Champions Trophy Final: మీరే మాకు పట్టిన పెద్ద శని! న్యూజిలాండ్ పై రవిశాస్త్రి బోల్డ్ కామెంట్స్
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్‌లో భారత్, న్యూజిలాండ్ తలపడనుండగా, రవి శాస్త్రి ఆసక్తికర విశ్లేషణ అందించారు. భారత జట్టు బలంగా కనిపించినా, న్యూజిలాండ్‌ను తక్కువ అంచనా వేయలేమని ఆయన అభిప్రాయపడ్డారు. విరాట్ కోహ్లీ, కేన్ విలియమ్సన్, రాచిన్ రవీంద్ర కీలక ఆటగాళ్లుగా నిలవనున్నారని శాస్త్రి పేర్కొన్నారు. గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్ వంటి ఆటగాళ్లు మ్యాచ్‌లో మలుపు తిప్పగల సత్తా కలిగి ఉన్నారని ఆయన అభిప్రాయపడ్డారు.

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ పోరులో భారతదేశం, న్యూజిలాండ్ తలపడనుండగా, ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌పై భారత మాజీ కోచ్ రవిశాస్త్రి ఆసక్తికరమైన విశ్లేషణ ఇచ్చారు. న్యూజిలాండ్ కఠినమైన ప్రత్యర్థి అయినప్పటికీ, భారత్ ఫేవరెట్ అని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే, న్యూజిలాండ్ జట్టును తక్కువ అంచనా వేయలేమని, ఫైనల్‌లో తేలికపాటి ఆధిక్యత మాత్రమే భారతదేశానికి ఉందని కూడా పేర్కొన్నారు. ఇప్పటివరకు జరిగిన టోర్నమెంట్‌లో భారత జట్టు అద్భుతమైన ప్రదర్శన చేసింది. అన్ని మ్యాచ్‌లను విజయవంతంగా గెలిచి, సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ అయితే గ్రూప్ A లో భారత్ వెనుక రెండో స్థానంలో నిలిచి, సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాను చిత్తు చేసి ఫైనల్‌కి అర్హత సాధించింది.
“భారత్‌ను ఓడించగల జట్టు న్యూజిలాండ్ మాత్రమే” – రవిశాస్త్రి
“ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్‌ను ఓడించగల ఏకైక జట్టు న్యూజిలాండ్ మాత్రమే” అని రవిశాస్త్రి ‘ది ఐసీసీ రివ్యూ’ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. ఈ పోరు 2000 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ రిప్లేలా ఉంటుంది, ఆ సమయంలో న్యూజిలాండ్ నాలుగు వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది. ఆ టైటిల్ మ్యాచ్ తర్వాత ఇరు జట్లు ఎన్నో మార్పులను ఎదుర్కొన్నాయి. ఈసారి భారత జట్టు మరింత బలంగా కనిపిస్తున్నప్పటికీ, న్యూజిలాండ్ నుంచి కూడా సవాళ్లు తప్పవని రవిశాస్త్రి హెచ్చరించారు.
ఫైనల్‌లో అత్యంత ప్రభావం చూపే ఆటగాళ్ల గురించి మాట్లాడుతూ, విరాట్ కోహ్లీ ప్రస్తుత ఫామ్‌ను ముఖ్యమైన అంశంగా రవిశాస్త్రి హైలైట్ చేశారు. “కోహ్లీ ప్రస్తుత ఫామ్ ఆటను మార్చగల సామర్థ్యం కలిగినది. అదే సమయంలో, కేన్ విలియమ్సన్ కూడా కీలక క్షణాల్లో మ్యాచ్‌ను తిప్పగలడు” అని ఆయన పేర్కొన్నారు.
“ఈ కుర్రాళ్లు హాట్ ఫామ్ లో ఉన్నప్పుడు వాళ్లను ఆపడం చాలా కష్టం. ఒకసారి 10-15 పరుగులు చేయనిస్తే, కోహ్లీ కానీ, విలియమ్సన్ కానీ రెట్టింపు దూకుడుగా మారతారు” అని శాస్త్రి హెచ్చరించారు.
కేవలం 25 ఏళ్ల వయస్సులోనే రాచిన్ రవీంద్ర ఐసీసీ 50 ఓవర్ల టోర్నమెంట్లలో 5 సెంచరీలు సాధించి, ఈ ఘనత అందుకున్న అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు. రాచిన్ రవీంద్ర మైదానంలో తన కదలికలతోనే ఒక క్లాస్ ఆటగాడని రుజువు చేస్తాడు. క్రీజులో ముందుకు, వెనుకకు చక్కటి ఫుట్‌వర్క్‌తో ఆడతాడు. అతని బ్యాటింగ్ చూడటానికి అద్భుతంగా ఉంటుంది అని రవిశాస్త్రి అభిప్రాయపడ్డారు.
న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఇటీవలే భారత జట్టుపై 81 పరుగులు, సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాపై 102 పరుగులు చేసి మంచి ఫామ్‌లో ఉన్నాడు. అతను ఒక సాధువు లాంటివాడు అని క్రీజులో ఎంతమంది అగ్రెస్‌గా ఆడినా, అతను తన పద్ధతిలోనే కచ్చితంగా నిలిచిపోతాడు. అతను అద్భుతమైన ఆటతీరు, అత్యుత్తమ ఫుట్‌వర్క్ కలిగి ఉన్నాడు అని శాస్త్రి ప్రశంసించారు.
న్యూజిలాండ్ కెప్టెన్‌గా తన తొలి ఐసీసీ టోర్నమెంట్‌లోనే మిచెల్ సాంట్నర్ తన మేటి నాయకత్వాన్ని ప్రదర్శిస్తున్నాడు. సాంట్నర్ చాలా తెలివైన ఆటగాడు. ఈ కెప్టెన్సీ అతనికి సరిగ్గా సరిపోయింది. ఇది అతని బ్యాటింగ్, బౌలింగ్, నాయకత్వ నైపుణ్యాలను మరింత పదును పెట్టింది అని శాస్త్రి అభిప్రాయపడ్డారు.
గ్లెన్ ఫిలిప్స్ ఒక ఎక్స్-ఫ్యాక్టర్ ఆటగాడు. అతను ఒక్కరే మ్యాచ్‌ను మలుపుతిప్పగల సత్తా కలిగి ఉన్నాడు. ఫిలిప్స్ 40-50 పరుగులు సాధించి, ఒకటి లేదా రెండు కీలకమైన వికెట్లు తీసి మ్యాచ్‌ను తిరగమార్చగలడు. అతని ఫీల్డింగ్ కూడా అద్భుతమైనది అని శాస్త్రి పేర్కొన్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



