IND vs ENG: రోహిత్ ఎఫెక్ట్.. 35 ఏళ్ల తర్వాత భారత క్రికెట్‌లో తొలిసారి.. కెప్టెన్‌గా సీనియర్ ఫాస్ట్ బౌలర్?
రోహిత్ శర్మ గైర్హాజరీతో జస్ప్రీత్ బుమ్రా టీమ్‌ఇండియాకు సారథ్యం వహించవచ్చు. జులై 1 నుంచి జులై 5 వరకు బర్మింగ్‌హామ్‌లో భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య టెస్టు మ్యాచ్ జరగనుంది.
టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)కు కరోనా సోకింది. కరోనా కారణంగా, రోహిత్ ప్రస్తుతం ఐసోలేషన్‌లో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంగ్లండ్‌తో బర్మింగ్‌హామ్ టెస్టులో టీమిండియా కెప్టెన్సీపై ప్రశ్న తలెత్తింది. ఎందుకంటే, గాయం కారణంగా వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ కూడా జట్టుకు దూరమయ్యాడు. అందుకే టెస్టు కెప్టెన్సీకి ప్రత్యామ్నాయంగా జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) నిలిచాడు. రోహిత్ శర్మ గైర్హాజరీలో జస్ప్రీత్ బుమ్రా టీమ్ ఇండియాకు సారథ్యం వహించగలడని విశ్వసిస్తున్నారు. జులై 1 నుంచి జులై 5 వరకు బర్మింగ్‌హామ్‌లో భారత్, ఇంగ్లండ్(IND vs ENG) జట్ల మధ్య టెస్టు మ్యాచ్ జరగనుంది.
గతేడాది భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన పటౌడీ సిరీస్‌లో బర్మింగ్‌హామ్ టెస్టు భాగమైంది. వాస్తవానికి, గత ఏడాది టీమిండియా ఇంగ్లండ్ పర్యటనలో ఉన్నప్పుడు, కరోనా కారణంగా 5వ టెస్ట్ మ్యాచ్ వాయిదా పడింది. ఇప్పుడు మళ్లీ అదే టెస్టు మ్యాచ్ జరుగుతోంది. అయితే, మరోసారి కరోనా దానిపై విరుచుకుపడే ప్రయత్నం చేసింది. ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదిక ప్రకారం, టెస్ట్ మ్యాచ్‌లో జస్ప్రీత్ బుమ్రాకు కెప్టెన్సీ బాధ్యతలు ఇవ్వవచ్చు.
భారత క్రికెట్‌లో 35 ఏళ్ల తర్వాత ఇలా..!
కెప్టెన్ రోహిత్ శర్మ కరోనా నుంచి కోలుకోకపోతే, అతని స్థానంలో జస్ప్రీత్ బుమ్రా ఆదేశాన్ని పొందినట్లయితే, 35 సంవత్సరాలలో ఒక ఫాస్ట్ బౌలర్ టీం ఇండియా టెస్ట్ జట్టుకు కెప్టెన్‌గా ఉండటం ఇదే మొదటిసారిగా నిలవనుంది. చివరిసారిగా ఫాస్ట్ బౌలర్ కపిల్ దేవ్ మార్చి 1987లో భారత టెస్టు జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు.
ఈ ఏడాది ప్రారంభంలో, దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌కు బుమ్రా భారత జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. అప్పుడు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కూడా.. తనకు అవకాశం ఇస్తే భారత్‌కు కెప్టెన్‌గా ఉండేందుకు సిద్ధమని చెప్పుకొచ్చాడు.
కెప్టెన్‌గా అవకాశం ఇస్తే గౌరవంగా భావిస్తానని బుమ్రా పేర్కొన్నాడు. ఏ ఆటగాడు నో చెప్పడని, నేను కూడా అనుకోను. దేశ జట్టుకు సారథ్యం వహించడం కంటే మెరుగైన అనుభూతి మరొకటి ఉండదని చెప్పుకొచ్చాడు.
రోహిత్ కాకపోతే ఓపెనర్ ఎవరు?
రోహిత్‌కు కరోనా పాజిటివ్‌గా ఉండటంతో టీమిండియా ముందు కెప్టెన్సీ సమస్య తలెత్తలేదు. అలా కాకుండా ఓపెనింగ్‌లోనూ తలనొప్పిని పెంచింది. భారత్ మళ్లీ ఓపెనర్‌గా హనుమ విహారి లేదా శ్రీకర్ భరత్‌లో ఎవరినైనా ఎంచుకోవలసి ఉంటుంది. వీరిలో ఎవరు శుభ్‌మాన్ గిల్‌కు భాగస్వామి అవుతారో చూడాలి.