గంభీర్ స్వార్థం.. ఆ ఇద్దరి విషయంలో బీసీసీఐ ఘోర తప్పిదం: మాజీ ప్లేయర్
భారత క్రికెట్‌లో ఒక శకం ముగిసింది. ఆధునిక క్రికెట్ దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్ టెస్ట్ క్రికెట్‌కు గుడ్ బై చెప్పారు. అయితే, వీరి వీడ్కోలు ఏమాత్రం ఆర్భాటం లేకుండా జరిగిపోవడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. తాజాగా ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు మోంటీ పనేసర్ ఈ విషయంపై స్పందిస్తూ బీసీసీఐపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ ముగ్గురు దిగ్గజాలకు దక్కాల్సిన గౌరవం దక్కలేదని ఆయన అభిప్రాయపడ్డారు.

భారత క్రికెట్ బోర్డు (BCCI) తన ఆటగాళ్లను గౌరవించే విషయంలో వెనకబడి ఉందా? అంటే అవుననే అంటున్నారు ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్ మోంటీ పనేసర్. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్ వంటి లెజెండ్స్ టెస్ట్ క్రికెట్ నుంచి నిష్క్రమించిన తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఇంగ్లాండ్‌తో పోలిక: ఇంగ్లాండ్ బోర్డు తన సీనియర్ ఆటగాళ్లకు ఇచ్చే వీడ్కోలును పనేసర్ ఉదాహరణగా చూపారు. ఇటీవల రిటైర్ అయిన జేమ్స్ ఆండర్సన్, స్టువర్ట్ బ్రాడ్ వంటి వారికి ఇంగ్లాండ్ ఘనమైన వీడ్కోలు టెస్ట్ మ్యాచ్‌లను ఏర్పాటు చేసిందని, వారిని స్టేడియంలో వేలాది మంది అభిమానుల మధ్య గౌరవించిందని గుర్తు చేశారు. కానీ, భారత జట్టు విషయంలో అలా జరగలేదని ఆయన విమర్శించారు. పనేసర్ తన వాదనకు మద్దతుగా ఈ ముగ్గురు ఆటగాళ్ల అసాధారణ కెరీర్‌ను ప్రస్తావించాడు.
విరాట్ కోహ్లీ: 123 టెస్టుల్లో 9,230 పరుగులు చేసి, భారతదేశపు అత్యంత విజయవంతమైన టెస్ట్ కెప్టెన్‌లలో ఒకరిగా నిలిచారు.
రోహిత్ శర్మ: ఓపెనర్‌గా టెస్టుల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చి, టీమిండియాను డబ్ల్యూటీసీ (WTC) ఫైనల్‌కు చేర్చారు.
రవిచంద్రన్ అశ్విన్: 106 టెస్టుల్లో 537 వికెట్లతో అనిల్ కుంబ్లే తర్వాత భారత్ తరపున అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా చరిత్ర సృష్టించారు.
బీసీసీఐ మిస్ అయిన అవకాశం: వీరిద్దరూ (రోహిత్, కోహ్లీ) మే 2025లో టెస్టుల నుంచి తప్పుకోగా, అశ్విన్ డిసెంబర్ 2024లో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ మధ్యలో రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ ముగ్గురికీ సొంత గడ్డపై ఒక ‘ఫేర్‌వెల్ టెస్ట్’ (Farewell Test) ఆడే అవకాశం ఇచ్చి ఉంటే, అభిమానులు తమ హీరోలకు ఘనంగా వీడ్కోలు పలికేవారని, ఇది భారత క్రికెట్ చరిత్రలో ఒక మరపురాని క్షణంగా మిగిలిపోయేదని పనేసర్ అభిప్రాయపడ్డారు.
“గౌరవం అనేది అడిగితే వచ్చేది కాదు, ఇవ్వాల్సింది” అని పనేసర్ వ్యాఖ్యానించారు. కోట్లాది మందికి స్ఫూర్తినిచ్చిన ఈ ముగ్గురు ఆటగాళ్లకు మైదానంలో అందరి చప్పట్ల మధ్య వీడ్కోలు పలికే అవకాశం బీసీసీఐ కల్పించకపోవడం నిజంగా ఒక మిస్డ్ ఆపర్చునిటీ అని ఆయన పేర్కొన్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




