Ayush Mhatre : కెప్టెన్ సాబ్.. ఏమైంది? అండర్-19 వరల్డ్ కప్‌లో ఆయుష్ మ్హాత్రే ఘోర వైఫల్యం
Ayush Mhatre : అండర్-19 వరల్డ్ కప్ 2026లో భారత జట్టు దూసుకుపోతున్నా, ఆ జట్టు కెప్టెన్ ఆయుష్ మ్హాత్రే ఫామ్ మాత్రం టీమ్ మేనేజ్‌మెంట్‌కు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఫిబ్రవరి 1 ఆదివారం నాడు జరిగిన దాయాది దేశం పాకిస్థాన్‌తో హై-వోల్టేజ్ సూపర్-6 మ్యాచ్‌లో ఆయుష్ దారుణంగా విఫలమయ్యాడు.

Ayush Mhatre : అండర్-19 వరల్డ్ కప్ 2026లో భారత జట్టు దూసుకుపోతున్నా, ఆ జట్టు కెప్టెన్ ఆయుష్ మ్హాత్రే ఫామ్ మాత్రం టీమ్ మేనేజ్‌మెంట్‌కు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఫిబ్రవరి 1 ఆదివారం నాడు జరిగిన దాయాది దేశం పాకిస్థాన్‌తో హై-వోల్టేజ్ సూపర్-6 మ్యాచ్‌లో ఆయుష్ దారుణంగా విఫలమయ్యాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ముందుండి నడిపించాల్సిన కెప్టెన్, కనీసం ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరడం అభిమానులను నిరాశకు గురిచేసింది. టోర్నీ ఆరంభం నుంచి కెప్టెన్ ఆయుష్ బ్యాట్ అస్సలు ఝుళిపించడం లేదు.
అండర్-19 ప్రపంచకప్ 2026లో భారత యువ జట్టు అద్భుత ప్రదర్శన చేస్తోంది. వైభవ్ సూర్యవంశీ, విహాన్ మల్హోత్రా వంటి ఆటగాళ్లు అదరగొడుతుంటే, జట్టు కెప్టెన్ ఆయుష్ మ్హాత్రే మాత్రం వరుస వైఫల్యాలతో సతమతమవుతున్నాడు. ఆదివారం పాకిస్థాన్‌తో జరిగిన సూపర్-6 రౌండ్ మ్యాచ్‌లో ఆయుష్ ప్రదర్శన మరింత దారుణంగా ఉంది. ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ జట్టుకు వేగవంతమైన ఆరంభాన్ని ఇచ్చినా, ఆ ఉత్సాహాన్ని కెప్టెన్ కొనసాగించలేకపోయాడు. 8వ ఓవర్‌లో వైభవ్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన ఆయుష్, కేవలం రెండు బంతులు మాత్రమే ఎదుర్కొని సున్నా పరుగులకే వెనుదిరిగాడు. పాక్ బౌలర్ల వేగానికి సమాధానం చెప్పలేక అతను దొరికిపోయాడు.
ఈ టోర్నమెంట్‌లో ఆయుష్ మ్హాత్రే గణాంకాలు గమనిస్తే పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచుల్లో కలిపి అతను కనీసం 100 పరుగులు కూడా పూర్తి చేయలేకపోయాడు. మొత్తం 5 ఇన్నింగ్స్‌ల్లో కలిపి కేవలం 19.8 సగటుతో 99 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో న్యూజిలాండ్‌పై చేసిన ఒకే ఒక్క హాఫ్ సెంచరీ (53 పరుగులు) ఉంది. మిగిలిన ఇన్నింగ్స్‌ల్లో అతను సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యాడు. కెప్టెన్ స్థాయి ఆటగాడు ఇలాంటి కీలక టోర్నీలో ఫామ్ కోల్పోవడం జట్టు విజయ అవకాశాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
జట్టులోని ఇతర బ్యాటర్లతో పోలిస్తే ఆయుష్ ప్రదర్శన చాలా పేలవంగా ఉంది. అభిజ్ఞాన్ కుందు 199 పరుగులు, వైభవ్ సూర్యవంశీ 196 పరుగులు, వైస్ కెప్టెన్ విహాన్ మల్హోత్రా 172 పరుగులతో రాణిస్తున్నారు. ఆయుష్ మ్హాత్రే గత ఏడాది ఆసియా కప్‌లో కూడా అంతగా ఆకట్టుకోలేకపోయాడు. అప్పటి నుంచి అతను నిలకడలేమితో ఇబ్బంది పడుతున్నాడు. ప్రపంచకప్ నాకౌట్ దశకు చేరుకుంటున్న తరుణంలో కెప్టెన్ తన ఫామ్‌ను తిరిగి అందుకోకపోతే భారత్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి రావచ్చు.
