AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

FIFA World Cup 2026 : ఫిఫా వరల్డ్ కప్ 2026కు భానుడి సెగ.. ఫ్యాన్స్ జేబులకు చిల్లు పడటం ఖాయం

FIFA World Cup 2026 : ఫిఫా వరల్డ్ కప్ 2026 సందర్భంగా డల్లాస్‌కు చేరుకున్న అభిమానులను తీవ్ర ఉపరితల వేడి ఇబ్బందులకు గురిచేస్తోంది. స్టేడియం బయట 50°C వరకు నమోదవుతున్న వేడి, ఖరీదైన తాగునీరు ఫ్యాన్స్‌కు అదనపు భారంగా మారగా, అధికారులు జాగ్రత్తలు సూచిస్తున్నారు.

FIFA World Cup 2026 :  ఫిఫా వరల్డ్ కప్ 2026కు భానుడి సెగ.. ఫ్యాన్స్ జేబులకు చిల్లు పడటం ఖాయం
Fifa World Cup 2026
Rakesh
|

Updated on: Jun 30, 2026 | 1:28 PM

Share

FIFA World Cup 2026 : అమెరికా వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్ 2026 మ్యాచ్‌లను ప్రత్యక్షంగా చూసేందుకు డల్లాస్-ఫోర్ట్ వర్త్ ప్రాంతానికి తరలివస్తున్న వేలాది మంది ఫుట్‌బాల్ అభిమానులకు ఒక సవాలు ఎదురవుతోంది. పైకి చూస్తే వాతావరణం అంత ప్రమాదకరంగా ఏమీ అనిపించకపోయినా, స్టేడియానికి చేరుకునే మార్గంలో కాంక్రీట్ భవనాలు, తారు రోడ్ల నుంచి వస్తున్న సెగలు జనాలను బెంబేలెత్తిస్తున్నాయి. ఈ అదనపు వేడి కారణంగా ఫ్యాన్స్ నడవడానికి కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.

వాతావరణ యాప్‌లను ఓపెన్ చేసి చూస్తే అక్కడ ఉష్ణోగ్రత సుమారు 32°C (90°F) గానే చూపిస్తోంది. కానీ, కింద ఉన్న రోడ్లు, ఫుట్‌పాత్‌ల ఉపరితల వేడి మాత్రం ఏకంగా 50°C (122°F) వరకు రికార్డవుతోంది. పార్కింగ్ ప్రాంతాలు, రైల్వే స్టేషన్లు, బహిరంగ మైదానాల నుంచి స్టేడియం వరకు నడుచుకుంటూ వచ్చే అభిమానులు ఈ ఊహించని భూగర్భ వేడిని తట్టుకోలేకపోతున్నారు. తారు రోడ్లు వేడిని త్వరగా పీల్చుకుని, తిరిగి అంతే వేగంగా పైకి వెదజల్లడం వల్లే గాలి కంటే భూమి పైన వేడి ఎక్కువగా ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు.

గతంలో జరిగిన ఒక రీసెర్చ్ నివేదిక ప్రకారం.. డల్లాస్ నగరంలోని వేర్వేరు ప్రాంతాలలో పర్యావరణ పరిస్థితులను బట్టి ఉష్ణోగ్రతల్లో సుమారు 5.6°C (10°F) వరకు తేడాలు ఉన్నట్లు తేలింది. పెద్ద పెద్ద పార్కింగ్ లాట్లు, వాణిజ్య సముదాయాలు ఉన్న చోట కాంక్రీట్ ప్రభావం వల్ల వేడి ఎక్కువగా ఉంటుంది. అదే సమయంలో చెట్లు, పచ్చదనం ఉన్న ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు కాస్త తక్కువగా ఉండి ఉపశమనం కలిగిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ కాంక్రీట్ వనమే ఇప్పుడు ఫ్యాన్స్ కొంపముంచుతోంది.

మ్యాచ్‌లు చూడటానికి వచ్చిన విదేశీ అభిమానులు కూడా ఇక్కడి వాతావరణంపై పెదవి విరుస్తున్నారు. అర్జెంటీనా నుంచి వచ్చిన మాథియాస్ అనే అభిమాని మాట్లాడుతూ.. నడుస్తున్నంత సేపు బానే ఉన్నా, కాసేపు ఆగగానే చుట్టూ ఉన్న బిల్డింగుల నుంచి వచ్చే వేడి ఉక్కిరిబిక్కిరి చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశాడు. స్వీడన్‌కు చెందిన విక్టర్ అనే మరో అభిమాని సైతం ఎండలో కొద్దిసేపు నడిస్తేనే శరీరం సహకరించడం లేదని, అలసిపోతున్నామని పేర్కొన్నాడు.

నగరంలోని కొన్ని ముఖ్య ప్రాంతాలలో తాగునీటి కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ, మ్యాచ్‌లు జరిగే స్టేడియం పరిసరాల్లో మాత్రం చల్లదనాన్ని ఇచ్చే ఏర్పాట్లు చాలా పరిమితంగా ఉన్నాయని అభిమానులు ఆరోపిస్తున్నారు. స్టేడియం బయట పెద్ద పెద్ద ఫ్యాన్లు, మంచు కురిపించే సిస్టమ్స్ ఏర్పాటు చేయాల్సిందని కొలంబియాకు చెందిన జువానిటా అనే మహిళా అభిమాని అభిప్రాయపడ్డారు. అన్నిటికంటే దారుణంగా ఉచిత తాగునీరు ఎక్కడా సులభంగా దొరకడం లేదని, బయట ఒక్కో వాటర్ బాటిల్‌ను 4 నుంచి 5 డాలర్ల (సుమారు రూ.350 నుంచి రూ.400) కు అమ్ముతున్నారని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అయితే, అభిమానులకు ఉన్న ఒకే ఒక్క పెద్ద ఉపశమనం ఏమిటంటే.. డల్లాస్‌లో జరిగే వరల్డ్ కప్ మ్యాచ్‌లన్నీ ఇండోర్ స్టేడియంలలోనే (ఏసీ వసతి ఉన్న క్లోజ్డ్ స్టేడియంలు) నిర్వహిస్తున్నారు. దీనివల్ల మ్యాచ్ చూసేటప్పుడు అభిమానులకు ఎండల నుంచి పూర్తి రక్షణ లభిస్తోంది. కేవలం స్టేడియం బయట నడిచేటప్పుడు మాత్రమే జాగ్రత్తగా ఉండాలని, ఎక్కువ నీళ్లు తాగుతూ, గొడుగులు వాడుతూ శరీరాన్ని కాపాడుకోవాలని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us