గాయాల నుంచి కోలుకుని, ఇంగ్లండ్ గడ్డపై ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉంది. యువ ఆటగాళ్లకు ఇదొక అగ్నిపరీక్ష లాంటిదే. మరి మాజీ సెలెక్టర్ శ్రీకాంత్ అంచనాలకు తగ్గట్టే మేనేజ్‌మెంట్ వైభవ్‌ను పక్కన పెడుతుందా లేదా సునీల్ గవాస్కర్ లాంటి దిగ్గజాలు చెబుతున్నట్టు తొలి మ్యాచ్‌లోనే అతడికి అవకాశం ఇస్తుందా అనేది కొన్ని గంటల్లో తేలిపోనుంది.

India Playing XI: ఐర్లాండ్ చేతిలో ఎదురైన ఘోర పరాజయం తర్వాత టీమిండియా ఇప్పుడు ఇంగ్లండ్‌తో హోరాహోరీ పోరుకు సిద్ధమైంది. బుధవారం నుంచి ప్రారంభం కానున్న ఈ ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ అత్యంత ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది. అయితే ఈ కీలక పోరుకు ముందు భారత మాజీ చీఫ్ సెలెక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ ప్రకటించిన అంచనా జట్టు, అందులో ఒక సంచలన ఆటగాడికి చోటు దక్కకపోవడం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
వైభవ్ సూర్యవంశీకి ఎందుకు చోటు లేదు? శ్రీకాంత్ అసలు కారణం ఇదే..!
ఇటీవలి కాలంలో తన అద్భుతమైన ఆటతీరుతో అందరి దృష్టిని ఆకర్షించిన టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీని ఇంగ్లండ్‌తో జరిగే తొలి రెండు టీ20ల తుది జట్టు నుంచి పక్కన పెట్టడంపై శ్రీకాంత్ తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా స్పందించారు. ఐర్లాండ్‌తో జరిగిన రెండో టీ20లోనే వైభవ్‌కు వంద శాతం అవకాశం ఇచ్చి ఉండాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు. మొదటి మ్యాచ్‌లో రాణించినప్పటికీ అభిషేక్ శర్మకు విశ్రాంతినిచ్చి, వైభవ్‌ను బరిలోకి దించి ఉంటే ఫలితం వేరేలా ఉండేదని చెప్పారు. ఐపీఎల్‌లో అత్యంత క్లిష్ట పరిస్థితుల్లోనూ ఒత్తిడిని జయించి రాణించిన ఈ కుర్రాడు, బహుశా ఐర్లాండ్‌పై భారత్‌ను గెలిపించేవాడని కొనియాడారు. అయితే, అక్కడ అవకాశం ఇవ్వకుండా నేరుగా ఇంగ్లండ్ లాంటి బలమైన జట్టుపై తుది జట్టులోకి తీసుకోవడం సరికాదనే ఉద్దేశంతోనే అతడిని పక్కన పెట్టినట్లు శ్రీకాంత్ స్పష్టం చేశారు.
ఐర్లాండ్ చేతిలో చారిత్రాత్మక పరాభవం.. కుప్పకూలిన ఓపెనింగ్ జోడీ..
భారత జట్టు ఇటీవలే ఐర్లాండ్ పర్యటనలో ఊహించని విధంగా ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ముఖ్యంగా జట్టు ఓపెనింగ్ భాగస్వామ్యం ఘోరంగా విఫలమవడం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. మొదటి మ్యాచ్‌లో అభిషేక్ శర్మ 49 పరుగులు చేసినప్పటికీ, సంజూ శాంసన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. ఇక రెండో టీ20లోనైతే ఇద్దరు ఓపెనర్లు గోల్డెన్ డకౌట్‌గా పెవిలియన్ చేరి జట్టును కోలుకోలేని దెబ్బ తీశారు. మొదటి మ్యాచ్‌లో 183 పరుగుల లక్ష్య ఛేదనలో 34 పరుగుల తేడాతో ఓడిన భారత్, రెండో మ్యాచ్‌లో కేవలం ఒక్క పరుగు తేడాతో విజయాన్ని చేజార్చుకుంది. ఐర్లాండ్ చేతిలో భారత్‌కు ఇదే తొలి సిరీస్ ఓటమి కావడం గమనార్హం.
శ్రీకాంత్ ఎంపిక చేసిన భారత అంచనా తుది జట్టు..
ఇంగ్లండ్‌తో జరిగే మొదటి రెండు మ్యాచ్‌ల కోసం శ్రీకాంత్ ఎంపిక చేసిన భారత తుది జట్టు ఇలా ఉంది:
అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (ఓపెనర్లు)
ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్, తిలక్ వర్మ, శివమ్ దూబే (మిడిల్ ఆర్డర్)
అక్షర్ పటేల్ (ఆల్‌రౌండర్)
హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, ప్రిన్స్ యాదవ్ (బౌలర్లు)
భారత్ వర్సెస్ ఇంగ్లండ్ టీ20 సిరీస్ షెడ్యూల్..
మొదటి టీ20: జులై 1 (చీస్టర్-లీ-స్ట్రీట్)
రెండో టీ20: జులై 4 (మాంచెస్టర్)
మూడో టీ20: జులై 7 (నాటింగ్‌హామ్)
ఐదో టీ20: జులై 11 (సౌతాంప్టన్)
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




